రాష్ట్రపతిపాలన…ఎందుకంట…?

రాష్ట్రపతి పాలన ఏపీలో పెట్టాలి. అంతేనా జమిలి ఎన్నికలు పెట్టేయాలి. జగన్ బెయిల్ రద్దు చేసి అర్జంటుగా జైల్ కి పంపించాలి. ఏపీలో ఎప్పటికీ శాశ్వతంగా ఒకే [more]

Update: 2020-10-20 02:00 GMT

రాష్ట్రపతి పాలన ఏపీలో పెట్టాలి. అంతేనా జమిలి ఎన్నికలు పెట్టేయాలి. జగన్ బెయిల్ రద్దు చేసి అర్జంటుగా జైల్ కి పంపించాలి. ఏపీలో ఎప్పటికీ శాశ్వతంగా ఒకే పార్టీ అధికారంలో ఉండాలి. ఇదేనా ప్రజాస్వామ్య స్పూర్తి. సీనియర్ మోస్ట్ నాయకుడు సారధిగా ఉన్న టీడీపీలో గత ఏడాదిన్నరగా ఇలాంటి వింత వింత డిమాండ్లే ముందుకు వస్తున్నాయి. ప్రజాస్వామ్యం విశ్వాసం ఉంచే రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. కచ్చితంగా గెలుస్తామని అనుకున్నా ఓడినా కూడా ప్రజా తీర్పుని శిరసా వహిస్తామని చెప్పుకుంటాయి. మరి ఆ సహనం ఏమైంది అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

ఆయన అలా….

పేరుకు వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు మాటా, పాటా అన్నీ టీడీపీ సౌండే అంటారు. ఆయన తాజాగా ఏపీలో రాష్ట్రపతిపాలన విధిస్తారు అంటూ జోస్యం చెబుతున్నారు. రాజ్యాంగ సంక్షోభం ఏపీలో ఏర్పడింది అని అంటున్నారు. అదేలా అంటే కోర్టులతో ప్రభుత్వం ఢీ కొడుతోందిట. అందువల్ల అర్జంటుగా జగన్ ని గద్దె దింపేయాలని ఆయన గారి కోరిక, టీడీపీ తమ్ముళ్ళు కూడా ఇదే విధమైన మాటలే మాట్లాడుతున్నారు. నిజానికి జగన్ లేవనెత్తిన అంశాలు ఇపుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి పరిశీలనలో ఉన్నాయి. వాటి విషయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇంతలోనే అంతలా ప్రత్యర్ధులు
రెచ్చిపోవడం అంటే అది కచ్చితంగా జగన్ మీద వ్యతిరేకతేనని అంతా అంటున్నారు.

గొంతు చించుకుంటున్నారుగా….?

జగన్ ఒక ముఖ్యమంత్రిగా తన అభిప్రాయాలను చెప్పారు. ఆయన అయిదు కోట్ల మంది ప్రజల తరఫున ప్రతినిధి. తన ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్రలు జరుగుతున్నాయని మొర పెట్టుకున్నారు. అందులో న్యాయం ఎంత ఉంది, ఆయన కోరుకుంటున్నది ఏంటి అన్నది ఇక్కడ చూస్తారు కదా. ప్రాధమికంగా ఇదే కదా జరిగేది ఇంతలోనే ఏదో సమరం అని, ఘర్షణ అని గొంతు చించుకుంటున్న వారు రాజ్యాంగ వ్యవస్థలను ఎంతవరకూ తాము గౌరవిస్తున్నారు అన్నది కూదా గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందేమో కదా. ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వాన్ని దిగిపోమని తరచూ కోరడం ఏ రాజ్యాంగ స్పూర్తి అవుతుందో వారే చెప్పాలిగా.

ఏం జరుగుతుంది….?

జగన్ ఒక వ్యక్తిగా తాను వ్యవస్థలను దూషిస్తే అది కచ్చితంగా ఇబ్బందే అవుతుంది. కానీ ఆయన ముఖ్యమంత్రిగా తన వాదన వినిపిస్తున్నారు. దాని మీద పరిష్కార చర్యలు కోరుతున్నారు. ఈ విషయంలో ఒక రకంగా అర్ధవంతమైన చర్చ జరగాలని కూడా అన్యాపదేశంగా కోరుకుంటున్నారు. అందువల్ల దాన్ని పరిశీలించి ప్రభుత్వం వైపున ఉన్న సమస్యలు కూడా చూసేందుకు కూడా వీలు అవుతుందని అంటున్నారు. ఈ విషయాన్ని ఘర్షణలా చూడకుండా సామరస్యంగా పరిష్కరించేందుకు కూడా మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ దేశంలో వ్యవస్థలు అన్నీ కూడా ఉన్నవి అంతిమంగా ప్రజల మేలు కోసమే.

పొరుగు రాష్ట్రాలకు ….

ఏపీ హై కోర్టులో వస్తున్న తీర్పుల మీద ప్రభుత్వం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో తమిళనాడులో కానీ, కర్నాటకలోని హైకోర్టులలో కానీ ప్రభుత్వం తరఫున కేసులు విచారణ జరిపేలా చర్యలు తీసుకోవచ్చునని న్యాయవాదులు సూచిస్తున్నారు. ఇది మంచి పరిష్కారమే అవుతుంది అంటున్నారు. అప్పట్లో తమిళనాడు సీఎం జయలలిత అక్రమ‌ ఆస్తుల కేసుల విషయంలో కూడా తనకు తమిళనాడు మీద నమ్మకం లేదని ఆమె చెప్పడంతో కర్నాటకలో ఆ కేసులు విచారణ జరిగిన సగంతి గుర్తు చేస్తున్నారు. ఇలా అనేక రకాలైన సూచనలు వస్తున్న నేపధ్యంలో ఏపీలో రాష్ట్రపతి పాలన పెడతారు, జగన్ కి అరవై నెలల జైలు జీవితం మళ్ళీ సంప్రాపిస్తుంది అని తమ్ముళ్ళతో పాటు, జగన్ వ్యతిరేకులు చెప్పడం అతి ఉత్సాహమే అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News