ఈ పిచ్చి నీకూ పట్టుకుందా జగనూ?

రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీ పధకం మీద వైఎస్ కుటుంబం ముద్ర ఉండడం ఇపుడు చర్చకు దారితీస్తోంది. నిజానికి [more]

Update: 2020-06-19 13:30 GMT

రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతీ పధకం మీద వైఎస్ కుటుంబం ముద్ర ఉండడం ఇపుడు చర్చకు దారితీస్తోంది. నిజానికి దీన్ని కూడా వివాదం చేసి కోర్టుల ద్వారా మొట్టికాయలు పెట్టించాలని టీడీపీ నేతలు రెడీ అవుతున్నారుట. ఇంతకీ విషయమేంటంటే గత చంద్రబాబు సర్కార్ లో కూడా అనేక పధకాలకు మామా, అల్లుళ్ళ పేర్లు పెట్టుకున్నారు. ఆ జమానా ముగియగానే అవే పధకాలు పేర్లు మార్చి అమలు చేస్తున్నారని పసుపు పార్టీ గోడుమంటోంది. అంతే కాదు, మరీ ఇంత ఎక్కువగా వైఎస్ నామస్మరణ చేస్తారా అంటూ తమ్ముళ్ళు మండిపడుతున్నారు.

పదుల సంఖ్యలో ….

నిజానికి జగన్ కి ప్రచారం ఇష్టం ఉండదని అంటారు, కానీ జరుగుతున్నది చూస్తూంటే అచ్చం టీడీపీ అడుగుజాడల్లోనే ఈ సర్కార్ కూడా నడుస్తోందన్న భావన కలుగుతోంది. వారి కంటే నాలుగాకులు ఎక్కువ చదివిన చందంగా కూడా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోంది. జగన్ పేరిట జగనన్న అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరు ముద్ద, జగనన్న విద్యా దీవెన లాంటి పధకాలు ఉంటే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ కంటి వెలుగు, , వైఎస్సార్ ఆరోగ్యశ్రీ లాంటివి అమలుచేస్తున్నారు. ఇపుడు వైఎస్సార్ జనతా బజార్లు, వైఎస్సార్ వ్యవసాయ ప్రయోగశాలలు కూడా వస్తున్నాయి. మొత్తానికి మరిన్ని పధకాలకు కూడా తన పేరుతో పాటు, తండ్రి పేరు పెట్టాలని జగన్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

రాజకీయమే….?

ఇదంతా కూడా రాజకీయమే. రాజకీయ లబ్ది కోసం చేసే చీప్ ట్రిక్స్ గా అంటున్నారు. ప్రతీ పధకానికి డబ్బు ప్రజలు కట్టే పన్నుల నుంచి వస్తుంది. అయితే పాలకులకు ఏది ప్రాధాన్యత అనిపిస్తే వాటికి నిధులను కేటాయించి తమదైన పధకాలుగా తీర్చిదిద్దుతారు. అంతవరకూ వారికి క్రెడిట్ ఇవ్వవచ్చు కానీ ఆ పధకాలు తన సొంత డబ్బుతో అమలుచేస్తున్నట్లుగా పేర్లు పెట్టుకోవడం అంటే ఫక్తు రాజకీయమేనని అంటున్నారు. నిజానికి వైఎస్సార్ ఆగోగ్యశ్రీ పధకానికి పేరు పెడితే ఎవరికీ అభ్యంతరం లేదు, ఎందుకంటే అది ఆయన మానసపుత్రిక. ఇక జగనన్న అమ్మ ఒడి వరకూ ఒకే కానీ ఇలా వరసపెట్టి మరీ అన్ని పధకాలకు పేర్లు పెట్టుకుంటే వెగటుగా మారుతుందని అంటున్నారు. అది విమర్శలకు కూడా దారి తీసి అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు.

రాజ్యాంగ విరుధ్ధమే…?

ఇక పాలకులు తటస్థంగా ఉండాలని రాజ్యాంగం చెబుతోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇచ్చే ఫలాలు, ఫలితలూ అందరికీ అందాలి. పైగా ఎక్కడా పార్టీలు, రాజకీయాల ప్రస్తావన లేకుండా ఉండాలని, ఒక విధంగా చెప్పాలంటే పెద్ద మనిషిగా, న్యాయమూర్తిగా పాలకులు ఉండాలని రాజ్యాంగం సూచిస్తోంది. అయితే జరుగుతున్నది మాత్రం వేరుగా ఉంది. చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉన్నపుడు అన్న క్యాంటీన్లు అని పెద్దాయన పేరు పెట్టారు. చంద్రన్న కానుకలు, రంజాన్ తోఫా, చంద్రన్న బీమా అంటూ హడావుడి చేశారు. చివరికి ఆయనకు ఎన్నికల్లో అవేమీ పనిచేయలేదు. ప్రజలు ఓడించేశారు. అందువల్ల పధకాలకు పేర్లు పెట్టినంతమాత్రాన ఓట్లు రాలవన్నది రుజువు అవుతున్న సత్యం. పైగా పధకం సవ్యంగా సాగితే వాటి ఫలాలు అందుకున్న జనాలు అమలు చేసిన వారిని జీవితాంతం గుర్తుంచుకుంటారు. అందువల్ల పధకాలకు పేర్లు పెట్టుకుంటూ ఆ పిచ్చిలో అత్యంత జనాదరణ ఉన్న జగన్ లాంటి వారు పడకూడదనే అందరి సలహా కూడా.

Tags:    

Similar News