ఏడాది క్రితమే కరోనా వచ్చి ఉంటే… ?

ప్రకృతి విప‌త్తు చెప్పి రాదు, వస్తే అలా ఇలా ఉండదు. అందుకే దాన్ని విళయం, ప్రళయం అన్నారు. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా రక్కసి కఠిన పద [more]

Update: 2020-04-02 00:30 GMT

ప్రకృతి విప‌త్తు చెప్పి రాదు, వస్తే అలా ఇలా ఉండదు. అందుకే దాన్ని విళయం, ప్రళయం అన్నారు. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా రక్కసి కఠిన పద ఘట్టనలతో హడలెత్తిస్తోంది. దానికి రాజూ, పేదా తేడా లేదు, అందరికీ మట్టేసి ముందుకు మూర్ఖంగా సాగిపోతోంది. సరే కరోనా కోరలు చాచిన నేపధ్యంలో ఇపుడు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ముందు వైరస్ ని వదిలుంచుకోవడంపైనే అంతా దృష్టి పెట్టారు. ఏపీలో కరోనా కారణంగా లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. అలాగే రాజ్యసభ ఎన్నికలు, అసెంబ్లీ సమావేశాలు, పదవ తరగతి పరీక్షలు, రాజధాని తరలింపు ఒక్కటేంటి అన్నీ ఆగిపోయాయి.

అలా అనుకుంటున్నారా ..?

సరే లోకల్ బాడీ ఎన్నికలు ఆగడం వెనక వేరే ఉద్దేశ్యాలు ఏవి ఉన్నా ఆగడానికి మాత్రం కరోనాని వాడుకున్నారు. ఇదే కరోనా ఏడాది క్రితం వచ్చి ఉంటే…అంటే ఒక్కసారి 2019 ఇదే కాలంలోకి వెళ్ళాలి మరి. ఆనాడు మార్చిలో నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇదే తేదీల్లో ఉధృతంగా ఎన్నికల ప్రచారం ఏపీలో సాగుతోంది. అంటే కరోనా అపుడే కనుక వచ్చి ఉంటే ఏకంగా అసెంబ్లీ ఎన్నికలే వాయిదా పడేవన్నమాట. కరోనాతో స్థానిక ఎన్నికలు వాయిదా పడినా సగం ఆనందమే టీడీపీకి దక్కింది. అదే కరోనా ఏడాది క్రితం వస్తే ఏకంగా అసెంబ్లీ ఎన్నికలు చాలా కాలం పాటు వాయిదా పడి జాతకాలు వేరేగా మారేవేమోనన్న ఆలోచన పసుపు పార్టీ పెద్దల్లో ఉందా?

క్రూర ఆలోచన…

ఏమో రాజకీయం క్రూరమైనది, దానికి మానవత్వం ఉండదు, ఏమైనా అనుకోవచ్చు. మరి పచ్చ పార్టీ అధినేతల మనసులో దూరి కనుగొన్నారో ఏమో కానీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అదే అంటున్నారు. కరోనా ఏడాది ముంచు వచ్చినా బాగుండేది అని పెదబాబు, చినబాబు, వారి అనుకూల మీడియా తెగ బాధపడుతున్నారుట. అలా ఎన్నికలు వెనక్కి నెట్టబడి నాడు జగన్ మానియా పూర్తిగా తగ్గిపోయాక జరిగి ఉంటే మళ్ళీ తమకే పట్టం జనం కట్టేవారు అని తాపీగా పసుపు శిబిరం కరోనాను తలచుకుని రోదిస్తోందని విజయసాయిరెడ్డి అంటున్నారు. రాజకీయమే తప్ప మనవత్వం పచ్చ పార్టీకి లేదని, అందుకే కరోనా పైన కూడా రాజకీయం చేస్తూ కుట్రలకు తెర లేపుతున్నారని విజయసాయి ఆరోపిస్తున్నారు.

ఆ ఫిగర్లు ఇటొస్తే….

నిజంగా ఏపీ ఓ విధంగా లక్కీయే అని చెప్పాలి. కరోనా తాకిడి ఏపీలో ఎక్కువగా లేదు. ఫిగర్లు కూడా పెద్దగా నమోదు కావడంలేదు. తెలంగాణా కరోనా నంబర్లలో మూడవ వంతు మాత్రమే ఏపీలో రికార్డు అవుతున్నాయి. పొరపాటున అవే నంబర్లు ఏపీకి వచ్చి తెలంగాణాలో తక్కువ కేసులు ఉంటే మాత్రం టీడీపీ అనుకూల మీడియాతో పాటు, చంద్రబాబు కూడా రెచ్చిపోయేవారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ అసమర్ధుడని రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసేవారని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కి అక్కడ కొంత లక్కు కలసివచ్చినట్లుగా ఉంది. అయినా సరే చంద్రబాబు సన్నాయి నొక్కులు ఆపడంలేదుగా. ఏపీలో కరోనా కట్టడిలో జగన్ ఫెయిల్ అయ్యారని, విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్స్ చేయలేదని కరోనా రాజకీయాన్ని బాగానే కారం కొట్టినట్లుగా కొట్టేస్తున్నారు. మొత్తానికి కరోనా వచ్చినా రాజకీయమే కోరుకునే దిగజారుడు నేతలను చూసి జాలి పడాలో, సిగ్గుపడాలో అర్ధం కావడంలేదుగా.

Tags:    

Similar News