జగన్ కి ఒక్క చాన్సేనట

అదేదో సినిమాల్లో ఒక్క చాన్స్ అంటూ వేషం కోసం ఒక జూనియర్ ఆర్టిస్ట్ అడుగుతూ ఉంటుంది. అలా అడగడం అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికని దాని [more]

Update: 2019-11-15 06:30 GMT

అదేదో సినిమాల్లో ఒక్క చాన్స్ అంటూ వేషం కోసం ఒక జూనియర్ ఆర్టిస్ట్ అడుగుతూ ఉంటుంది. అలా అడగడం అంటే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికని దాని అర్ధం. రాజకీయాల్లోనూ అంతే కదా, మాకొక చాన్స్ ఇవ్వండి అని మోడీ 2014 లో అడిగారు, జనం ఇచ్చారు. ఇక ఆయన పాతుకుపోయి రెండవ చాన్స్ కూడా తీసేసుకున్నారు కదా. ఏపీ విషయంలో మాత్రం అలాంటివి అసలు కుదరవు అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఒక్క చాన్సే జగన్ గుర్తుపెట్టుకో, ఎన్నికలు ఎపుడొచ్చినా దిగిపోవాల్సిందేనని కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. అంటే జగన్ కి సీఎం కుర్చీ ఇచ్చింది ఒక్కసారికేనట. తరువాత మళ్ళీ గద్దెనెక్కేది తనేనంట. ఇదీ చంద్రబాబు గారి మార్క్ రాజకీయం. ఏపీ ప్రజలు మంచి వారు కాబట్టి ఒక్క చాన్స్ అంటూ అడిగితే ఇచ్చారని, అయితే జగన్ గద్దెనెక్కి వారి జీవితాలకు మరణ శాసనం రాసిపారేశారని బాబు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదో పోనీలేనని ఒక్క చాన్స్ ఇస్తే జగన్ ఇంతపని చేస్తాడా అంటూ హూంకరిస్తున్నారు.

ముప్పయ్యేళ్ళు అంటున్నారుగా…?

మరో వైపు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో కష్టపడి ప్రజల మన్ననలు అందుకుని ఏపీకి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని చెబుతున్నారు. అలా వచ్చిన జగన్ కి ప్రజలకు ఏది మంచి చేయాలో తెలియదా అని కూడా అంటున్నారు. జగన్ ముప్పయ్యేళ్ళ పాటు తాను ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్పి మరీ గద్దెనెక్కారని బొత్స గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఏదో అధికారం దొరికింది కదా అని తేలికగా నిర్ణయాలు తీసుకుని ప్రజాభిమానాన్ని పోగొట్టుకోవడానికి జగన్ మరీ అమాయకుడు కాదని కూడా సీనియర్ మంత్రి అంటున్నారు. జగన్ ప్రకటిస్తున్న ప్రతి పధకం ప్రజల కోసమేనని, ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల నుంచి సేకరించి పొందుపరచినవేనని బొత్స అంటున్నారు. అంటే బొత్స మాటలను బట్టి తీసుకుంటే జగన్ ఒక్క ఛాన్స్ కాదు మరో అయిదారు చాన్సులు గద్దె దిగే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. మరి బాబు మాత్రం ఒక్క సారి ఆలా కూర్చుని వెంటనే దిగిపోయి కుర్చీ అప్పగించాల్సిందేనని ఖండితంగా చెప్పేస్తున్నారుగా.

వ్యూహాత్మకంగానా?

చంద్రబాబు ఏ మాట అన్నా అందుకో వ్యూహం దాగి ఉంటుంది. ఈ ఒక్క చాన్స్ మాట వెనక కూడా చాలా విషయమే ఉందని అంటున్నారు. ఒక్క చాన్స్ ఇచ్చారు, మళ్ళీ జగన్ కు ఇవ్వవద్దు అని జనాలకు అన్యాపదేశంగా బాబు హెచ్చరికలు, విన్నపాలు చేస్తున్నట్లుగా కూడా అర్ధం చేసుకోవాలి. అదే సమయంలో ఘోరమైన ఓటమితో క్షీణించిపోయిన టీడీపీ మళ్ళీ కోలుకుంటుందని, తేరుకుంటుందని క్యాడర్ కి కూడా భరోసా ఇస్తున్నట్లుగా కూడా విశ్లేషించుకోవాలి. ఒక్క చాన్స్ మాత్రమే జగన్ కి మళ్ళీ మనమే కాబోయే కింగులమని పసుపు తమ్ముళ్ళకు చెప్పడానికి కూడా పదే పదే ఈ మాటను బాబు వాడుతున్నారు. ఇక జనాలను మోసం చేసి జగన్ ఒక్క చాన్స్ సంపాదించారని కూడా విమర్శ కూడా అందులో ఉంది. మొత్తం మీద జగన్ కి జనాలు ఎన్ని అవకాశాలు ఇస్తారో తెలియదు కానీ బాబు మాత్రం ఒక్క ఛాన్స్ జగన్ కు బలవంతంగా ఇచ్చారనుకోవాలి. రేపటి ఎన్నికల్లో జగన్ ఓడిపోవాలని ఆయన మనసారా కోరుకుంటున్నారు. మరి జగన్ ది ఒక్క చాన్స్ ముచ్చటా, లేక బాబు మాదిరిగా మూడు సార్ల ముఖ్యమంత్రి ముచ్చట అన్నది కాలమే తీర్పు చెప్పాలి.

Tags:    

Similar News