జగన్ ని బాగా కెలుకుతున్నారుగా?

జగన్ పార్టీలో ఆయనే సుప్రీం. ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీలలో అధినేత మాటే ఫైనల్. వారే మోనార్క్. మరో మాటకు తావు లేదు. అయితే జగన్ [more]

Update: 2020-06-04 06:30 GMT

జగన్ పార్టీలో ఆయనే సుప్రీం. ఆ మాటకు వస్తే ప్రాంతీయ పార్టీలలో అధినేత మాటే ఫైనల్. వారే మోనార్క్. మరో మాటకు తావు లేదు. అయితే జగన్ కి మిగిలిన నాయకులకు తేడా ఉంది. జగన్ బయటకు అలా కనిపించేస్తారు. చంద్రబాబునాయుడు లాంటి వారు దానికి ప్రజాస్వామ్యం పూత పూస్తారు. అందుకే దళిత నాయకుడు, సీనియర్ మోస్ట్ లీడర్ మోత్కుపల్లి నరసింహులు లాంటి వారిని బాబు పక్కకు పెట్టినా పార్టీలో పెద్దగా వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడ్డారు. జగన్ తీరు అలా కాదు, కోపం వస్తే మూడవ కన్ను తెరుస్తారు. అవతల వారు భస్మీపటలం కావాల్సిందే. ఇది పార్టీలో భయం కంటే ఆందోళన‌ రేకెత్తిస్తుంది. పర్యవసానాలు కూడా వేరేగా ఉంటాయి.

కెలుకుతున్నారుగా…?

వైసీపీలో ఒక ఎంపీగా ఉన్న గోదావరి జిల్లాలకు చెందిన రఘురామ కృష్ణంరాజు ఇపుడు జగన్ సర్కార్ ని తెగ విమర్శిస్తున్నారు. ఆయన నేరుగా టీడీపీ అనుకూల మీడియాకు వచ్చి వారికి కావాల్సిన మసాలా వార్తలు అందిస్తున్నారు. ఆయన జగన్ పాలనను డైరెక్ట్ గా విమర్శిస్తున్నారు. జగన్ ఎవరికీ అందరని, ప్రత్యేక కోటరీ ఆయన్ని ఎపుడూ అట్టిపెట్టుకుని ఉంటుందని ఆరోపిస్తున్నారు. ఇక ఆయనకు క్షేత్ర స్థాయిలో జరిగే విషయాలు తెలియవు అంటున్నారు రామక్రిష్ణంరాజు. ఏపీలో జగన్ తీసుకొచ్చిన ఇసుక పాలసీ దారుణంగా ఉందని విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి జగన్ ని ఎక్కడ కెలకాలో అక్కడ కెలుకుతున్నారు.

వేటు కోసమేనా….?

జగన్ తన మీద వేటు వేయాలని ఆ ఎంపీగారు కోరుకుంటున్నారని ఓ వైపు ప్రచారం సాగుతోంది. అపుడు ఏ ఇబ్బంది లేకుండా ఆయన తన పదవిని మరో నాలుగేళ్ళు అనుభవించవచ్చు, ఇష్టం వచ్చినట్లుగా కూడా ఉండొచ్చు. మరి చాలా తెలివిగా రఘురామ క్రిష్ణంరాజు ఆడుతున్న ఈ పొలిటికల్ గేమ్ జగన్ కి అర్ధం కాకుండా ఉండదుగా అంటున్నారు. ఇప్పటికే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం పార్లమెంట్ సీట్లో బీజేపీ మాజీ ఎంపీ గంగరాజు కుమారుడుకి బాధ్యతలు జగన్ అప్పగించారు. రానున్న రోజుల్లో ఆయనే ఎంపీ అభ్యర్ధి అని కూడా చెప్పకనే చెప్పేశారు. వైసీపీ నేతలు గ్రామ స్థాయి నుంచి కూడా ఎవరు రఘురామ క్రిష్ణంరాజును పట్టించుకోకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు. కానీ రాజు గారు కోరినట్లుగా వేటు వేయడం అన్నది జగన్ చేస్తారా అన్నదే చూడాలి.

బీజేపీ గేమా…?

ఇక ఏపీలో కనీసమాత్రంగా కూడా బలం లేని బీజేపీకి టీడీపీ నుంచి నలుగురు ‌ ఎంపీలు తోడు అయ్యారు. అయితే వారంతా రాజ్యసభ నుంచి వచ్చినవారు. క్షేత్ర స్థాయిలో బలం లేదు. మరో వైపు కొత్తల్లోనే వైసీపీ లోక్ సభ ఎంపీల మీద బీజేపీ చూపు పడినా కూడా ఎందుకో కాస్తా మొహమాటానికి ఆగిపోయారు. జగన్ కూడా కేంద్రానికి సహకారంగా ఉంటూ వస్తున్నారు. ఇపుడు ఎటూ ఏడాది అయింది. తమ రాజకీయం తాము చేసుకోవాలి కాబట్టి కొంతమంది ఎంపీలతో బీజేపీ పెద్దలు ఏపీలో రాజకీయ మొదలు పెడతారేమోనని అంటున్నారు. ఇక జగన్ ఈ రాజకీయాన్ని ఎలా తట్టుకుంటారో ఎలా జవాబు చెబుతారో చూడాల్సిందే.

Tags:    

Similar News