అంబానీ దోస్త్ సైలెంట్ అయ్యారే?

ఆయన కోసం ఏకంగా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రత్యేక విమానంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. తన దోస్త్, వ్యాపార భాగస్వామి పరిమళ్ [more]

Update: 2020-04-04 02:00 GMT

ఆయన కోసం ఏకంగా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ప్రత్యేక విమానంలో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జగన్ ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. తన దోస్త్, వ్యాపార భాగస్వామి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ టికెట్ కోసం అంబానీ అలా వచ్చి జగన్ ముందు వాలారు. అనుకున్నట్లే జగన్ ద్వారా టికెట్ సాధించారు. జగన్ సైతం ఆయన్ని అక్కున చేర్చుకుని రాజ్యసభకు సాదరంగా పంపారు. ఇక ఎన్నికలు జరగాల్సివుంది. అది కూడా లాంచనమే. మొత్తానికి పెద్దల సభలో నత్వానీ కూర్చోవడం ఖాయమైపోయింది.

ఎన్నో ఆశలతో….

నిజానికి వైసీపీలో ఎందరో ఆశావహులు ఉన్నారు. వారంతా కూడా పదవుల కోసం ఎంతో ఊహించుకున్నారు. వారిని కాదని, రాజకీయంగా అండతో పాటు, ఆర్ధికంగా నిలబడతారనే పరిమళ్ నత్వానీని జగన్ ఎంపిక చేశారని అంటారు. ఆయనని తెలివిగా వైసీపీ జెండాతో కట్టిపడేశారు కూడా. ఇండిపెండెంట్ గా కాకుండా వైసీపీ మెంబర్ గానే ఆయన్ని చేయడం వెనక జగన్ వ్యూహం ఉంది. ఏపీలో పెద్ద ఎత్తున పరిశ్రమలు పెడతారని కూడా జగన్ ఆశపడ్డారు. అవన్నీ నెమ్మదిగా జరిగేవి. అయితే ఆదిలోనే జగన్ కి అతి పెద్ద కష్టం వచ్చిపడింది.

కరోనా కలవరం….

ఏపీలో కరోనా నెమ్మదిగా ఉంటున్నట్లే ఉంటూ ఒక్కసారిగా విశ్వరూపం చూపిస్తోంది. దేవుడి దయ వల్ల తక్కువ కేసులే ఉన్నాయని నిన్నటి దాకా జగన్ అనుకున్నారు. కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వారితో సీన్ రివర్స్ అయింది. ఇపుడు ఏపీలో కేసులు పెరిగిపోయాయి. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సర్కార్ గట్టిగా పనిచేయాలంటే చేతినిండా డబ్బు ఉండాలి. అసలే ఆర్ధికంగా ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఇది కానికాలంగా ఉంది. ముఖ్యమంత్రి నిధులకు విరాళాలు కూడా చాలా తక్కువ పడుతున్నాయి.

విదల్చలేదే….?

సరిగ్గా ఈ పరిస్థితుల్లో విరాళాలు విదిల్చే దాతల వైపు అందరి చూపూ ఉంది. అన్నిటికంటే ముందు అంబానీ దోస్త్ పరిమళ్ నత్వానీ మీద వైసీపీ పెద్దల ఆలోచనలు ఉన్నాయట. ఓ వైపు ముఖేష్ అంబానీ ముంబైలో సహాయ కర్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అదే సమయంలో ఆయన గారి స్నేహితుడు, ఏపీకి కాబోయే రాజ్యసభ సభ్యుడు నత్వానీ సైలెంట్ గా ఉండడం పట్ల చర్చ సాగుతోంది. ఏపీ నుంచి దిగుమతి సరుకుగా పెద్దల సభకు వెళ్ళిన ఇతరుల మాదిరిగానే నత్వానీ కూడా అంతేనా అని అంతా అనుకునే పరిస్థితి ఉంది. నత్వాని సైతం భారీ సంపన్నుడు. ఆయన తలచుకుంటే భూరి విరాళమే ఏపీ ఖాతాలో పడుతుంది. మరి టికెట్ కోసం వచ్చినపుడు చెప్పిన మాటలు ఇపుడు ఎక్కడికి పోయాయి అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తాను ప్రాతినిధ్యం వహించబోయే ఏపీ కష్టాల్లో ఉంది. ఇక ఆర్ధిక పరిమళాలు కురిపించడమే తరువాయి. నత్వాని దాని నడుం బిగిస్తారా..చూడాలి మరి.

Tags:    

Similar News