అది కనుక జగన్ చేస్తే బహు మొనగాడే…?

ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు కట్టడానికే యుగాలూ జగాలూ పడుతోంది. అలాంటిది లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరీ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం అంటే [more]

Update: 2020-12-29 08:00 GMT

ఈ రోజుల్లో ఒక చిన్న ఇల్లు కట్టడానికే యుగాలూ జగాలూ పడుతోంది. అలాంటిది లక్షల కోట్లు ఖర్చు పెట్టి మరీ కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం అంటే ఒక విధంగా అసాధ్యమనే చెప్పాలి. కానీ చంద్రబాబు నవ్యాంధ్ర తొలి సీఎం హోదాలో ప్రపంచంలోనే టాప్ వన్ రాజధానిని నిర్మిస్తామని చెప్పేశారు. ఆయనకు అప్పటికి సైబరాబాద్ సిటీ రూపశిల్పిగా ఉన్న బ్యాక్ గ్రౌండ్ ని కూడా జనం నమ్మి ఓటేశారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే.

అతి పెద్ద భూసేకరణ….

చంద్రబాబు స్కెచ్ ఏంటో తెలియదు కానీ ఆర్భాటం మాత్రం ఆకాశాన్ని తాకే రేంజిలో చేశారు. భూసేకరణ పేరిట 33 వేల ఎకరాలను సేకరించారు. ఇంత అవసరమా అంటే దానికి తమ్ముళ్ళు అవును అనే అంటారు. కానీ ఇపుడు అదంతా కట్టడాలతో కళకళలాడాలన్నా, బాబు ప్రవచిత నవ నగరాలు నిర్మాణం కావాలన్నా కూడా మరో మూడు నాలుగు దశాబ్దాల కాలమే కాదు, లక్షల కోట్ల రూపాయల ఖర్చు కూడా అవుతుంది. అంత డబ్బు ఏ ప్రభుత్వానికీ లేదు, రాదు, అందువల్ల జగన్ సింపుల్ గా రెడీమేడ్ రాజధాని అయిన విశాఖకు ఓటేశారు అక్కడ నుంచే పాలన అంటున్నారు.

పైసా ఖర్చు లేకుండా….

ఇక్కడే జగన్ సరికొత్త సవాల్ చేస్తున్నారు. ఇది జనాలకు కూడా బుర్రలోకి ఎక్కే లాజిక్ పాయింట్ గా కూడా ఉండబోతోంది. చంద్రబాబు రైతులు ఉచితంగా భూములు ఇచ్చారని ఎంత ఊదరగొట్టినా వారికి ఏటా కౌలు మొత్తం చెల్లించేలా ఒప్పందాలు కుదిరాయి. ఇక అభివృద్ధి చేసిన భూమిని రైతులకు ప్లాట్స్ గా కూడా ఇవ్వాలి. ఇలా ఒప్పందం ప్రభుత్వం చేసుకున్న తరువాత ఖజానాకు అది పెను భారమే తప్ప ఉచితం ఎలా అవుతుంది. అయినా చంద్రబాబు అండ్ కో మాత్రం రైతుల త్యాగం అంటూ పాత పాటనే పాడుతూంటారు. ఈ సమయంలో జగన్ విశాఖ రాజధానికి పైసా ఖర్చు లేకుండా ఏర్పాటు చేస్తామని అంటున్నారు. అది నిజంగా ఇద్దరు నాయకుల మధ్యన ఒక పోలికను చర్చను పెట్టేలాగే కనిపిస్తోంది.

ప్రభుత్వ భూముల్లోనే ….

విశాఖలో ప్రభుత్వ భూములు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటితో పాటుగా కబ్జా కోరల్లో చిక్కుకున్న భూములను కూడా విడిపిస్తే ప్రభుత్వ అవసరాలే కాదు ఇతర రకాలైన అభివృద్ధికి కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. అందుకే వైసీపీ సర్కార్ ఈ లెక్కలన్నీ వేసుకుని మరీ పైసా ఖర్చు చేయకుండా రాజధానిని విశాఖలో ఏర్పాటు చేస్తామని చెబుతోంది. కేవలం భవనాలు కట్టడానికి మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది తప్ప ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఏ రకమైన సమీకరణలు ఉండవు కాబట్టి కౌలు మొత్తాలు, వేరే ఒప్పందాలకు కూడా ఆస్కారం ఉండదు. జగన్ కనుక విశాఖలో ప్రభుత్వ భూముల్లో రాజధానికి ఏర్పాటు చేస్తే కచ్చితంగా టీడీపీ ఎంత నష్టం ఖజానాకు చేసింది అన్నది సామాన్య జనాలకు సైతం బాగా అర్ధమై తీరుతుంది. అది జరగాలనే జగన్ పట్టుబట్టి మరీ విశాఖ రాజధాని కావాలంటున్నారు.

Tags:    

Similar News