లౌక్యమూ లేక సౌఖ్యమూ లేదూ జగన్

జగన్ ది ముక్కుసూటి మనస్తత్వం. అది ఇన్నాళ్ళూ అందరూ అంటూంటే వినేవారికి ఇపుడు ఆయన ఏడాది పాలన చూసిన తరువాత బాగా అర్ధమవుతోంది. ఇక పార్టీ నిర్మాణం, [more]

Update: 2020-07-04 03:30 GMT

జగన్ ది ముక్కుసూటి మనస్తత్వం. అది ఇన్నాళ్ళూ అందరూ అంటూంటే వినేవారికి ఇపుడు ఆయన ఏడాది పాలన చూసిన తరువాత బాగా అర్ధమవుతోంది. ఇక పార్టీ నిర్మాణం, సంస్థాగతంగా సమాజంలోని వివిధ సామాజికవర్గాలకు ప్రాథాన్యతలు, విభాగాల కూర్పు వంటివి చూసుకుంటే కూడా జగన్ కొన్ని విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిజమే ప్రాంతీయ పార్టీలలో ఏక నాయకత్వమే ఉంటుంది. ఆయనే రాజూ, ఆయనే మంత్రి. కానీ ఎంతో కొంత సామాజిక న్యాయం ఉందనిపించాలి కదా. నేతి బీరకాయ చందమైనా నీతి కనిపించాలిగా. జగన్ అర్జంటుగా ముగ్గురు రెడ్లను తీసుకువచ్చి ఏపీలోని మూడు ప్రాంతాలకు వైసీపీ తరఫున ఇంచార్జులను చేయడం ఇపుడు విపక్షాలకు ఆయుధం అయింది.

పంచేసినట్లేనా…?

నిజానికి అది జగన్ పార్టీ వ్యవహారం. పార్టీ పదవులు అన్నాక కొంతవరకూ సొంత నిర్ణయాలే ప్రభావం చూపిస్తాయి. అందువల్ల పెద్దగా బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాబట్టే వైసీపీ మీద ఇంతలా అందరి చూపూ పడుతోంది అంటున్నారు. ఎందువల్లనంటే అధికార పార్టీ ఇంచార్జులుగా వారికి పవర్ బాగానే ఉంటుంది మరి. దీని మీదనే సీపీఐ రామక్రిష్ణ కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. రెడ్డి రాజ్యం అని ముఖం మీదనే అనేస్తున్నారు. పెత్తందారీ పోకడలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఆరో వేలుగానే …..

ఇక భారత దేశంలో ఏ పార్టీ చూసుకున్నా పూర్తి అధికారాలు ప్రతీ నాయకునికీ ఉంటాయనుకుంటే పొరపాటే. బీజేపీ జాతీయ అధ్యక్షుడి పేరు అమిత్ షా మాదిరిగా జేపీ నడ్డా అని చాలా మందికి తెలుసా. అలాగే కాంగ్రెస్ లో ఎవరు పార్టీ బాధ్యులుగా ఉన్నా సోనియా గాంధీయే సుప్రీం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీలో తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ జాతీయ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. అసలు ఏ పార్టీలోనైనా అలా ఉంటుందా. ఇక వైసీపీలో విజయమ్మ గౌరవ అధ్యక్షురాలు అయితే జగన్ అధ్యక్షుడు. ఇవన్నీ ఇలా ఉంటాయి. కానీ బయట‌కు సామాజిక న్యాయం అని నేతి బీర‌కాయ కబుర్లు చెప్పడానికైనా చంద్రబాబు కళా వెంకట‌రావుకు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. కానీ అది అరో వేలు అన్నది కూడా జనాలకు తెలుసు.

ముసుగు ఉండాలిగా…?

నిజానికి తమ్ముళ్ళేవరూ ఆయన వద్దకు పోరన్న సంగతి తెలిసిందే. అన్ని విషయాలూ పెదబాబూ, చినబాబే చక్కబెడతారు. కానీ ఇలా ముసుగులైనా ఉండాలిగా. జగన్ కి ఈ లౌక్యం తెలియకపోవడమే ఇప్పటికీ విడ్డూరం. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్ళు అవుతోంది. ముఖ్యమంత్రిగా ఏడాది దాటింది. ఇక ఈ ప్రభుత్వం నాది అనుకునేలా సామాజిక న్యాయం పాటించిన జగన్ ఈ పార్టీ మాది అని ఏపీలోని అన్ని కులాలు కనీసం అనుకునేలా వ్యవహరించి ఉంటే బాగుండేది అంటున్నారు. ఉత్తరాంధ్రాలో బీసీలు ఉంటారు. అలాంటి చోట విజయసాయిరెడ్డిని నెల్లూరు నుంచి తెచ్చిపెట్టారు, గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ. వారికి ఇంచార్జి బాధ్యతలు ఇస్తే సబబుగా ఉండేది. ఇక సీమ జిల్లాలో మైనారిటీలకు, ఎస్సీలకు అవకాశం ఇస్తే బాగుండేది అన్న మాట వినిపిస్తోంది. మొత్తానికి జగన్ వాస్తవవాది అని మరోసారి రుజువు చేసుకున్నారు. ఎన్ని ముసుగులు వేసినా జనానికి జగనే కనిపిస్తాడు కాబట్టి ఎందుకీ ఆయాసం అనుకున్నారు కానీ జనాలకు ఆ ముసుగు కూడా కావాలి. అలా మభ్యపెట్టే రాజకీయాలే ఇపుడు సాగుతున్నాయి. మాంసం తిన్నామని ఎముకలు మెళ్ళో వేసుకోరుగా. జగన్ ఇకనైనా రాజకీయ లౌక్యం చూపించాలి.

Tags:    

Similar News