ఆశావహులకు జగన్ భారీ షాక్..?

జగన్ ది పదేళ్ల పోరాటం. అయితే అందులో ఆయన ఒంటరిగా చేయలేదు. వెనకాల కోట్లాదిమంది ప్రజలు నిలిచారు లక్షలాది మంది కార్యకర్తలు కూడా తమ సమయం, ధనం [more]

Update: 2020-10-02 06:30 GMT

జగన్ ది పదేళ్ల పోరాటం. అయితే అందులో ఆయన ఒంటరిగా చేయలేదు. వెనకాల కోట్లాదిమంది ప్రజలు నిలిచారు లక్షలాది మంది కార్యకర్తలు కూడా తమ సమయం, ధనం అన్నీ వదులుకు జగన్ సీఎం కావాలని పరితపించారు. అటువంటి వారి కోరిక నెరవేరి జగన్ కనీ వినీ ఎరుగని మెజారిటీతో ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చి అపుడే ఏడాదిన్నర కాలం గడచిపోయింది. అయితే జగన్ ని నమ్ముకుని ఇల్లూ ఒళ్ళూ గుల్ల చేసుకున్న వారికి దక్కిందేంటి అంటే రిక్తహస్తమే అని సమాధానం వస్తుంది. ఉన్న పదవులకు రిజర్వేషన్లు పెట్టి కష్టపడే వారి ఆశలకు జగన్ గండి కొట్టారని ఓ వైపు వేదన పార్టీలో ఉంది. మరో వైపు కొన్ని పోస్టులు అసలు భర్తీ చేయకుండా వదిలేసారు అన్న‌ విమర్శలు ఉన్నాయి.

హామీలు ఏమవుతాయి…..

జగన్ పాదయాత్రలో జనాలకు అనేక రకాలైన హామీలు జనాలకు ఇచ్చారు. వాటిలో తొంబై శాతం హామీలను కేవలం ఏడాది కాలంలోనే ఆయన తీర్చేశారు. ఇది ఒక విధంగా రికార్డే. మరి పార్టీ నాయకులకు జగన్ ఇచ్చిన హామీల సంగతేంటి అన్న ప్రశ్న వస్తోంది. ఏపీలో శాస‌న మండలి లో పలువురికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తానని జగన్ ఎన్నికల సభల్లోనూ చెప్పుకొచ్చారు. అటువంటి జగన్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోనే మండలిని రద్దు చేయాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా బిల్ల్ పాస్ చేసి కేంద్రానికి పంపించారు.

వెనక్కి తగ్గలేదా…..

ఇటీవల జగన్ ఢిల్లీ వెళ్ళినపుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చల్లో శాసనమండలి రద్దు అంశం కూడా ఉందని ప్రచారం అయితే జరిగింది. అంటే జగన్ మనసులో మండలి రద్దు అంశం అలాగే మిగిలి ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతీసారి హోదాను గుర్తు చేస్తున్నారు. అది సంతోషమే. కానీ ఇపుడు ఆయన శాసన మండలి రద్దు బిల్లు కూడా పార్లమెంట్ ఆమోదం కోసం పట్టుపడుతున్నారు. ఇదే పార్టీలోని ఆశావహులకు మింగుడుపడడంలేదుట. మరో ఆరు నెలలు కళ్ళు మూసుకుంటే శాసన మండలిలో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయి. ఆ మీదట మరో ఏడాదికి పూర్తి ఆధిపత్యం వస్తుంది. ఈ లెక్కలు ఇలా ఉంటే జగన్ మాత్రం ఎందుకో మొండిగా మండలి రద్దు అన్న దానిమీదనే ఉన్నారని పార్టీలో అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది.

కేంద్రమే దిక్కు ……

జగన్ ఎన్నిసార్లు కేంద్రానికి మొర పెట్టుకున్నా మోడీ సర్కార్ అనుకుంటేనే పార్లమెంటులో బిల్లు పెట్టి మండలిని రద్దు చేస్తుంది. ఇపుడు జగన్ కంటే మోడీ మీదనే వైసీపీ ఆశావహులు ఎక్కువగా ఆధారపడుతున్నారు. కేంద్రం కచ్చితంగా మండలి రద్దు బిల్లుని ఆపుతుందని ఆశిస్తున్నారు. అయితే కేంద్రం సంగతి ఎలా ఉన్నా జగన్ మాత్రం ఆశావహుల విషయంలో తాను ఇచ్చిన హామీలను సైతం పక్కన పెట్టి రద్దు మాటనే పట్టుకుని ముందుకుసాగడం పట్ల మాత్రం కొంత అసంత్రుప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జగన్ కొందరిని మండలికి నామినేట్ చేశారు. మార్చిలో పెద్ద ఎత్తున ఖాళీలు అవుతాయని చాలా మంది కర్చీఫ్ వేస్తున్నారు. ఈ సమయంలో జగన్ ఒత్తిళ్ళు కనుక బీజేపీ మీద గట్టిగా పనిచేస్తే తమ పని అయినట్లేనని దిగాలు పడుతున్నారుట. మరి పార్టీ అధికారంలో ఉంది. పదవులు పనిచేసేవారికి జగన్ ఇవ్వాల్సి ఉంది. దానికి అనువుగా ఉన్న మండలిని రద్దు చేసుకోవడం అంటే పండ్లున్న చెట్టుని నిలువునా నరుక్కోవడమేనని వైసీపీలో వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News