అంతా షేమ్ టూ షేమ్

అప్పట్లో పరకాల బ్యాచ్… ఇప్పుడు జివిడి అండ్ కో….. ముఖ్యమంత్రుల్ని భ్రష్టు పట్టించడంలో ఈ మధ్య స్థాయి వ్యవస్థలు ఎప్పుడూ ముందుంటాయి. ఇన్నాళ్లూ టీడీపీ అనుకూల మీడియాకు [more]

Update: 2020-01-09 08:00 GMT

అప్పట్లో పరకాల బ్యాచ్… ఇప్పుడు జివిడి అండ్ కో….. ముఖ్యమంత్రుల్ని భ్రష్టు పట్టించడంలో ఈ మధ్య స్థాయి వ్యవస్థలు ఎప్పుడూ ముందుంటాయి. ఇన్నాళ్లూ టీడీపీ అనుకూల మీడియాకు ప్రభుత్వ సమాచారం అందకూడదనే విధానపరమైన నిర్ణయాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. జగన్‌ వ్యతిరేక బ్యాచ్ అనే ముద్రతో రెండు ఛానళ్లు., ఓ పత్రికకు అధికారిక సమాచారాన్ని అందకుండా చేసి సంతోషపడుతున్నారు. తాజాగా అందులో మరో ఛానల్ చేరింది. ఇన్నాళ్లు జగన్‌ అనుకూల ఛానల్‌గా భావించిన ఎన్టీవి మీద జగన్ మీడియా వింగ్‌కు ఎందుకో ఆగ్రహం కలిగింది. బుధవారం రాత్రి సీఎంఓ గ్రూప్‌ల నుంచి ఎన్టీవి రిపోర్టర్లను తొలగించి తమతో పెట్టుకుంటే ఏం జరుగుతుందోననే హెచ్చరిక పంపారు.

ఎన్టీవీపై ప్రతాపం….

ఇన్నాళ్లు లేనిది సడెన్‌గా ఎన్టీవి మీద సీఎంఓకు ఎందుకు కోపం వచ్చిందనే దానికి సరైన సమాధానాలు లేవు. కాకపోతే ఏపీలో చాలా చోట్ల టీవీ-5, ఏబిఎన్‌ ప్రసారాలు రావడం లేదు. ఉన్న వాటిలో ఈటీవీ, ఎన్టీవీ ఎప్పుడో జగన్‌కు సరెండర్‌ అయ్యాయనే భావన ఉంది. రాజధాని మార్పు నిర్ణయం తర్వాత అమరావతి ప్రాంత ప్రజల ఆందోళనలు, ఉద్యమాలను అన్ని ఛానళ్లు కవర్‌ చేస్తున్నా వాటికి పెద్దగా ప్రేక్షాకాదరణ లేకపోవడంతో ఇబ్బంది కలగలేదు. తాజాగా పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మీద దాడి, బుధవారం రాత్రి బెంజిసర్కిల్‌లో చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని కవర్ చేయడంలో మిగిలిన ఛానల్స్‌ కంటే ఎన్టీవి టీం బాగా పనిచేసింది. అమరావతి ఆందోళనల వార్తల విషయంలో ఎన్టీవీ చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయిందనే నిర్ణయానికి వచ్చేసిన సీఎంఓ మీడియా వింగ్ తమ ప్రతాపం చూపించింది. గ్రూప్‌ల నుంచి వారిని తొలగించి జబ్బలు చరుచుకుంది.

బాబు హయాంలోనూ….

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో కూడా పరకాల శిష్య బృందం ఇలాగే వ్యవహరించేది. మీడియా సమావేశాల్లో చంద్రబాబును ఇరుకున పెట్టేలా ఎవరైనా ప్రశ్నిస్తే వారిని గ్రూప్‌ల నుంచి తొలగించేది. కారణం అడిగితే సీఎంను ఇబ్బంది పెట్టేలా మాట్లాడితే ఇలాగే జరుగుతుందని వార్నింగ్‌ ఇచ్చేవాళ్లు. చంద్రబాబు దగ్గరకు మీడియా వెళ్లకుండా ఎప్పుడు ఓ దడి కట్టి క్షేత్ర స్థాయిలో సమాచారం ఆయన వరకు వెళ్లకుండా కోటరీలా ఈ బృందం పనిచేసేది. ఇప్పుడు ముఖ్యమంత్రి మారినా మధ్య స్థాయి యంత్రాంగం తీరు మాత్రం అలాగే కొనసాగుతోంది. వార్తల ప్రసారం, విధానపరమైన నిర్ణయాలు యాజమాన్యాల పరిధిలోవి. జర్నలిస్గ్‌ వృత్తిపరమైన బాధ్యత మాత్రమే అతని చేతుల్లో ఉండే విషయం. ఇంత చిన్న లాజిక్‌ తెలియని వ్యక్తుల చేతుల్లోకి ముఖ్యమంత్రి కార్యాలయం నడుస్తుండటమే విషాదం. ఇప్పటికే జగన్‌ పిఆర్‌ వింగ్‌ పనితీరు మీద ఏపీలో బోలెడు సటైర్లు…. పాజిటివ్‌గా ఒక్క వార్త రాయించుకునే సత్తా కూడా లేని వాళ్లు రిపోర్టర్లను గ్రూప్‌ల నుంచి తొలగించి మాత్రం ఏం చేయగలరని నవ్వుకుంటున్నారు. అయ్యా జగన్‌ కాస్త ఆ సంగతేదో చూడండి. మీ వార్తలు రావాలంటే రిపోర్టర్లకు ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డు, డిఎన్‌ఏ రిపోర్టు కూడా అడిగేట్లు ఉన్నారు.

Tags:    

Similar News