రూట్… సెపరేట్… ఇద్దరిదీ చెరో దారి?

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి అంశాలపై భిన్న వైఖరులు తీసుకుంటున్నారు. గతంలో బీజేపీతో సాన్నిహిత్యం ప్రదర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఆ పార్టీపై దూకుడు [more]

Update: 2020-09-04 15:30 GMT

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ స్థాయి అంశాలపై భిన్న వైఖరులు తీసుకుంటున్నారు. గతంలో బీజేపీతో సాన్నిహిత్యం ప్రదర్శించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ఆ పార్టీపై దూకుడు కనబరుస్తున్నారు. కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటానంటూ ప్రకటిస్తున్నారు. అదే సమయంలో దాయాది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అతి సంయమనం పాటిస్తున్నారు. కేంద్రం చెప్పినదానికి తల ఊపుతున్నారు. తెలంగాణ సీఎం ఆగ్రహావేశాల వెనక రాజకీయ కారణాలున్నాయా? అనేది ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిర్ణయాల వెనక ఆత్మరక్షణ వైఖరి కారణమా? అనేది మరో ప్రశ్న. ఏదేమైనప్పటికీ స్థానికంగా తమ రాష్ట్రాల్లో నెలకొని ఉన్నరాజకీయ వాతావరణానికి అనుగుణంగానే ఆయా నేతలు నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కేసీఆర్ కస్సుబుస్సు…

నిన్నామొన్నటివరకూ కేసీఆర్ తన రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తూ వచ్చారు. బీజేపీ, ఇతర పక్షాలు పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికారపార్టీకే లాభిస్తుందనే అంచనా ఆయనది. 2018 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆయన అనుకున్నట్లుగానే సాగింది. కేంద్రంతో సయోధ్యతో అనేక అంశాలను సాధించుకోగలిగారు. శాసనసభకు ముందస్తు ఎన్నికల సహా ఆయనకు కేంద్రం సహకరించింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలు బీజేపీ సొంతంగా బలపడే అవకాశాలను ప్రస్ఫుటం చేశాయి. దాంతో అంతకుముందు వరకూ ద్విముఖ వ్యూహం అనుసరిస్తూ వచ్చిన బీజేపీ తన వైఖరిని మార్చుకుంది. లోక్ సభ ఎన్నికలకు ముందు వరకూ చాలా మంది కేంద్ర మంత్రులు రాష్ట్ర పర్యటనల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తేవారు. స్థానికంగా బీజేపీ విమర్శలు చేస్తుండేది. కేంద్రం ప్రశంసల పర్వాన్ని పక్కనపెట్టేసింది. పూర్తిస్థాయి పోరాటానికి బీజేపీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించాలనే ఎత్తుగడలు వేస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలపై కమలం పార్టీ దూకుడు పెంచింది. బీజేపీ బలపడితే తనకు రాజకీయంగా ఎదురయ్యే ప్రమాదం కేసీఆర్ గ్రహించారు. అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆయన తీవ్రస్థాయి ఆరోపణలు చేస్తున్నారు. జీఎస్టీ బకాయిల విషయంలో పార్లమెంటులో పోరాటంతోపాటు న్యాయపోరాటానికి సైతం తెలంగాణ సిద్దమవుతోంది. కేంద్ర విద్యుత్ సంస్కరణల పై ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది లేదని తేల్చి చెప్పేశారు. సంస్కరణలు అమలు చేస్తే ఎఫ్ ఆర్ బీఎం పరిమితులను మించి అదనంగా రుణం తెచ్చుకొనేందుకు వెసులుబాటు కల్పించినా కేసీఆర్ పరిగణనలోకి తీసుకోవడం లేదు. రాష్ట్రంలో పరిస్థితులకు కేంద్రాన్ని దోషిగా చూపించే వ్యూహంతోనే కేసీఆర్ పావులు కదుపుతున్నారు.

జగన్ జయహో…

భారతీయ జనతాపార్టీ ఆలోచనలకు, కేంద్ర నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జయహో అంటున్నారు. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్తుకు నగదు బదిలీని గతంలో ఏపీ వ్యతిరేకించింది. ఈమేరకు ఇంధన శాఖ కార్యదర్శి కేంద్రానికి లేఖ కూడా రాశారు. కానీ తాజాగా పూర్తి రివర్స్ గేర్ లోకి మారిపోయింది ప్రభుత్వం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మీటర్లు పెట్టి నగదు బదిలీని అమలు చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది. ఈలోపు ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయాలని సంకల్పించారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డిపైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద బాధ్యతనే ఉంచారు. ప్రత్యేక హోదా అంశాన్ని ఎన్నికల్లో ఒక ప్రధాన వాగ్దానంగా వైసీపీ హామీనిచ్చింది. ఈ డిమాండ్ పట్ల కేంద్రం తన వ్యతిరేకత పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. దీంతో వైసీపీ కూడా క్రమేపీ డిమాండ్ ను బలహీన పరుస్తోంది. బడ్జెట్ లో ఆ ప్రస్తావన లేకపోవడమే అందుకు నిదర్శనం. తాజాగా జీఎస్టీ పరిహారం విషయంలోనూ రాష్ట్రాలన్నీ గగ్గోలు పెడుతున్నా వైసీపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. బీజేపీతో సంబంధాలను కాపాడుకోవాలనే ప్రయత్నం ఒకటైతే, ఆర్థిక సంక్షోభంలో కనీసం అప్పులు తీసుకోవడానికైనా కేంద్రం సహకరిస్తుందనే ఉద్దేశంతో వైసీపీ సానుకూలంగా ఉంటోంది. అందులోనూ ఈ రెండు పార్టీల లక్ష్యం టీడీపీని దెబ్బతీయడమే కావడం విశేషం.

కమలం కహానీ…

రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు సాధించాలనేది బీజేపీ లక్ష్యం. తెలంగాణలో కాంగ్రెసు బలహీనపడుతోందనేది ఆ పార్టీ అంచనా. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే అధికారపార్టీనే టార్గెట్ చేయాలనుకుంటోంది. పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు యత్నిస్తోంది. బీజేపీకి తెలంగాణలో సొంత ఓటు బ్యాంకు ఉండటం ఒక అడ్వాంటేజ్. మధ్యతరగతి, మేధో వర్గాలను, తటస్థ ఓటర్లను, జాతీయ వాద భావనలు ఉన్నవారిని ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ దెబ్బతింటే తప్ప ప్రత్యేక ఓటు బ్యాంకు ఏర్పడదని బీజేపీ భావన. ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గ ఓట్లు సంఘటితంగా వైసీపీకి వెన్నుదన్నుగా ఉంటున్నాయి. ఈ ఓటు బ్యాంకును ఆకర్షించడం బీజేపీకి అంత సులభం కాదు. అందుకే టీడీపీ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టింది. తెలుగు దేశం పార్టీ సానుభూతి వర్గాలలో మద్దతు సంపాదించగలిగితే పవన్ కల్యాణ్ క్రేజ్ తో ప్రధాన పార్టీగా నిలవవచ్చనేది బీజేపీ అంచనా. అందుకే వైసీపీని తమ ఇమ్మీడియెట్ ప్రత్యర్థిగా ఆ పార్టీ భావించడం లేదు.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News