ఆశీస్సులు దక్కాయా?

ముఖ్యమంత్రి జగన్ హఠాత్తుగా రాజ్ భవన్ కి వెళ్ళి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ని కలిసారు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత చాలానే ఉంది. [more]

Update: 2019-11-19 05:00 GMT

ముఖ్యమంత్రి జగన్ హఠాత్తుగా రాజ్ భవన్ కి వెళ్ళి ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరి చందన్ ని కలిసారు. ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత చాలానే ఉంది. ఎందుకంటే ఇప్పటికి మూడు నెలలు దాటింది గవర్నర్ నియామకం జరిగి. అయితే జగన్ ఎపుడూ ఇంతసేపు గవర్నర్ తో గడిపింది లేదు. ఈసారి సమావేశం గంటన్నరకు పైగా సాగింది. పైగా గవర్నర్ దంపతులతో కలసి జగన్ దంపతులు విందు భోజనం ఆరగించారు. సహజంగానే ఏపీలో జరుగుతున్న రాజకీయం ఇతర పరిణామాలు ముఖ్యమంత్రి గవర్నర్ కి వివరించినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఏపీలో మత రాజకీయాల మీద జగన్ ప్రత్యేకంగా గవర్నర్ కు వివరించినట్లుగా పేర్కొంటున్నారు. ఓ విధంగా ఏపీలో గత కొంతకాలంగా ప్రతిపక్షాల రాజకీయం గురించి కూడా జగన్ వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ముప్పు గుర్తించి అలెర్ట్ అయ్యారా..?

సాధారణంగా జగన్ తన దైనందిన వ్యాపకాల్లో బిజీగా ఉంటారు. విమర్శలు పెద్దగా పట్టించుకోరు. ఈ విషయంలో ఆయనకు తమిళనాడు మాజీ జయలలితతో పోలిక పెట్టాలి. ఆమె సైతం మీడియాలో వచ్చే విమర్శలను లెక్కచేయకుండా తొలి అయిదేళ్ళూ పాలించారు. ఓడిపోయిన తరువాత ఆమెకు తెలిసివచ్చింది తన తప్పు ఏంటో. ఇపుడు జగన్ విషయంలో తీసుకుంటే ఆయన తొందరగానే అన్నీ గుర్తిస్తున్నారు. ప్రధానంగా ఏపీలో మత మార్పిడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్న తప్పుడు ప్రచారాన్ని ఓ పద్ధతి ప్రకారం ప్రతిపక్షాల్లొని కొందరు సోషల్ మీడియా ద్వారా హైలెట్ చేస్తున్నారు. నిజానికి జరకగపోయినా కూడా దాన్ని మసి పూసి మారేడు కాయ చేస్తున్నారు. ఇక ఢిల్లీ స్థాయిలో కూడా గత కొన్ని రోజులుగా జగన్ మీద సోషల్ మీడియాలో మతమార్పిళ్లు అంటూ ట్రెండింగ్ అవుతోంది. దాన్ని ఆధారం చేసుకుని నేషనల్ మీడియా ఆర్టికల్స్ నెగిటివ్ గా రాస్తోంది. ఇవన్నీ కేంద్రం దృష్టికి రాకుండా ఉండవంటే తప్పు మాటే. మరి ఆ విధంగా చూసుకుంటే ఓ విధంగా బ్రహ్మాస్త్రాన్నే విపక్షాలు తీసాయని చెప్పాలి.

కేంద్ర బిందువేనా..?

నిజానికి గవర్నర్లు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధులుగా ఉంటారు, విశ్వభూషణ్ కూడా పొరుగున ఉన్న ఒడిషాకు చెందిన వారు. ఆయన సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆరెస్సెస్, బీజేపీ నేపధ్యం ఉన్నా కూడా ఏపీలో ఆయన పెద్ద మనిషి పాత్రనే పోషిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మీద ఫిర్యాదులు విపక్షాలు ఇచ్చినా కూడా ఆయన వివేచనతోనే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఇక ఆయన గవర్నర్ గా ఢిల్లీ వెళ్ళి ఒకసారి పెద్దలను అందరినీ కలసి వచ్చారు. ఢిల్లీ డైరెక్షన్లు ఎలా ఉన్న ఇప్పటివరకూ రాజ్ భవన్ జగన్ తో మంచి సంబంధాలు కనబరుస్తోంది. ఓ విధంగా జగన్ కి ఇది అదృష్టంగానే చెప్పుకోవాలి. తెలంగాణాలో గవర్నర్ తమిళ్ సై అక్కడ క్రియాశీలంగా వ్వవహరిస్తున్నారు. ఇక ఏపీలో అటువంటి బాధ విశ్వ‌భూషణ్ తో జగన్ కి తలెత్తలేదు. పైగా జగన్ విషయంలో సానుకూలంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది. అదే సమయంలో జగన్ అపాయింట్మెంట్ కోరగానే విందు భోజనానికే ఏకంగా అహ్వానించి గవర్నర్ జగన్ పట్ల తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు.

వాస్తవాలు చెబుతారా…?

ఈ నేపధ్యంలో జగన్ ఏపీలో జరుగుతున్న అన్ని విషయాలు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల గురించి గవర్నర్ కు వివరించినట్లు తెలిసింది. ఏపీలో మతపరమైన వివాదాలు చెలరేగడంతో దానిపై గవర్నర్ కు జగన్ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. కొంత మంది ఉద్దేశపూర్వకంగా మత పరమైన విషయాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారని జగన్ వివరించినట్లు తెలిసింది. ఇక వాటికి సాక్ష్యాలు కూడా జగన్ నివేదిక రూపంలో సమర్పించినట్లు తెలిసింది. మరి ఈ విషయాలు గవర్నర్ కేంద్రం దృష్టికి తీసుకెళ్తారన్న ఉద్దేశ్యంతోనే జగన్ వీటిని గవర్నర్ కు వివరించారనుకోవాలి. మరి విశ్వభూషణ్ జగన్ సర్కార్ పాలన గురించి. ఏపీలో జరుగుతున్న అసలు విషయాల గురించి కేంద్రానికి నివేదిస్తారనే భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News