ఆయన చూపించిన మార్గమేనా?

జగన్ చక్రాలు తిప్పడానికి ఇష్టపడరు. ఆయన ఉన్న చోటనే తన పని చేసుకుంటూ పోతారు. నిజానికి జగన్ కనుక తిప్పాలనుకుంటే ఆయన పార్టీకి 28 మంది ఎంపీలు [more]

Update: 2020-05-06 13:30 GMT

జగన్ చక్రాలు తిప్పడానికి ఇష్టపడరు. ఆయన ఉన్న చోటనే తన పని చేసుకుంటూ పోతారు. నిజానికి జగన్ కనుక తిప్పాలనుకుంటే ఆయన పార్టీకి 28 మంది ఎంపీలు పార్లమెంట్ లో ఉన్నారు. ఆయన అతి పెద్ద పార్టీ అధినేతగా కేంద్రంలోనూ పలుకుబడి కోసం పందెం కాయొచ్చు. తరచూ ఢిల్లీకి వెళ్ళి మీడియా మీటింగులు పెట్టవచ్చు. ఆర్భాటాలూ, హడావుడీ చేసి నేనే మొనగాణ్ణి అని కూడా గట్టిగా ప్రపంచానికి చాటుకోవచ్చు. ఎందుకో జగన్ నైజం దానికి విరుధ్ధం. ఆయన తాను ఏది అనుకుంటే అదే చేస్తారు. పరిచయాలు ఎందరితో ఉన్నా అవి గుంభనంగా ఉండాలనే అనుకుంటారు. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే జగన్ కి కేంద్ర స్థాయిలో పలువురు మంత్రులతో మంచి సంబంధాలే ఉన్నాయన్నది.

ఇరుగూ పొరుగూ….

ఇక జగన్ కి ఇపుడు బాహాటంగా చెప్పుకోవాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు బాగా మిత్రులుగా ఉన్నారనుకోవాలి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటూ జగన్ కి దోస్తే. ఈ ఇద్దరిదీ ఒకరి అవసరాలు మరొకరు బాగా తెలుసుకుని అర్ధం చేసుకున్న స్నేహం. కేసీఆర్ కి తనకూ ఒక దోస్తు ఉన్నాడని చెప్పుకోవాలంటే జగన్ పేరే చెబుతారు. జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చి పౌరోహిత్యం చేసిన తెలంగాణా పెద్దాయన ఎప్పటికీ ఏపీలో జగనే సీఎం గా ఉండాలనుకుంటారు. ఆయనకు చంద్రబాబుతో ఉన్నది అన్ని రకాలుగానూ బధ్ధ వైరం. జగన్ తో అదే ఎక్కువ స్నేహానికి దారితీసింది. జగన్ కూడా డిటో. ఇక ఇపుడు జగన్ కి ఆయనతో పాటో మరో నేస్తంగా పొరుగున ఉన్న ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ దొరికారు.

అలా కలిశారు…

జగన్, నవీన్ పట్నాయక్ తాజాగా వీడియో సమావేశం ద్వారా కలిశారు. ఈ ఇద్దరూ తమ తమ రాష్ట్రాలలో ఉన్న వలస కార్మికుల గురించి మాట్లాడుకున్నారు. అంతే కాదు ఏపీలో మంచి పాలన సాగుతోందని నవీన్ బహిరంగంగానే పొగిడారు. ఇక అంతకు ముందు తీసుకున్నా దిశా చట్టం విషయంలోనూ జగన్ సర్కార్ ని నవీన్ సంప్రదించారు. ఇవన్నీ ఇలా ఉంటే గత ఇరవయ్యేళ్ళుగా ఓటమెరుగకుండా గెలుస్తూ వస్తున్న నవీన్ కూడా జగన్ మాదిరిగానే తండ్రి పేరిట ఒక రాజకీయ పార్టీ పెట్టారు. ఆయన్ని ఒడిషాలో దేవుడుగా భావిస్తారు. ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడే ఒడిషా ముఖ్యమంత్రితో అంతరాష్ట్ర వివాదాలు, సాగునీటి ప్రాజెక్టుల గురించి చర్చించాలని నాటి సీఎం బాబుకు సూచించారు. ఇక ఏపీలో సీఎం అయ్యాక జగన్ మొదటిగా వెళ్ళి కలవాలనుకున్నది నవీన్ పట్నాయక్ నే. వివిధ కారణాల వల్ల అది వాయిదా పడుతూ వస్తోంది. ఇపుడు ఇద్దరూ ఈ కరోనా వేళ కలిశారు.

మేలు జరిగేనా…?

నిజానికి దక్షిణాన జగన్ కి చాలా మంది మిత్రులు ఉన్నారని అంటారు. కర్నాటక సీఎం యడ్యూరప్ప కూడా జగన్ కి అక్కడి బీజేపీ నేతల ద్వారా బాగా పరిచయం. ఇపుడు నవీన్ తో బంధం కల్సింది. దాని వల్ల శ్రీకాకుళం జిల్లాలో ఉన్న వంశధార రెండవ దశ ప్రాజెక్టుకు ఇబ్బందులు లేకుండా చర్చలు జరిపితే ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనం. ఇక తమిళనాడులో కాబోయే సీఎంగా పేరున్న డీఎంకే అధినేత స్టాలిన్ తో కూడా జగన్ కి మంచి పరిచయాలు ఉన్నాయి. ఇపుడిపుడే జగన్ తన పాలనతో పాటు రాజకీయాల మీద దృష్టి పెడుతున్నారు. మరో ఏడాది రెండేళ్ళలో ఆయన సైతం దక్షిణాదిన పట్టు సాధించాలంటే ఈ పరిచయాలు బాగా ఉపయోగపడతాయని అంటున్నారు. ఏది ఏమైనా నిదానమే ప్రదానం అనుకునే జగన్ తన పరిచయాలతో ఏపీకి దీర్ఘ కాల ప్రయోజనాలు చేకూరిస్తే అదే పదివేలు. అలా అయనకు కూడా పేరు శాశ్వతంగా దక్కుతుంది.

Tags:    

Similar News