ఆ వైపు నుంచి నరుక్కువస్తున్నారా ?

జగన్ రాజకీయంగా పదును తేరిన వ్యూహాలనే అమలుచేస్తున్నారు. చంద్రబాబును, ఆయన పార్టీని బోర్డర్ లో పెట్టి బొంగరమే ఆడుతున్నారు. చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేస్తున్న జగన్ కి [more]

Update: 2020-06-23 12:30 GMT

జగన్ రాజకీయంగా పదును తేరిన వ్యూహాలనే అమలుచేస్తున్నారు. చంద్రబాబును, ఆయన పార్టీని బోర్డర్ లో పెట్టి బొంగరమే ఆడుతున్నారు. చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేస్తున్న జగన్ కి ఆయన అసలు బలం ఏంటో తెలుసు. కానీ ఆయన రాజకీయ వ్యూహాల మీదనే కొంత కలవరం వైసీపీలో ఉంది. బాబు ఎలాంటి వారు అంటే అర్ధరాత్రి అడవిలో సైతం అన్నం పుట్టించగలరు, తాను తలచుకుంటే సముద్రంలోనే మంటలు సృష్టించగలరు. అదే ఆయన్ని ఇన్నాళ్ళుగా ద్రుఢమైన నాయకుడిగా ఉంచగలిగింది. ఇపుడు ఏపీలో కుదేలైన సీన్ టీడీపీది. దాంతో బాబు తరువాత స్టెప్ ఏంటి అన్నదే ఇపుడు వైసీపీ శిబిరంలో హాట్ చర్చ. అది తెలుసుకుని అడ్డుకుంటేనే తాము పూర్తిగా సక్సెస్ అయినట్లుగా వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది.

అడ్డుకట్టేనా …?

చంద్రబాబు ఏపీ వరకూ చేతులెత్తేసే ఉన్నారు. ఎందుకంటే ఆయనది ఇక్కడ పొలిటికల్ గా కనీసమైన బలం, పార్టీకి చాలా తక్కువగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఎమ్మెల్సీలు మెజారిటీ ఉన్న శాసనమండలి రద్దు అయితే వారి ఉద్యోగాలు కూడా ఒక్కసారిగా ఊడుతాయి. అలా కాకపోయినా కూడా వైసీపీకే రానున్న రోజుల్లో మెజారిటీ వస్తుంది. మొత్తానికి తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఊహించని సంక్లిష్ట పరిస్థితిని బాబు ఎదుర్కొంటున్నారు. అటువంటి బాబుకు ఎక్కడ బ్రేకులు వేయాలో అక్కడే వైసీపీ దృష్టి పెట్టింది. బాబు ఇపుడు మోడీనే శరణం అంటున్నారు. మోడీ దయ ఉంటేనే తప్ప ఏపీలో టీడీపీ రాజకీయ మనుగడ సాధ్యం కాదు. అందుకే మోడీకి జై అనేస్తున్నారు మొహమాటాలు, భేషజాలు అన్నీ కూడా తీసి అవతల పెట్టేసి మరీ పాహిమాం బీజేపీ అంటున్నారు. దాంతో అక్కడే పెద్ద దెబ్బ వేయాలని వైసీపీ డిసైడ్ అయిపోయింది.

బాబుని మించి….

నిజంగా ఇది ఆశ్చర్యకరమే కానీ రాజకీయాల్లో ఏదీ అసాధ్యం మాత్రం కాదు. అఖిల పక్ష సమావేశంలో ఏపీ సీఎం జగన్ మోడీని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేశారు. మీ నాయకత్వం గొప్పది, ప్రపంచ దేశాల ముందు భారత్ ని నిలబెట్టారు, విజన్ ఉన్న నేత మీరు అంటూ జగన్ కొనియాడిన తీరు బాబుని మించిపోయింది. అదే సమయంలో సోనియాగాంధీ మోడీ మీద వరసగా రాజకీయ బాణాలు వేస్తున్నారు. సరిగ్గా జగన్ స్తోత్ర పాఠాలు అందుకోగానే మోడీ సహా అమిత్ షా వంటి వారికి అది మహదానందమే కలిగించిఉంటుంది. అంటే రైట్ టైంలో జగన్ మోడీ కీర్తనలు అందుకున్నారన్న మాట.

కట్టడికేనా …?

ఇదంతా ఎందుకు అంటే ఏపీలో టీడీపీ గాలి తీసేసిన తరువాత బాబు చూపు మోడీ మీదనే ఉంది. అందువల్ల అక్కడ నుంచి ఏ విధమైన హామీ, అభయం ఆయనకు దక్కకుండా చేసేందుకు జగన్ వేసిన ముందర కాళ్లకు బంధం ఇది అంటున్నారు. మోడీ కరుణా కటాక్షాలు కనీసంగా కూడా బాబు వైపు ప్రసరించకుండా జగన్ వేసిన పై ఎత్తుగా దీన్ని చూడాలి. నిజానికి జగన్ కి మోడీని పొగడాల్సిన అవసరం ఇపుడు లేదు, ఆయన రాజకీయంగా బలంగానే ఉన్నారు. పైగా చైనా విషయంలో సలహాలు, సూచనల కోసం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం అది. అక్కడ ప్రశంసలకు తావే లేదు, కానీ వచ్చిన అవకాశాన్ని జగన్ చక్కగా వాడేసుకున్నారు. మోడీకి తాను వీర భక్తుడిని అని చాటుకున్నారు. ఈ దెబ్బతో చంద్రబాబుకు కేంద్రం తలుపులు మూసుకోవాలన్నదే జగన్ ఆలోచన. మరి బాబు దీన్ని మించి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News