ఇద్దరిదీ అదే దారి …మారేందుకు ప్రయత్నించరా?

అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు, మంత్రులు సహా దూషణలకు దిగడం చూశాం. బహిరంగంగానూ, మీడియాలోనూ దుమ్మెత్తి పోసుకోవడమూ చూశాం. సభ్యతా పరిధులను అతిక్రమించి అశ్లీల [more]

Update: 2020-02-26 15:30 GMT

అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాలకు చెందిన సీనియర్ నాయకులు, మంత్రులు సహా దూషణలకు దిగడం చూశాం. బహిరంగంగానూ, మీడియాలోనూ దుమ్మెత్తి పోసుకోవడమూ చూశాం. సభ్యతా పరిధులను అతిక్రమించి అశ్లీల పదజాలం వినియోగించడమూ ఇటీవలి కాలంలో మామూలైపోయింది. ఆయా నాయకులు తమ పార్టీకి, అధినేతలకు చెడ్డపేరు తెస్తున్నారేమోననే అనుమానాలు నిన్నామొన్నటివరకూ ఉండేవి. అదేం లేదు. అధినేతలూ అదే పంథాలో ఉన్నారనేది తాజాగా స్పష్టమైపోయింది. ఆంధ్రప్రదేశ్ లోని రెండు ప్రధాన పార్టీలు రోడ్డెక్కుతున్న తీరు రాజకీయ పదజాలంలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. అటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తాజాగా చేసుకున్న విమర్శలు ద్వితీయ శ్రేణి నాయకుల విమర్శలకు ఏమాత్రం తీసిపోనివిగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. రాక్షసులతో యుద్ధమంటూ ముఖ్యమంత్రి పేర్కొంటే, ఇది నరకాసుర పాలన అంటూ ప్రతిపక్షనేత ఆరోపిస్తున్నారు. వేలెత్తి చూపించుకునే క్రమంలో భాగంగా వారిద్దరూ తమ పాలనలు బాగాలేవని పరోక్షంగా అంగీకరించారంటూ వ్యంగ్యోక్తులు విసురుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

వ్యక్తిగత పోరు…

అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు సహజం. సిద్దాంతపరంగా పోరు కూడా తప్పదు. కానీ రాష్ట్రంలో ఆ పరిమితులు చెరిగిపోయాయి. జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తమ స్థాయులను తామే కించబరుచుకుంటున్నారు. రాజకీయ పోరు వ్యక్తిగత వైరంగా మార్చేశారు. పధ్నాలుగు సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పదేళ్లకు పైగా ప్రతిపక్షనాయకునిగా ఉన్న చంద్రబాబు నాయుడు సైతం మాటలు తూలుతున్నారు. అలాగే పాదయాత్రతో ప్రజలతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకుని తిరుగులేని విజేతగా నిలిచిన జగన్ మోహన్ రెడ్డి సంయమనం కోల్పోతున్నారు. నిజానికి సీనియార్టీ దృష్ట్యా చూస్తే చంద్రబాబు నాయుడు తన అనుభవంతో కొత్త తరం నాయకత్వాలకు మార్గదర్శకంగా నిలవాలి. పార్టీ పాలిటిక్స్ ఎలా ఉన్నప్పటికీ సత్ప్రమాణాలు నెలకొల్పేందుకు క్రుషి చేయాలి. తిట్ల రాజకీయంతో పార్టీకి ఒరిగేదేమీ ఉండదు. ఒకరోజు మీడియాలో వార్తలు తప్ప. సీనియర్ గా తగిన బాధ్యతతో వ్యవహరించాలన్న నియంత్రణను చంద్రబాబు పాటించడం లేదు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సి చాలా ఉంది. ఏడు సంవత్సరాల ఎదురీత తర్వాత అద్భుతమైన అవకాశం లభించింది. పూర్తిగా అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించేంత మెజార్టీని ప్రజానీకం కట్టబెట్టారు. దేశంలోనే అత్యంత ఆదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ప్రజలు పట్టం గట్టారు. మరో 30 సంవత్సరాల పాటు పాలిటిక్స్ లో కొనసాగాలనుకుంటున్న నాయకుడు. ప్రత్యర్థి పార్టీగా టీడీపీని సైద్దాంతికంగా విభేదిస్తే పర్వాలేదు. చంద్రబాబు నాయుడు తనకు ఆగర్భశత్రువు అన్న రీతిలో విరుచుకుపడటం ముఖ్యమంత్రి హోదాకు తగినది కాదు.

తీర్చే దెవరు?

రాష్ట్రంలో కీలకమైన ఈ ఇద్దరు నాయకుల రగడ పిల్లి ఎలకల చెలగాటంగా మారిపోయింది. కేంద్రపథకాల సహా అన్నిటినీ తన కాతాలోనే వేసుకుని క్లెయిం చేసుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు. ఆ ముద్ర పరిపాలనపై ఏ కోణంలోనూ కనిపించకూడదని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దాంతో రాజధాని సహా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. గతంలో అన్న క్యాంటీన్ల రూపంలో పేదలకు జరిగిన మేలును కూడా కొనసాగించడానికి నిరాకరించారు. అలాగే విద్య,వైద్య రంగాల్లో మార్పులకు శ్రీకారం చుడుతున్న ప్రభుత్వ కృషిని గుర్తించ నిరాకరించి రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఈ ఇద్దరు నాయకులకు ఉన్న ఒక పోలిక మాత్రం రాజకీయ పరిశీలకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలుగుదేశం, వైసీపీ పార్టీల వ్యవస్థాపనకు మూల పురుషులు ఎన్టీయార్, వైఎస్ రాజశేఖరరెడ్డి. వారెప్పుడూ తమ సొంత పేర్లతో సంక్షేమ పథకాలను పెట్టుకోలేదు. ప్రజలకు ఫలితాలను అందించేందుకే ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్ రెడ్డిలలో ఆ ఔదార్యం కొరవడింది. చంద్రన్న తోఫాలు, జగనన్న దీవెనలు సంక్షేమ పథకాల పేర్లుగా మారిపోయాయి. టీడీపీ, వైసీపీలు ఎన్టీయార్, వైఎస్ పేర్ల మీద స్కీములు పెడితే ఆక్షేపించదగినది ఏమీ లేదు. కానీ చంద్రబాబు, జగన్ లు తమ పేర్ల మీద తామే పథకాలు పెట్టుకోవడమే విస్మయం కలిగిస్తుంది. జాతీయ స్థాయిలో ప్రధానమంత్రులెవరూ తమ పేర్లమీద స్కీములు పెట్టుకున్న దాఖలాలు లేవు. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన నరేంద్రమోడీ సైతం అంతటి సాహసం చేయలేదు. కానీ రాష్ట్రంలో గడచిన ఆరేళ్లుగా నెలకొన్న దుస్సంప్రదాయం ఆ పరిమితులను తొలగించి వేసింది. సర్కారు పథకాలకు స్వనామధేయాల ప్రచారం ముఖ్యమంత్రుల శైలిగా రూపుదాల్చింది. దీనికి శ్రీకారం చుట్టిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పాలి.

భవిష్యత్తుపై భయం….

అధికార, ప్రతిపక్షాల్లో నిర్మాణాత్మకమైన వైఖరి లోపించడం రాష్ట్ర ప్రగతిపై ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తోంది. చర్చించి నిర్ణయాలు తీసుకునే వైఖరి కొరవడింది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను న్యాయపరంగానూ, ఆందోళనల రూపంలోనూ ఎదుర్కొనేందుకు ప్రతిపక్షం సర్వశక్తులు ఒడ్డుతోంది. ఏకపక్ష ధోరణితో సర్కారు సైతం ఒంటరి నిర్ణయాలు తీసుకుంటోంది. వెరసి ఆంధ్రప్రదేశ్ పేరు చెబితే రాజకీయ ప్రతీకారాలు, కక్షలు, కార్పణ్యాలకు నిలయమనే ముద్ర పడిపోతోంది. జాతీయ స్థాయిలో ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న పరిస్థితులను చూసి దక్షిణాది రాష్ట్రాలు ఒక రకంగా సంతోషిస్తున్నాయనే చెప్పాలి. అభివ్రుద్ధి చెందడానికి అన్ని రకాల వనరులు ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడని విధంగా అధికార, ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీని ఏదైనా డిమాండ్ చేసి తెచ్చుకోలేని దుస్థితి వెన్నాడుతోంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News