బీజేపీ కార్డుని వాడేస్తున్న జగన్ ?

ఏపీలో బీజేపీ రాజకీయం చేయాలంటే మతం కార్డునే తీయాలి. అంతర్వేది రధం దహనం ఘటనతో తన అజెండా ఏంటో బీజేపీ చెప్పేసింది. మరి ఆ పార్టీ మంచికో [more]

Update: 2020-12-22 06:30 GMT

ఏపీలో బీజేపీ రాజకీయం చేయాలంటే మతం కార్డునే తీయాలి. అంతర్వేది రధం దహనం ఘటనతో తన అజెండా ఏంటో బీజేపీ చెప్పేసింది. మరి ఆ పార్టీ మంచికో మరే దానికో అన్నట్లుగా తిరుపతిలోనే ఉప ఎన్నిక వచ్చిపడింది. అసలే ప్రపంచ దేవుడు తిరుమల శ్రీనివాసుడు. ఆయన సన్నిధిలోనే ఉప ఎన్నిక అంటే బీజేపీ ఊరుకుంటుందా. కచ్చితంగా మతం కార్డునే వాడుతుంది. ఇక జగన్ స్వతహాగా క్రిస్టియన్. అది ఆయన ఏనాడూ దానిని ఎక్కడా దాచుకోలేదు. పైగా ఆయన తండ్రి నుంచి తాత నుంచి కూడా అదే మతాన్ని నమ్ముతున్నారు. కానీ ఇపుడు బీజేపీకి అర్జంటుగా జగన్ మతం గుర్తుకువస్తోంది అంటే అది పచ్చి రాజకీయమే తప్ప మరేమీ కాదు.

అదే ఆయుధంతో….

ఇక జగన్ కూడా తాను ఏ మతానికి చెందినా కూడా హిందూ విశ్వాసాలను కచ్చితంగా నమ్ముతాను అని ఇప్పటికే చెప్పేశారు. బ్రహ్మోత్సవాల విషయంలో నానా యాగీ చేసిన బీజేపీ టీడీపీలకు గుణపాఠం వచ్చేలాగా తిరునామాలను ధరించి మరీ జగన్ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇపుడు జగన్ తిరుపతి ఉప ఎన్నికలవేళ అలాంటిదే మరో పని చేయబోతున్నారు. ఇది బీజేపీకి కూడా ఇబ్బందికరమే అనడంలో సందేహంలేదు. కానీ జగన్ మాత్రం తాను ప్రభుత్వ పెద్దగా ఆ పని చేస్తున్నారు. విశాఖలో భవ్యమైన తిరుమల తిరుపతి శ్రీనివాసుడి ఆలయాన్ని ఆయన త్వరలో ప్రారంభించబోతున్నారు.

అదే ముహూర్తాన ….

తిరుపతి ఉప ఎన్నిక ఫిబ్రవరిలో జరగవచ్చు అన్నది ఒక అంచనా. దాంతో అదే నెలలో నోటిఫికేషన్ కి కాస్తా ముందుగానే విశాఖలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ముఖ్యమంత్రి హోదాలో జగన్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. విశాఖ సాగర తీరాన రుషికొండ వద్ద విశాలమైన ప్రాంగణంలో తిరుమల దేవుడి ఆలయాన్ని టీటీడీ చకచకా నిర్మిస్తోంది. ఈ ఆలయ నిర్మాణం కోసం ఏకంగా 28 కోట్ల రూపాయలను టీటీడీ ఖర్చు చేస్తోంది. దీనికి సంబంధించిన పనులను చూసేందుకు ఈ మధ్యనే టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విశాఖ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఫిబ్రవరిలో ఈ ఆలయాన్ని పారంభిస్తారని కూడా సుబ్బారెడ్డి తెలిపారు.

ఆధ్యాత్మిక రాజధానిగా…?

విశాఖను పాలనారాజధానిగా ప్రకటించిన జగన్ దానికంటే ముందుగా ఆధ్యాత్మిక రాజధానిని చేస్తున్నారు. విశాఖలో తిరుమల తరహాలో ఆలయం ఏర్పాటు చేయడం అంటే ఆస్తిక జనులకు అది సౌభాగ్యంగానే అంతా భావిస్తున్నారు. అచ్చం తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా స్వామి వారి అర్చనలు జరుగుతాయి. దీంతో ఈ ఆలయ నిర్మాణం అన్నది విశాఖకు వరంగా అంతా భావిస్తున్నారు. ఇక జగన్ కూడా ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా హిందూ భక్తుల మనసును దోచుకుంటారన్నది వైసీపీ నేతల భావన. మరో వైపు తిరుపతి తో హిందూ కార్డుని ఉపయోగించాలని చూస్తున్న బీజేపీకి విశాఖ నుంచే జగన్ వేసే రాజకీయ బాణంగా కూడా దీన్ని చూస్తున్నారు.

Tags:    

Similar News