పుట్టినచోటే పుట్టె ముంచాలనేనా?

వైఎస్సార్ పేరు చెబితే అందరివాడు అన్న భావన కలుగుతుంది. ఆయన బతికుండగా ముఖ్యమంత్రిగా రెండు సార్లు చేసినపుడు కూడా ఆయన ఫలనా వారి పక్షమని మాట వినిపించేదికాదు, [more]

Update: 2019-11-18 15:30 GMT

వైఎస్సార్ పేరు చెబితే అందరివాడు అన్న భావన కలుగుతుంది. ఆయన బతికుండగా ముఖ్యమంత్రిగా రెండు సార్లు చేసినపుడు కూడా ఆయన ఫలనా వారి పక్షమని మాట వినిపించేదికాదు, ఇక ఆయన కులమే కాదు, మతం ప్రస్తావన కూడా ఎక్కడా వచ్చేది కాదు. జగన్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో మతం కార్డు ని బాగా విపక్షాలు వాడేవి. ఈ విషయంలో టీడీపీ ఎక్కువగా జగన్ ని టార్గెట్ చేసేది. జగన్ క్రిస్టియన్ అని ఆయన వస్తే హిందూ దేవాలయాలు అన్నీ కూడా ఉండవని విపరీతమైన ప్రచారం చేసింది. 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడానికి ఇది ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. ఇక జగన్ కుల పిచ్చి ఉందని, ఆయనకు బీసీలు గిట్టరని కూడా ప్రచారం చేశారు. అయితే 2019 ఎన్నికల నాటికి అన్నింటినీ సర్దుకుని జగన్ అందరి వాడుగా నిలబడ్డారు. ఫలితంగానే ఆయనకు అఖండ విజయం దక్కింది.

ఆ ముద్ర పోవాలనే…..

ఇక జగన్ అధికారంలోకి వచ్చాక రెడ్డి సామ్రాజ్యం అన్న ముద్ర వేస్తూ వచ్చారు. ఆయన తన వర్గం వారికే ప్రోత్సహిస్తున్నాడని కూడా ఆరోపించారు. దానికి విరుగుడు అన్నట్లుగా జగన్ 51 మంది రెడ్లు గెలిచిన పార్టీలో కేవలం నలుగురిని మాత్రమే తీసుకుని బీసీలు, ఎస్టీలు, కాపులు ఎస్సీలు ఇలా బలహీన వర్గాల వారికే మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారు. ఇక నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలు, ఇతర వర్గాలకు యాభై శాతం రిజర్వేషన్లు అంటూ జగన్ చట్టానే తెచ్చారు. ఇపుడు జగన్ మరింతగా ముందుకు పోయి టీడీపీలో మిగిలిన వర్గాలను కూడా ఆకట్టుకుంటున్నారు.

కమ్మలకు పెద్ద పీట….

జగన్ పార్టీ అంటే రెడ్డీల పార్టీ అని కమ్మలు ఇప్పటివరకూ భావిస్తూ వచ్చారు. దాన్ని తిప్పికొడుతూ అందరి పార్టీగా తయారు చేయడానికి జగన్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఏపీలో మరో బలమైన సామాజికవర్గంగా ఉన్న కమ్మలను కూడా తన వైపు తిప్పుకుంటున్నారు. అధికారంలోకి వస్తూనే కృష్ణా జిల్లాకు చెందిన కొడాలి నానికి మంత్రి పదవి ఇచ్చిన జగన్ అదే వరసలో మరో కమ్మ ప్రముఖుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కి అధికార భాషాసంఘం చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇక తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి చాన్స్ ఇచ్చారు. అదే విధంగా పార్టీలో తనతో పాటే ఉన్న తలశిల రఘురాంకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. అదే విధంగా వాసిరెడ్డి పద్మకు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా అవకాశం ఇచ్చారు. ఈ నలుగురికీ క్యాబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వడం విశేషం. పైగా వీరంతా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వారు కావడం గమనార్హం.

అందరి వాడుగా….

ఇక టీడీపీలో ఉన్న కమ్మలను కూడా సమాదరించడం ద్వారా అందరివాడు అనిపించుకోవాలని ఒక ఆలోచన అయితే టీడీపీ ఆయువు పట్టు మీద దెబ్బ కొట్టాలన్నది జగన్ మరో ఆలోచన. నిజానికి వైఎస్సార్ పాలన సమయంలో కమ్మలను బాగా ఆదరించారు. అప్పట్లో పాలడుగు వెంకటరావు, లగడపాటి రాజగోపాల్, మాగంటి బాబు, రాయపాటి సాంబశివరావు, గల్లా అరుణకుమారి ఇలా చాలామంది కమ్మ వారికి అవకాశాలు ఇస్తూ పోయారు. ఇపుడు జగన్ కూడా అదే విధంగా కమ్మలను తనవైపు తిప్పుకోవాలనుకుంటున్నారు. దీని మీద సొంత పార్టీలో కొంత వ్యతిరేకత వస్తున్నా జగన్ దీర్ఘకాలిక ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. దీంతోనే ఇపుడు వల్లభనేని వంశీ, దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ వంటి వారు ఫ్యాన్ పార్టీ నీడన చేరారని అంటున్నారు. కృష్ణా జిల్లాలో పట్టున్న కమ్మ నేతలను తనవైపునకు తిప్పుకోవడం ద్వారా జగన్ టీడీపీకి పుట్టిన చోటనే పుట్టె ముంచాలనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News