జగన్ బాధంతా అదేనట

జగన్ కి ఏపీ బీజేపీ నేతల తీరు అసలు నచ్చడంలేదని అంటున్నారు. ఎన్నికల ముందు వరకూ పల్లెత్తు మాట కూడా అనని బీజేపీ నాయకులు ఇపుడు టీడీపీ [more]

Update: 2019-11-09 14:30 GMT

జగన్ కి ఏపీ బీజేపీ నేతల తీరు అసలు నచ్చడంలేదని అంటున్నారు. ఎన్నికల ముందు వరకూ పల్లెత్తు మాట కూడా అనని బీజేపీ నాయకులు ఇపుడు టీడీపీ కంటే ఘోరంగా విమర్శలు చేయడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారుట. ఎందుకిలా చేస్తున్నారని ఆయన మధనపడుతున్నారుట. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్ద బలం లేదు. టీడీపీని అణగదొక్కాం, జనసేన ఖేల్ ఖతం అయిందని జగన్ ఫలితాల తరువాత విశ్లేషించుకున్నారు. కానీ విచిత్రంగా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీ ఇపుడు రంకేలు వేయడంతో వైసీపీ వ్యూహకర్తలే ఆశ్చర్యపోతున్నారు. బీజేపీ ఇలా ఎంతగా చెలరేగిపోయినా ఏపీలో ఆ పార్టీ ఎదగదు అన్నది కూడా జగన్ రాజకీయ పరమైన అంచనాగా ఉంది. అయితే బీజేపీ చేస్తున్న ఈ ప్రచారం వల్ల మళ్లీ టీడీపీకే ఊపిరి వస్తుందని ఆయన భావిస్తున్నట్లుగా భోగట్టా.

మాట్లాడకుండానే….

ఇక జగన్ వరకూ చూసుకుంటే ఆయన ఏపీ బీజేపీని ఒక్క మాట అనడం లేదు. తన పార్టీ నేతలకు కూడా ఈ విషయంలో కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్క సీటు ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ మీద విమర్శలు చేస్తే మొత్తం క్యాబినెట్ రెచ్చిపోయి గట్టి కౌంటర్లు వేసింది. అదే బీజేపీ నేతలు ఎంతలా తిడుతున్నా కూడా వైసీపీ వైపు నుంచి కౌంటర్ లేదు. ఒక్క సుజనా చౌదరిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఇదే వైసీపీ మార్క్ రాజకీయమని అంటున్నారు. అదే సమయంలో ఏపీలో బీజేపీ వలకు ఒక్క చేప కూడా చిక్కకుండా జగన్ వారిని తమవైపు లాగేస్తున్నారు. జనసేనలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన అద్దేపల్లి శ్రీధర్ వంటి నాయకుడు తన మాతృ సంస్థ బీజేపీలోకి వెళ్ళకుండా వైసీపీలోకి జగన్ సన్నిహితుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి తెచ్చారంటేనే ఆ పార్టీ వ్యూహం అర్ధమైపోతొంది. రాజమండ్రీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన బీజేపీ వైపు వెళ్ళకుండానే వైసీపీ కండువా కప్పేశారు. ఇక టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వంశీని సైతం బీజేపీ వైపు పోనీయకుండానే ఆయన డిమాండ్లకు జగన్ ఒకే చేబుతున్నారని అంటున్నారు.

ఢిల్లీతోనే దోస్తీ….

జగన్ ఇపుడు కొత్త రాజకీయం అనుసరిస్తున్నారు. ఏపీలో కమలంతో కుస్తీ తప్పదని గట్టి హెచ్చరికలు పంపుతున్నారు. అదే సమయంలో ఢిలీలో బీజేపీ పెద్దలతో దోస్తీ చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఏపీ బీజేపీ నేతలను పట్టించుకునేవారు కాదు. పైగా ఆయనకు బీజేపీలో తన సామాజికవర్గం నేతలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉండేవి. ఇక జగన్ కూడా ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తూ జాతీయ స్థాయిలో తనకు అనుకూలంగా ఉండే ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారిని ఇష్టపడుతు న్నారంటున్నారు. ఇక ఏపీలో సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి, సోము వీర్రాజు వంటి వారు జగన్ పార్టీని కనీసంగా కూడా విమర్శించరు. ఇలా ఏపీ బీజేపీలో చీలిక ఉంది. ఏది ఎలాగున్నా ఏపీలో బీజేపీ బలపడితే తనకు ముప్పు అన్నది జగన్ ఆలోచన‌గా ఉంది. అందువల్ల ఆ పార్టీ ఎదగనీయకుండా చేయడంతో పాటు, టీడీపీ, జనసేనలను కూడా పలుచన చేసే యాక్షన్ ప్లాన్ రెడీ చేసి పెట్టుకున్నారని అంటున్నారు. ఈ పరిణామాలు తెల్సిన బీజేపీ నేతలు ఏపీలో చేసేదేమీ లేక జగన్ మీద ఇసుక ఎత్తి పోస్తున్నారని అంటున్నారు. ఏపీ బీజేపీలో ఉన్న నేతలు ఎవరికీ పెద్దగా పొలిటికల్ గ్లామర్ లేకపోవడం కూడా జగన్ వ్యూహాలకు శ్రీరామరక్షగా ఉంటోందని అంటున్నారు.

Tags:    

Similar News