ఫైటింగ్ కు రెడీ అయినట్లేనా…?

వై.ఎస్.జగన్ వ్యవహారశైలి నాకు అర్ధం కావడంలేదు అన్నారు రాజకీయ దిగ్గజం కొణిజేటి రోశయ్య. ఆయన వ్యంగ్య వ్యాఖ్యలకు పెట్టింది పేరు అంటారు కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ [more]

Update: 2019-07-31 06:30 GMT

వై.ఎస్.జగన్ వ్యవహారశైలి నాకు అర్ధం కావడంలేదు అన్నారు రాజకీయ దిగ్గజం కొణిజేటి రోశయ్య. ఆయన వ్యంగ్య వ్యాఖ్యలకు పెట్టింది పేరు అంటారు కాబట్టి వాటిని పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ రాజకీయ పండితులు, మేధావులకు కూడా వై.ఎస్.జగన్ వైఖరి అంతుపట్టకుండా ఉంది. రెండు నెలల క్రితం బంపర్ మెజారిటీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్ ఢిల్లీకి వెళ్ళింది సీఎం హోదాలో ఒక్కసారే. ఇక అంతకు ముందు పార్టీ గెలిచిన తరువాత మర్యాదపూర్వకంగా ప్రధాని మోడీని ఒకసారి కలిశారు. నిజానికి బీజేపీతో రాజకీయంగా వైసీపీకి ఎటువంటి బంధమూ లేదు. రెండూ వేరు వేరు రాజకీయ పంధా కలిగిన పార్టీలు. అయినా వై.ఎస్.జగన్ స్వయంగా చెప్పినట్లుగా నేను ముఖ్యమంత్రిని, ఆయన ప్రధాని, కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని సార్లు అయినా మోడీని కలుస్తాను అన్నారు. మరి ఇప్పటికి ఒక్కసారి కూడా వై.ఎస్.జగన్ ఢిల్లీకి పోలేదు. ఇక కేంద్రం, వై.ఎస్.జగన్ ల మధ్య సయోధ్య ఎలా ఉంది అంటే అది కూడా బడ్జెట్ పుణ్యమా అని తెలిసిపోయింది. అరకొర నిధులు తప్పితే విభజన వల్ల దారుణంగా అన్యాయం అయిన ఏపీకి ప్రత్యేకత చూపలేదు, ఒక్క రూపాయి విదిలించిందీ లేదు.

హోదాపై తూట్లు పొడిచినా…..

ఇక ఈ రెండు నెలలలో అనేక సంధర్భాలలో కేంద్ర మంత్రులు పార్లమెంట్ బయటా లోపలా కూడా హోదాపై తూట్లు పొడిచేలా మాట్లాడారు. అది ముగిసిన అధ్యాయమని కూడా నొక్కి వక్కాణించారు. ఏపీకి హోదా ఇవ్వడానికి సాంకేతిక అంశాలు అడ్డుగా ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ప్రత్యేక ప్యాకేజికి నాటి టీడీపీ ప్రభుత్వం అంగీకరించింది కాబట్టి హోదా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని కూడా క్లారిటీగా చెప్పేశారు. మరో వైపు వై.ఎస్.జగన్ తీరు చూస్తే ఏపీకి హోదా రావాల్సిందే, అది విభజనతో గాయపడిన రాష్ట్రానికి ఇచ్చిన అతి పెద్ద వూరడింపు అన్నారు. ఏకంగా తొలి అసెంబ్లీలోనే ప్రత్యేక హోదాపై తీర్మానం మళ్ళీ చేసి వై.ఎస్.జగన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. హోదా లేదు అంటున్న కేంద్రానికి తిరుగుటపాలో ఘాటైన సమాధానం అలా పంపారు. ఇది కేంద్రానికి కోపం తెప్పించేదే మరి.

విద్యుతు ఒప్పందాలపై సమీక్ష ….

ఇక విద్యుతు ఒప్పందాల వ్యవహారం చూసినా వై.ఎస్.జగన్ కేంద్రంలో లడాయి పెట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఒప్పందాలపై సమీక్షలు వద్దు అంతూ సాక్ష్తాత్తూ కేంద్ర మంతి వై.ఎస్.జగన్ కి లేఖ రాసినా తేలిగ్గా తీసుకున్నారు. తాను అలాగే ముందుకుపోతానని అన్నారు. మరో వైపు ఏపీలో బలపడదామని బీజేపీ వేస్తున్న ఎత్తులను వై.ఎస్.జగన్ వరసగా చిత్తు చేస్తున్నారు. ప్రత్యేక హోదా పేరిట లక్ష్మణ‌రేఖ గీసి మరీ బీజేపీకి ఏపీ ప్రజలను దూరం చేస్తున్నారు. ఇంకోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి పోకుండా ఫిరాయింపులకు ఎవరైనా పాల్పడితే వారిని అనర్హులుగా చేసి పారేయాలంటూ ఏకంగా స్పీకర్ కే సభాముఖంగా తమ ప్రభుత్వ విధానాన్ని తెలియచేశారు. దీంతో టీడీపీ నుంచి బీజేపీలోకి ఎమ్మెల్యేలు ఎవరూ రాకుండా వై.ఎస్.జగన్ బ్రేక్ వేసినట్లైంది. ఇది కూడా బీజేపీ పెద్దలకు గుస్సా తెప్పించేదే.

కీలక బిల్లుల విషయంలోనూ….

ఇపుడు తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా వై.ఎస్.జగన్ తన పార్టీ ఎంపీలు రాజ్యసభలో ఓటింగులో పాల్గొనకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇలా రెండు నెలలలో ఏపీలో ఉంటూనే ఢిల్లీకి అమరావతికి ఎంత దూరం అంటే చాలనే అంటున్నారు వై.ఎస్.జగన్. మరి దీన్ని చూసేనేమో చాలామంది కేంద్రంతో వై.ఎస్.జగన్ సఖ్యతగా ఉండడం లేదని అంటున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు మోడీకి అమిత్ షాలకు బద్ద విరోధి కాబట్టి ఆ రాజకీయ లెక్కల్లో చూస్తే మాత్రం డిల్లీకి వై.ఎస్.జగన్ దగ్గరేనని అంటున్న వారూ లేకపోలేదు. మొత్తానికి వై.ఎస్.జగన్ తీరు ఎవరికీ అర్ధం కాకపోయినా ఆయన రాజకీయంగా దూకుడుగానే ఉన్నారన్నది మాత్రం అంతా అంగీకరిస్తున్నారు.

Tags:    

Similar News