వన్ సైడ్ లవ్ తో విన్ ఎలా జగన్ ?

వన్ సైడ్ ప్రేమలు సినిమా చరిత్రలో కళాఖండాలు అవుతాయేమో కానీ రాజకీయాల్లో మాత్రం భారీ డిజాస్టర్స్ గా మిగిలిపోతాయి. విషయానికి వస్తే ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. [more]

Update: 2021-02-07 08:00 GMT

వన్ సైడ్ ప్రేమలు సినిమా చరిత్రలో కళాఖండాలు అవుతాయేమో కానీ రాజకీయాల్లో మాత్రం భారీ డిజాస్టర్స్ గా మిగిలిపోతాయి. విషయానికి వస్తే ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సొంతంగా వైసీపీని ఏర్పాటు చేసి బంపర్ విక్టరీ కొట్టారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. మామూలుగా అయితే ప్రభుత్వాల స్థాయిలో సహకారం ఉండాలి. పార్టీల పరంగా చూస్తే భిన్న ధృవాలే మరి. అయినా కూడా జగన్ రాజకీయాలను కూడా మరచి బీజేపీతో దోస్తీ చేస్తున్నారు. బేషరతుగా పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశ పెట్టే అనేక బిల్లులకు మద్దతు ఇస్తున్నారు. మరి ఇన్ని చేసిన జగన్ కి ఆ వైపు నుంచి దక్కుతున్నదేంటి.

దెబ్బ తిన్న ఇమేజ్ ….

జగన్ వ్యవస్థలతో ఢీ కొడుతున్నా ఆయనకు ఇంతటి తెగింపు వచ్చినా వెనక ఉన్నది బీజేపీ పెద్దలని అంతా అనుకుంటున్నారు. కేంద్రంలోకి కీలకమైన వ్యక్తులు జగన్ కి ఇచ్చే మద్దతు తోనే ఆయన చెడుగుడు ఆడుతున్నారు అన్న చర్చ అయితే ఉంది. కానీ ఎన్నికల సంఘం వర్సెస్ జగన్ అన్నది ఏ రేంజిలో సాగిన పోరాటమో అందరికీ తెలుసు. జగన్ వ్యక్తిగత ప్రతిష్టను సైతం ఫణంగా పెట్టి ఒక రాజ్యాంగ బధ్ధమైన సంస్థతో ఢీ కొట్టారు. ఎందదాకానైనా అని దూకుడు చేశారు. కానీ చివరికి జరిగిందేంటి అంటే జగన్ ఓడారు. ఇది వ్యక్తిగతంగా జగన్ ఇమేజ్ ని దారుణంగా దెబ్బ తీసిందని అంటున్నారు.

సరైన టైం లో ఝలక్….

ఇలా జగన్ ఇబ్బందుల్లో పడడానికి కారణం కేంద్రంలోని కొందరి పెద్దల వ్యవహారమేనని ఒక మాట అయితే వినిపిస్తోంది. వారు అండగా ఉంటారనే జగన్ హై రిస్క్ చేసి మరీ ముందుకు సాగారు. ఒక విధంగా తన ప్రభుత్వాన్నే పందెం కట్టి రాజ్యాంగ వ్యవస్థలతో తేల్చుకున్నారు. తెగేదాకా లాగారు. కానీ ఫలితం లేకపోయింది. జగన్ ఊహించింది ఒకటి అయితే జరిగినది మరోటి. దానికి కారణం సరైన సమయంలో కీలకమైన వ్యక్తుల‌ నుంచి మద్దతు కరవు కావడం అన్న మాట వినిపిస్తోంది. కేంద్రంలోని పెద్దలు రంగంలోకి దిగితే జగన్ కోరుకున్నది జరిగేది అన్న అభిప్రాయం కూడా సొంత పార్టీలో ఉంది. కానీ తమకేం సంబంధం లేనట్లుగా వారు చోద్యం చూశారు. ఫలితం ఏపీలో తన్నుకువచ్చిన ఎన్నికలను జగన్ ఒక ప్రేక్షకుడిగా చూడాల్సివచ్చిందని చెబుతున్నారు.

తెలిసి వచ్చిందా…?

బీజేపీ పెద్దలు ఎపుడూ తన వైపు నుంచే ఆలోచిస్తారని మూడు దశాబ్దాలకు పైగా మిత్రపక్షంగా ఉన్న శివసేన ఉదంతం తెలియచేస్తోంది. ఎంత సేపూ వన్ సైడెడ్ గానే వారి డెసిషన్స్ ఉంటాయని చెబుతారు. జగన్ మాత్రం బీజేపీని నిండా నమ్ముకున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఆయన తల బొప్పి కట్టింది కూడా. అయినా కీలక సమయాల్లో ఆయన్ని ఓడించేందుకే బీజేపీ చూస్తోందని పార్టీలో నేతల ఆవేదన. జగన్ ఇకనైనా బీజేపీ మీద వన్ సైడ్ లవ్ కి ఫుల్ స్టాప్ పెట్టి రెండు వైపులా లాభం కలిగేలా వ్యవహారం చేయాలని అంటున్నారు. మరి జగన్ మాత్రం ఇంకా బీజేపీని నమ్ముతారా. ఏమో చూడాల్సిందే.

Tags:    

Similar News