అదను చూసి మరీ

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇద్దరూ ఆరు గంటల పాటు జరిపిన చర్చ దేశ రాజకీయాలను కూడ ప్రభావితం చేసేలా [more]

Update: 2020-01-14 06:30 GMT

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఇద్దరూ ఆరు గంటల పాటు జరిపిన చర్చ దేశ రాజకీయాలను కూడ ప్రభావితం చేసేలా సాగిందని అంటున్నారు. ఈ భేటీ పట్ల కేంద్రంలోని బీజేపీ కూడా ఆసక్తి కనబరచడం ఒక విశేష పరిణామం. జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ మెల్లగా మసకబారుతున్న వేళ సరిగ్గా సమయం సందర్భం చూసుకుని మరీ జగన్, కేసీఆర్ ఈ భేటీ వేశారని అంటున్నారు. ఇద్దరికీ కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి శత్రువులు. అందులో రెండవ మాటకు ఆస్కారం లేదు. ఇక బీజేపీ విషయంలో కొంత తేడా ఉంది తప్ప దాదాపుగా ఇద్దరూ రాజకీయంగా ఒకే బాటలో పయనిస్తున్నారని చెప్పాల్సిఉంటుందేమో.

వారి పని సరి….

ఇద్దరు సీఎం ల భేటీలో రెండు రాష్ట్రాలో ప్రతిపక్ష రాజకీయం గురించి కూడా ప్రస్తావన వచ్చిందట. తెలంగాణాలో కాంగ్రెస్ ని కలిశానికి కూడా లేకుండా చేయడంతో విజయం సాధించిన కేసీఆర్ ఏపీలో టీడీపీ గురించి వాకబు చేశారట. అయితే ఏపీలో చంద్రబాబుకు జనంలో విశ్వసనీయత లేదని జగన్ అన్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ఎంత మొత్తుకున్నా జనామోదం దొరకడం లేదని జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే స్థానిక ఎన్నికల్లో 2019 ఎన్నికల నాటి మ్యాజిక్ ని వైసీపీ కంటిన్యూ చేయడం ద్వారా టీడీపీని తుత్తునియలు చేయాలని కేసీఆర్ సలహా ఇచ్చినట్లుగా చెబుతున్నారు. మొత్తానికి చూస్తే రెండు చోట్లా నానాటికీ ప్రతిపక్షాలు తీసికట్టుగా మారాయని ఇద్దరు సీఎంలూ ఒక అంచనాకు వచ్చినట్లుగా చెబుతున్నారు.

బీజేపీ ఎదగదు…

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కడా బేస్ లేదని కూడా ఇద్దరు నాయకులూ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణాలో నాలుగు ఎంపీ సీట్లు వచ్చినా వెంటనే జరిగిన పంచాయతీ, జెడ్పీ ఎన్నికల్లో బీజేపీ చతికిలపడిన సంగతిని కేసీఆర్ గుర్తు చేశారట. ఇక ఏపీలో జనసేనలో బీజేపీ కలసి నడిచినా ఆ రెండు పార్టీలకు ఒరిగేది లేదని కూడా జగన్ అన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి తమకు బీజేపీ నుంచి పెద్దగా వచ్చే రాజకీయ ప్రమాదం ఏదీ లేదని కూడా ఇద్దరు నేతలు భావిస్తున్నారుట.

ఉమ్మడి పోరాటం …

తెలుగురాష్ట్రాలో బలం లేకపోయినా రాజకీయంగా ఎత్తులూ, జిత్తులూ వేసే మోడీ, అమిత్ షాలతో జాగ్రత్తగా ఉండాలని కూడా ఇద్దరు సీఎంలూ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయంగా ఆ పార్టీ వ్యూహాలను గట్టిగానే ఎదుర్కోవాలని ఒక అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. ఇక కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తూ రాష్ట్రాలపైన పెత్తనం చేయడాన్ని కూడా ఇద్దరూ కొంత చర్చించారని, విభజన హామీలు, రావాల్సిన నిధుల విషయంలో ఉమ్మడిగా పోరాడాలని కూడా డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది.

అప్రమత్తతతో ….

మరో వైపు దేశంలో బీజేపీ బలం క్రమంగా తగ్గుతోందని, వరసగా జరుగుతున్న రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కావడమే ఇందుకు ఉదాహరణ అని భావిస్తున్నారుట. మొత్తం మీద కేసీయార్, జగన్ తెలుగు బ్రదర్స్ గా మారి కేంద్రంలోని బీజేపీని అడ్డుకోవడానికి భవిష్యత్తులో ఏమైనా చేయవచ్చునన్న సంకేతాలను ఈ భేటీ ఇచ్చింది. అయితే అదను చూసి మాత్రమే ముందుకు దూకాలి తప్ప ఎలా పడితే అలా కాదు అన్న దాని మీద ఒకే మాటగా ఉన్నట్లుగా చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News