మోడీ ఒకే కానీ..అమిత్ షా అలా ?

జగన్ కి బీజేపీలో మిత్రులు చాలా తక్కువే. చంద్రబాబు మాదిరిగా ఆయనకు ఏపీ నుంచి గట్టి నాయకులు మద్దతుగా లేరు. పైగా జగన్ కూడా ఆ దిశగా [more]

Update: 2020-04-29 13:30 GMT

జగన్ కి బీజేపీలో మిత్రులు చాలా తక్కువే. చంద్రబాబు మాదిరిగా ఆయనకు ఏపీ నుంచి గట్టి నాయకులు మద్దతుగా లేరు. పైగా జగన్ కూడా ఆ దిశగా ఆలోచనలు చేయరు కూడా. ఆయన నేరుగానే సంబంధాలు కొనసాగిస్తారు. అవి కూడా పరిమితంగానే ఉంటాయి. అంటే కేంద్ర, రాష్ట్ర స్థాయి ప్రభుత్వాల వరకే వాటిని పరిమితం చేస్తారు. ఇదిలా ఉండగా ఇపుడు ఏపీలో చూసుకుంటే ఓ వైపు జనసేన బీజేపీతో జట్టు కట్టింది. చంద్రబాబు దాదాపు రెండేళ్ల తరువాత మోడీతో ఫోన్ కలిపారు. ఈ నేపధ్యంలో జగన్ కి కేంద్ర స్థాయిలో బలం తగ్గుతోందన్న భావన ఉంది. దానికి తోడు మొదటి నుంచి జగన్ కి కేంద్రంలో మోడీతోనే కొంత సాన్నిహిత్యం ఉంది తప్ప అంతకు మించి అడుగు ముందుకుపడడంలేదని అంటున్నారు. దాంతో మోడీ తరువాత పెద్ద తలకాయగా ఉన్న అమిత్ షాతో జగన్ కి పెద్దగా సానుకూలత లేకుండా పోయిందని అంటారు.

మోడీ సరే…..

ప్రధాని మోడీ రాజకీయంగా ఎక్కువగా అమిత్ షా మీదనే ఆధారపడతారు. తక్కువ వయ‌సు రిత్యా, ఇతరత్రా పార్టీ సంస్థాగత బలం, బలగం దృష్ట్యా బీజేపీలో మోడీ కంటే షా అమిత బల సంపన్నుడు. ఈ వాస్తవం చంద్రబాబు గ్రహించారు కానీ జగన్ కి అర్ధమయ్యేసరికి కధ మొత్తం మారిపోయింది. మోడీ జగన్ పట్ల కొంత అనుకూలంగా ఉంటూ వస్తున్నా కేంద్రంలో పనులు కాకపోవడానికి అమిత్ షా ప్రసన్నం కాకపోవడమే కారణం అంటారు. అందుకే శాసనమండలి బిల్లు తో సహా చాలా వరకూ పెండింగులో ఉన్నాయి. ఇక జగన్ కేంద్రం నుంచి ఏది కోరినా కూడా సీన్ రివర్స్ అవుతోంది.

షాక్ అలా….

ఇపుడు చూసుకుంటే జగన్ కి అమిత్ షా గట్టి షాక్ ఇచ్చేశారు. తాను సస్పెండ్ చేసి జీతం కూడా నిలిపివేసిన ఐఏఎస్ అధికారి జాస్తి కిషోర్ కి కేంద్రంలో మంచి పదవి అప్పగించారు. ఈ విధంగా జగన్ కి అమిత్ షా తన మార్క్ పాలిటిక్స్ చూపించారు. నిజానికి జగన్ విషయంలో అమిత్ షా మొదటి నుంచి మూడవ కన్ను పెట్టే చూస్తున్నారు. మోడీ మాదిరి షా కాదు, ఆయన రాజకీయం కఠినంగా ఉంటుంది. అది కర్నాటక, మహారాష్ట్ర వంటి చోట్ల జరిపిన తీరుని దేశమంతా చూసింది. జగన్ తనకు కావాల్సిన ఐఏఎస్ అధికారులను ఇతర రాష్ట్రాల నుంచి కోరుకుంటే షా మాత్రం ఉలకడం లేదు, పలకడంలేదు. అదే సమయంలో బాబుతో మంచి రిలేషన్లు ఉండి ఏళ్ళకు ఏళ్ళుగా టీటీడీలో పనిచేసిన జేఈవో శ్రీనివాసరాజుని జగన్ అధికారంలోకి వచ్చాక లూప్ లైన్లోకి నెడితే ఆయన అమిత్ షాను పట్టుకుని తెలంగాణాలో కీలకమైన పదవిలో సెటిల్ అయిపోయారు.

అనుమానమేనా…?

జగన్ విషయంలో అమిత్ షా ఎందుకో పెద్దగా కలుపుగోలుగా లేరని అంటున్నారు. ఆ మధ్య సీబీఐ లో జరిగిన ఇద్దరు అధికారుల ఘర్షణలో మన్మోహన్ సింగ్ అన్న అధికారి రచ్చ చేసి షా అగ్రహానికి గురి అయితే ఆయని జగన్ చేరదీసి కీలక పదవి ఇచ్చారని అమిత్ షా గుస్సా మీద ఉన్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అదెంత వరకూ నిజమో తెలియదు కానీ అమిత్ షా టీడీపీ తమ్ముళ్ళ మాటలను వింటున్నారని, అలాగే ఏపీలో ఉన్న రాజకీయ వాతావరణాన్ని అనుకూలం చేసుకుని బీజేపీని అక్కడ బలోపేతం చేయదలచుకున్నారని అంటున్నారు. అందుకే జగన్ పాలన మీద ఒక నిఘా పెట్టి ఉంచారని అంటున్నారు. జగన్ కి ఇపుడు రెండవ పెద్దాయనను ప్రసన్నం చేసుకోవడం ఎలా అన్నది అర్ధం కావడం లేదుట. మోడీ వరాలు ఇస్తున్నా పూజారి పాత్రలో అమిత్ షా పని కానివ్వడం లేదన్న బాధ వైసీపీ పెద్దల్లో ఉంది. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News