జగన్ ది రిస్క్ లేని ఫార్ములా

ప్రభుత్వం పై విపక్ష నేత భారీ ఉద్యమం తలపెట్టినప్పుడో లేక ఏదైనా దీక్షకు దిగినప్పుడో గతంలో వైసిపి ఎమ్యెల్యే ఒకరు టిడిపి తీర్ధం అదే రోజు పుచ్చుకునే [more]

Update: 2019-11-17 15:30 GMT

ప్రభుత్వం పై విపక్ష నేత భారీ ఉద్యమం తలపెట్టినప్పుడో లేక ఏదైనా దీక్షకు దిగినప్పుడో గతంలో వైసిపి ఎమ్యెల్యే ఒకరు టిడిపి తీర్ధం అదే రోజు పుచ్చుకునే వారు. వెళ్లేవారు తిన్నంగా వెళ్లకుండా అప్పటివరకు వున్న పార్టీని అధినేతను నానాతిట్లూ తిట్టి తాము గోడ దూకిన వ్యవహారాన్ని గట్టిగా సమర్ధించుకునేవారు. అంతే కాదు తాము పార్టీ మారింది సొంత ప్రయోజనాలకోసం కాదని నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కాక ప్రజలు అల్లాడి పోతున్నారని వారి బాధలు తీర్చేందుకే అధికార పార్టీ లోకి చేరుతున్నట్లు ప్రకటించేవారు.

ఐదేళ్లు చంద్రబాబు…..

ఆ విధంగా మైండ్ గేమ్ తోనే ఐదేళ్ళు చంద్రబాబు తన రాజకీయం నడుపుకుంటూ వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. పార్టీకి రాజీనామా చేసి పదవికి మాత్రం చేయకుండా కొందరు వైసిపి ఎమ్యెల్యేలు మరీ ఘోరంగా మంత్రులుగా కూడా చెలామణి అయిపోయారు. వీరిపై అనర్హత వేటు అనే దానికి నాటి స్పీకర్ ఆడిన డ్రామా కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయినా విలువలు చెప్పడానికే కానీ పాటించడానికి కాదన్నట్లు టిడిపి అధికారంలో వున్నప్పుడు నడుచుకుంది. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలోనూ చంద్రబాబు చేరికలకు పెద్ద యెత్తున ప్రాధాన్యత ఇచ్చారు.

వైసిపి నియమాలతో వలసలకు బ్రేక్ …

టిడిపి నుంచి నేరుగా వైసిపిలోకి వచ్చేద్దాం అనుకున్న ఎమ్యెల్యేలకు జగన్ షరతులు ఆటంకంగా నిలిచాయి. పార్టీ మారి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలన్న షరతు వల్లే ఇప్పటివరకు బాబు వెంట వున్న వారు జంప్ చేసి ఇటు వైపు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఈ సమస్యను కొత్త తరహాలో అధిగమించడానికి వైసిపి ఫార్ములా కనిపెట్టింది. టిడిపి కి రాజీనామా చేసి తమ పదవులు ఊడిపోకుండా అధికార పార్టీలో చేరకుండా తటస్థంగా వుంటూ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఎన్నికలను ఎదుర్కోకుండా వుండే వ్యూహం గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ ఎపిసోడ్ తో తెరపైకి వచ్చింది. ఈ తరహా పదవుల్లో వున్నవారికి సైతం పనికొచ్చేదిగా ఉండటంతో ఇకపై మరిన్ని వలసలు విపక్షం నుంచి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

తికమకలో టిడిపి …

వాస్తవానికి ఈ ఫార్ములా కనిపెట్టింది కూడా గతంలో చంద్రబాబే కావడం విశేషం. తెలంగాణ లో కాంగ్రెస్ లో చేరేముందు రేవంత్ రెడ్డి విషయంలో చంద్రబాబు ఇలాగే కథ నడిపించి సక్సెస్ అయ్యారు. దాంతో రిస్క్ లేని ఈ ఫార్ములా పైనే ఇప్పుడు తమ్ముళ్ళు ఆధారపడుతున్నారు. పార్టీకి రాజీనామా చేసి స్పీకర్ ఫార్మేట్ కాకుండా పార్టీ అధినేతకు తమ పదవికి కూడా రాజీనామా అంటూ ఒక లేఖ పడేస్తే సరి అన్నది వారి అంచనా. వల్లభనేని వంశీ అదే చేశారు. దింతో ఇప్పుడు టిడిపి తికమక పడుతుంది.

ఆటపట్టిస్తున్నారే…..

గతంలో వైసిపి నుంచి అవసరం లేకపోయినా 23 మంది ఎమ్యెల్యేలను లాక్కోవడం వారిపై సొంత పార్టీ అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసినా స్పీకర్ విశేష అధికారాలతో ఐదేళ్ళు బండి లాంగిచినట్లే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ సర్కార్ ఇదే విధానం అమల్లో పెట్టినట్లే కనిపిస్తుంది. ఎవర్ని బడితే వారిని చేర్చుకోకుండా టిడిపికి గట్టిగా దెబ్బకొట్టే వారికి గేట్లు ఎత్తాలనే వ్యూహాన్ని అమలు చేస్తుంది. వచ్చే వారిని చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక పోరాటం తలపెట్టినప్పుడే స్క్రీన్ పైకి తెచ్చి సైకిల్ గాలి తీయాలన్న లక్ష్యమే నేడు వైసిపి అనుసరిస్తుండటం గమనార్హం. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అన్న చందంగా చంద్రబాబు కు షాక్ ల మీద షాక్ లిస్తూ ఎపి యువ ముఖ్యమంత్రి జగన్ ఆట పట్టిస్తున్నారు.

Tags:    

Similar News