జగన్.. బాబూ ఒట్టు పెట్టుకుంటారా…?

ఏపీలో రెండే రాజకీయ పార్టీలు, అటూ ఇటూ భీకరమైన పోటీ. ఆ రెండు పార్టీలు గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే చాలు రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు [more]

Update: 2021-05-11 13:30 GMT

ఏపీలో రెండే రాజకీయ పార్టీలు, అటూ ఇటూ భీకరమైన పోటీ. ఆ రెండు పార్టీలు గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటే చాలు రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. సంస్కరణలకు కూడా వీలు పడుతుంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ రెండూ కూడా పోటా పోటీగా సై అంటే మాత్రం ఏపీలో రాజకీయం పాతాళానికే పడిపోతుంది. ఇంతకాలం అదే జరిగింది. కానీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో మాత్రం ఒక అద్భుతమే జరిగింది.

ఓట్ల కొనుగోలుకు చెక్….

నిజానికి ఈ నిర్ణయం మొదట జగన్ తీసుకున్నారు. ఆయన తీసుకోవడానికి కూడా కారణం ఉంది. తమ పార్టీకి ఎటూ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం ఖాయం. అందువల్ల ప్రత్యేకించి ఓట్లకు డబ్బులు పంచడం అన్నది దండుగ మారి వ్యవహారం. పైగా చెడ్డ అవుతుంది అని ఆయన ఆలోచించారు. ఇక తమ ప్రభుత్వం చేతికి ఎముక లేకుండా సంక్షేమ పంట పండిస్తోంది. వాటిని పొందిన వారు కృతజ్ణతతో అయినా ఓటు వేయాలి కదా. మరో వైపు చూస్తే టీడీపీ కూడా రెండేళ్ళుగా చితికిపోయి ఉంది. తాము కనుక ఓట్ల కొనుగోలుకు చెక్ పెడితే ఆ పార్టీ కూడా మహదానందంగా ముందుకు వస్తుంది. వారు కూడా ఉపశమనం పొందుతారు కాబట్టి అటు నుంచి కూడా ఓట్ల కొనుగోలు ఉండదు. ఈ రకమైన లెక్కలతోనే జగన్ తమ పార్టీ నుంచే ముందుగా ఈ సంస్కరణలకు తెర తీశారు. అంతే కాదు, ఏ నేత అయినా ఓటుకు నోటు ఇచ్చారని తెలిస్తే ఏకంగా పార్టీ నుంచే పంపిస్తామని కూడా గట్టి హెచ్చరికలు చేశారు. దాంతో మొత్తం బంద్ అయింది.

పాతికేళ్ళ తరువాత….

అపుడెపుడో ఎన్టీయార్ జమానాలో ఓటుకు నోటు అన్నది లేకుండా ఎన్నికలు జరిగాయని చెప్పుకుంటారు. ఎన్టీయార్ కేవలం ప్రచార సామగ్రి మాత్రమే తమ అభ్యర్ధులకు ఇచ్చేవారు. అంతే తప్ప వేరేగా నగదు బదిలీ చేసేవారు కాదు. ఓటుకు నోటు అంటే ఆయనకు ఒళ్ళు మంట. పైగా రామారావు ప్రజాదరణ ముందు ఎవరూ నోట్లు డిమాండ్ చేసే సీనే నాడు లేదు. అయితే ఆయన స్థానంలో సీఎం అయిన చంద్రబాబు పార్టీకి ప్రెసిడెంట్ గా కూడా కుదురుకున్నాక ఎన్నికల్లో డబ్బు ప్రమేయం బాగా పెరిగింది అన్న ప్రచారం అయితే ఉంది. మొత్తానికి మొదట్లో లక్షల్లో ఉన్న ఆ ధన ప్రవాహం ఇపుడు వందల కోట్లకు పడగెత్తింది. ఇపుడు అదే టీడీపీకి కూడా గుదిబండగా మారుతోంది. పార్టీలో ఆర్ధిక వనరుగా ఉండే బడా నేతలు అంతా తప్పుకున్నాక టీడీపీకి కూడా డబ్బుతో రాజకీయాలు చేయడం ఎంత కష్టమో ఒక్కసారిగా అర్ధమైంది అంటారు. దాంతో తిరుపతి ఉప‌ ఎన్నికల్లో టీడీపీ కూడా పైసా తీయకుండానే రాజకీయం సాగించింది.

ఒక్క మాట మీద ఉంటారా…?

ఎన్నికల్లో ధన ప్రభావం ఎక్కువ అయిపోతోంది అని వామపక్షాలు ఇతర పార్టీల నేతలు పదే పదే ఆరోపిస్తూ ఉంటారు. అది కూడా వైసీపీ, టీడీపీలను ఉద్దేశించే అంటారు. ఇపుడు మంచికో మరో దానికో తిరుపతి ఉప ఎన్నికలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. దీన్నే ఇక మీదట రెండు పార్టీలు కంటిన్యూ చేయాలని మేధావుల నుంచి వినిపిస్తున్న మాట. నిజానికి జగన్ 2014, 2019 ఎన్నికల వేళ కూడా అభ్యర్ధులకు నగదు సహాయం చేయేలేదు అన్న విమర్శలు సొంత పార్టీలో ఉన్నాయి. అయితే ధనవంతులకు చాలా చోట్ల టికెట్ ఇవ్వడంతో వారు బాగానే ఖర్చు పెట్టారు. ఇపుడు జగన్ తలచుకుంటే ధన రహిత రాజకీయాలను అన్ని ఎన్నికల్లో కొనసాగించవచ్చు, ఆయన కనుక అది అమలులో పెడితే టీడీపీ కూడా అదే బాటన నడిచే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఈ విషయంలో బాబూ జగన్ ఒట్టు పెట్టుకుని మరీ ముందుకు సాగితే ఏపీలో ఆదర్శవంతమైన రాజకీయమే చూడవచ్చు అని విద్యావంతులు మేధావులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News