ఊస్టింగ్ మంత్రుల లిస్ట్ ఇదేనట ?

జగన్ ముఖ్యమంత్రిగా అయ్యాక తన పాతిక మంది మంత్రులను ఎంచుకున్నారు. వారికి ఆయన మొదటి క్యాబినెట్ మీటింగులోనే ఒక విషయం కచ్చితంగా చెప్పేశారు. మీ పదవి ఆయుర్దాయం [more]

Update: 2021-02-01 02:00 GMT

జగన్ ముఖ్యమంత్రిగా అయ్యాక తన పాతిక మంది మంత్రులను ఎంచుకున్నారు. వారికి ఆయన మొదటి క్యాబినెట్ మీటింగులోనే ఒక విషయం కచ్చితంగా చెప్పేశారు. మీ పదవి ఆయుర్దాయం అక్షరాలా రెండున్నరేళ్ళు మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మిగిలిన వారికి కూడా అవకాశం ఇవ్వడం కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన ఉన్న మాట కూడా చెప్పేసి కుండబద్దలు కొట్టారు. ఇపుడు కొత్త ఏడాదిలోకి రావడంతో మంత్రుల్లో కొత్త టెన్షన్ పట్టుకుంటోంది. 2021 తమకు పదవీ వియోగ సంవత్సరం కాకూడదంటూ జగన్ మంత్రులు శత కోటి దేవుళ్ళకు దండాలు పెట్టుకుంటున్నారు.

సగానికి పైగా ఎసరు….

జగన్ మొత్తం పాతిక మంది మంత్రులను తీసుకున్నారు. ఇందులో ఎంతమంది పూర్తి కాలం మంత్రులుగా అధికారంలో ఉంటారు అన్న చర్చ కనుక వస్తే ఇరవై శాతం మందికి మాత్రమే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే కేవలం అరడజన్ మంత్రులు మాత్రమే జగన్ తో పాటుగా అయిదేళ్ళూ ఉంటారన్న మాట. మిగిలిన 19 మంది మెడ మీద కత్తి వేలాడుతున్నట్లేనని అటు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మంత్రుల విషయంలో పనితీరు ఆధారంగా కూడా జగన్ మార్క్ లెక్కలు ఉంటాయని అంటున్నారు.

టిక్కు పెట్టేస్తున్న విపక్షం ….

ఇక మంత్రులను ఎంచుకునే స్వేచ్చ ఎపుడూ ముఖ్యమంత్రికి ఉంది. అలా జగన్ చాలా మందికి అవకాశాలు ఇచ్చారు. అయితే విపక్ష టీడీపీని మాత్రం కొందరు మంత్రులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో మంత్రిగా ఉండకూడదు అని టీడీపీ గట్టిగానే కోరుకుంటోంది. జగన్ ఎపుడు విస్తరణ జరిపినా ఆయన్ని తప్పిస్తారు అంటూ పదే పదే టీడీపీ నేతలు అనడాన్ని చూస్తే వారి బాధ ఏమిటో అర్ధమవుతోంది. ఇక దేవాదాయ మంత్రి వెల్లపల్లి శ్రీనివాస్ ని, కురసాల కన్నబాబుని మంత్రులుగా చూడడానికి జనసేనకు ఇష్టంలేనట్లుగా ఉందిట. వారు మొదట ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి రావడం, పవన్ని దారుణంగా విమర్శించడంతో వారికి ఊస్టింగ్ ఖాయమంటూ జనసేన ఒకటే ఊదరగొడుతోంది.

పూర్తి ప్రక్షాళన….

ఎవరెన్ని అనుకున్నా జగన్ మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే డిసైడ్ అయ్యారని అంటున్నారు. ఒక వేళ జమిలి ఎన్నికలు జరిగినా మంత్రులు దూకుడుగా ఉండాలి కాబట్టి ఈసారి జగన్ ఎటువటి మొహమాటాలకూ పోకుండా విస్తరణ చేపడతారు అంటున్నారు. అలా జాక్ పాట్ మంత్రులుగా అయిన చాలా మంది మాజీలు అవుతారు అంటున్నారు. ఇక జగన్ కొత్తల్లో కొందరి మీద వేసుకున్న అంచనాలు కూడా తప్పడంతో వారిని నిర్దాక్షిణ్యంగా తొలగిస్తారు అని అంటున్నారు. ఈ క్రమంలో ముప్పావు మంది క్యాబినెట్ మంత్రులకు 2021 అసలు అచ్చి రాదు అన్న జోస్యం అయితే గట్టిగా వినిపిస్తోంది. ఈ గండం గట్టెక్కిన వారు రాజకీయ విజేతలుగానే చెప్పాలి.

Tags:    

Similar News