లింకు తెగ్గొట్టాలనేనా? అదే ప్రయత్నంలో ఉన్నారా?

నిజంగా మోడీని బీజేపీ నాయకులు కూడా ఇంతలా సొంతం చేసుకోవడంలేదు. కానీ చంద్రబాబు ఆయన పార్టీ తమ్ముళ్ళు అయితే మాత్రం ఒక్క లెక్కన వెనకేసుకువస్తున్నారు. మోడీ మావాడు [more]

Update: 2020-04-22 13:30 GMT

నిజంగా మోడీని బీజేపీ నాయకులు కూడా ఇంతలా సొంతం చేసుకోవడంలేదు. కానీ చంద్రబాబు ఆయన పార్టీ తమ్ముళ్ళు అయితే మాత్రం ఒక్క లెక్కన వెనకేసుకువస్తున్నారు. మోడీ మావాడు అని మరీ బరితెగించి బయటకు చెప్పకపోయినా మేమంతా చుట్టాలమే అని ప్రతీ రోజూ స్తోత్ర పాఠాలు వల్లిస్తున్నారు. మోడీ చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడాక ఆ ఊపు మరింత ఎక్కువగా ఉంది. చంద్రబాబు నుంచి సీనియర్ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు సైతం మోడీ బాగా చేస్తున్నారు, ఆయన చెప్పిన సూచనలు ఏపీలో జగన్ అసలు పాటించడంలేదని తెల్లారిలేస్తే చాలు బాగా ఆడిపోసుకుంటున్నారు.

మోడీ ది గ్రేట్…..

దేశంలో తాజా గణాంకాల ప్రకారం 138 కోట్ల జనాభా ఉంది. గత నలభై రోజులుగా కేంద్ర స్థాయిలో చూసుకుంటే కరోనా నిర్ధారణ టెస్టింగులు నాలుగు లక్షలకు కూడా మించలేదు. అంటే ఇది సముద్రంలో నీటి బొట్టుగానే చెప్పాలి. మరి ఏపీలో చూసుకుంటే అయిదు కోట్ల మందికి ఇప్పటికి పద్దెనిమిది వేల మందికి టెస్టులు చేశామని అంటున్నారు. ఇపుడు కొత్తగా దక్షిణ కొరియా నుంచి తెప్పించిన రాపిడ్ మెడికల్ కిట్లతో రోజుకు పాతిక వేల మంది వరకూ టెస్టులు చేస్తామని అంటున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే దేశమంతా కరోనా టెస్టుల కధ ఒకేలా ఉంది. కానీ చంద్రబాబు తమ్ముళ్లు మాత్రం మోడీ భేష్, జగన్ వేస్ట్ అనడం వెనక అచ్చమైన రాజకీయమే ఉందనుకోవాలేమో.

ఆర్ధిక సాయంలోనూ…..

ఇక ఆర్ధిక సాయం తీసుకుంటే పేదల‌ జనధన్ ఖాతాల్లో మోడీ సర్కార్ అయిదు వందలు వంతున వేసింది. ఇది అచ్చంగా తొమ్మిది లక్షల మందికి మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉంది. అదే వైసీపీ సర్కార్ అయితే కోటిన్నర మంది కుటుంబాలకు తలా ఒక వేయి రూపాయలు ఆర్ధిక సాయం చేశామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఇక రేషన్ ని కూడా మూడు విడతలుగా ఇవ్వడం కూడా గొప్ప విషయం అంటున్నారు. నిజానికి నెలకు ఒక సారే ఇచ్చే రేషన్ ని మూడు సార్లు, అదీ ఉచితంగా ఇవ్వడం అంటే పెద్ద చేత్తో చేస్తున్న సాయంగానే చెప్పుకోవాలి.

విడగొట్టాలనేనా….?

మోడీని పొగడడం ద్వారా జగన్ కి ఆయనకు మధ్య ఉన్న చైన్ ని తెంపేయాలని టీడీపీ తెగ తాపత్రయపడుతోందని మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు చేస్తున్న వాడి వేడి విమర్శలను బట్టి అర్ధమవుతోంది. అందరూ సామాజిక దూరం పాటించి కరోనా చైన్ ని తెంపేయాలని చూస్తున్న వేళ టీడీపీ మాత్రం సెపరేట్ ట్రాక్ లోకి వెళ్తూ బీజేపీ, వైసీపీ చైన్ ని తెంపాలనుకుంటోంది. మరి ఇది రాజకీయంగా పసుపు పార్టీకి చాలా అవసరం. ఏపీ లాంటి కుదేలయిన రాష్ట్రానికి జగన్ లాంటి కొత్త ముఖ్యమంత్రికి కేంద్రం వెన్ను దన్ను చాలా అవసరం. దాన్ని తెంచేస్తే తమ పబ్బం గడుస్తుందని చంద్రబాబు మాస్టర్ మైండ్ ఆలోచిస్తోంది.. కానీ ఈ కీలక టైంలో తెంచాల్సింది కరోనా చైన్ ని. దాన్ని అందరూ పక్కనపెట్టడమే దారుణం.

Tags:    

Similar News