జగన్ బెయిల్ రద్దు చేస్తే?

జగన్ నెత్తి మీద సీబీఐ కేసుల కత్తి వేలాడుతోంది. ఇది అందరికీ తెలిసిందే. జగన్ రాజకీయంగా పెద్దగా అవగాహన లేకముందు ఢిల్లీని ఢీ కొట్టిన ఫలితమిది. ఆ [more]

Update: 2019-12-15 08:00 GMT

జగన్ నెత్తి మీద సీబీఐ కేసుల కత్తి వేలాడుతోంది. ఇది అందరికీ తెలిసిందే. జగన్ రాజకీయంగా పెద్దగా అవగాహన లేకముందు ఢిల్లీని ఢీ కొట్టిన ఫలితమిది. ఆ సమయంలో జగన్ అనుకున్నది ఒకటే. తాను ఏ విషయంలోనూ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని. ఎన్ని కేసులు పెట్టుకున్నా న్యాయం తన పక్కనే ఉంది కాబట్టి బేఫికర్ అనేశారు జగన్. అయితే కేసు అన్నది పెట్టడం వరకే సాఫీగా కధ ఉంటుంది. ఆ తరువాత ఒక్క సారి కేసులూ. విచారణ ఇలా తగులుకుంటే అంత తొందరగా బయటకు రాలేరు. ఇది జగన్ స్వయంగా అనుభవిస్తున్న విషయమే. జగన్ కేసులో పదకొండు చార్జిషీట్లు పడ్డాయి. ట్రయల్ కోర్టులో విచారణ చూసుకుంటే క్లీన్ చీట్ వస్తుందనుకున్నా కూడా ఎంతకాలం పడుతుందో, ఎప్పటికి తెములుతుందో కూడా ఎవరికీ తెలియని స్థితి. అన్ని కేసులు కలిపి జగన్ విచారించమంటున్నా కూడా సాంకేతిక కారణాలు చూపిస్తూ సీబీఐ అడ్డుకుంటోంది. దాంతో జగన్ కేసుల్లో జాప్యం కచ్చితంగా జరుగుతుందన్నది వాస్తవం.

చెలగాటమే….

ఇక జగన్ కేసులు కళ్ళకు కనబడుతున్నాయి. ఆయన సీబీఐ కోర్టుకు ఆరు నెలల క్రితం వరకూ వెళ్ళారు. ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను సీఎం అని, వ్యక్తిగత మినహాయింపు ఇమ్మనమని జగన్ కోరుతున్నా కూడా సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికి విచారణ అనేక వాయిదాలు పడినా జగన్ హాజరు కాలేదు. సరిగ్గా దీనిమీదనే ప్రతిపక్ష నేత చంద్రబాబు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ సాధారణ ఎంపీగా ఉన్నపుడే సాక్షులను ప్రభావితం చేశారు. ఇపుడు జగన్ ముఖ్యమంత్రి. అందువల్ల ఆయన మరింత బలంగా ప్రభావితం చేయగలరు అంటూ అచ్చం సీబీఐ భాషలోనే బాబు మాట్లాడారు. తన అవినీతి కేసులు విచారించిన జాస్తి కిషోర్ లాంటి అధికారులను సస్పెండ్ చేయడమే దీనికి నిదర్శనమని ఆయన కొత్త పాయింట్ లేవనెత్తుతున్నారు. జగన్ విషయంలో సీబీఐ అనుమానించిందే జరుగుతోందని కూడా ఆయన అంటున్నారు.

కండిషన్లు బ్రేకేనా…?

జగన్ కి నిజానికి ఇచ్చిన బెయిల్ కండిషన్లతో కూడుకున్నదని ఆయన చెబుతున్నారు. జగన్ ప్రతి కండిషన్ తప్పుతున్నారని, ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదన్న డిమాండ్ ని కూడా చంద్రబాబు ముందు పెడుతున్నారు. బాబు కోరుకున్నదేంటి అన్నది అందరికీ తెలిసిందే. జగన్ బెయిల్ రద్దు కావాలి, ఆయన మళ్ళీ జైలు కి వెళ్ళిపోవాలి. ఇప్పటి దాకా తన పార్టీ నాయకులు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలతో జైలూ. జగన్ అంటూ కామెంట్స్ చేయించారు. ఇపుడు మాత్రం తానే స్వయంగా రంగంలోకి దిగిపోయారు. జగన్ దూకుడు చూసే చంద్రబాబు ఈ విధంగా రియాక్ట్ అవుతున్నారనుకోవాలి.

బీజేపీ రియాక్షన్ …..

ఇదిలా ఉంటే రోగి కోరింది. వైద్యుడి ఇచ్చినది ఒకే మందు అన్నట్లుగా బీజేపీ సైతం ఇదే విధంగా అడుగులు వేస్తోంది. జగన్ కేసులను విషయంలో విచారించేందుకు ఏకంగా సీబీఐని అమరావతిలోకి తరలించేందుకు ఆ పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ విషయంలో కేంద్ర పెద్దలను కలసి వినతిపత్రం కూడా ఇచ్చేశారు. మరి సీబీఐ కోర్టు ఇపుడు జగన్ ఉన్న ఏపీలోనే ఉంటుందన్న మాట. ఆ విధంగా జగన్ కోర్టూ, కేసులు కధ మరింత రంజుగా సాగేందుకు బీజేపీ తన వంతుగా సాయం చేస్తుందనుకోవాలి. ఈ నేపధ్యంలో జగన్ వీటిని ఎదుర్కొనేందుకు ఏ రకమైన వ్యూహాలను రచిస్తారో చూడాలి.

Tags:    

Similar News