అందరినీ ఎందుకు సైడ్ చేస్తున్నారు?

ఏపీలో అధికార వైసీపీలో రోజురోజుకు పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నాలుగు నెలల్లోనే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. [more]

Update: 2019-10-09 06:30 GMT

ఏపీలో అధికార వైసీపీలో రోజురోజుకు పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా నాలుగు నెలల్లోనే ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇదిలా ఉంటే పార్టీ ఓడిపోయిన నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు జగన్ ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తుండటం. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఓడిన నేతలకు పూర్తిగా షాకులు ఇస్తుండడంతో పార్టీలో చాలా మంది నేతల్లో కలకలం రేగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ 24 నియోజకవర్గాల్లో ఓడిపోయింది. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా 151 సీట్లలో ఘన విజయం సాధించింది.

ఇన్ ఛార్జులను తప్పించి….

వైసిపి ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఇప్పటికే చాలా చోట్ల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను పక్కన పెట్టేసి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తున్నారు. పాలకొల్లులో డాక్టర్ బాబ్జీని త‌ప్పించి కౌరు శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించారు. రాజమండ్రి సిటీ లో రౌతు సూర్య ప్రకాశరావు తప్పించి శిఖాకొల్లు శివ రామ సుబ్రహ్మణ్యంను కొత్త ఇన్చార్జిగా నియమించారు. ప్రకాశం జిల్లా పర్చూరులోనూ సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు పక్కన పెడతారన్న వార్తలు వస్తున్నాయి. ఇక పెద్దాపురంలో తోట వాణిని తప్పించి దవులూరి దొరబాబుకు బాధ్యతలు ఇవ్వవచ్చని తెలుస్తోంది.

ఓట్లు చీలడంతో…

ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ ఆకులు వీర్రాజును సైతం సైడ్ చేసేస్తారన్న ప్రచారం పార్టీలో జోరుగా నడుస్తోంది. ఆకుల వీర్రాజు 2014 ఎన్నిక‌ల‌కు ముందు నుంచే వైసీపీలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ సీనియ‌ర్ గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి చేతిలో ఓడిపోయిన ఆయ‌న ఐదేళ్ల పాటు పార్టీ కోసం క‌ష్టప‌డి ప‌నిచేశారు. మ‌రోసారి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌గా రాష్ట్రం అంతటా వైసీపీ ప్రభంజ‌నం వీచినా అక్కడ మాత్రం మ‌ళ్లీ వీర్రాజు బుచ్చయ్య చేతిలో వ‌రుస‌గా రెండోసారి ఓడిపోయారు. వీర్రాజు క‌ష్టప‌డినా అటు జ‌న‌సేన నుంచి మ‌రో బ‌ల‌మైన నేత‌, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఉండ‌డంతో ఇద్దరు కాపు నేత‌ల మ‌ధ్య ఓట్లు బ‌లంగా చీలి బుచ్చయ్య అదృష్టం కొద్ది గెలిచారు.

ఆయనకు అప్పగిస్తే…..

ఇక ఇప్పుడు గ‌తంలో బీజేపీ నుంచి సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఆకుల స‌త్యనారాయ‌ణ ఆ త‌ర్వాత ఈ ఎన్నిక‌ల‌కు ముందు జ‌న‌సేన‌లో చేరి రాజ‌మండ్రి ఎంపీగా జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి ల‌క్ష్మీప‌ద్మావ‌తి సైతం జ‌న‌సేన‌కు రాజీనామా చేసేశారు. ఈ క్రమంలోనే ఆకుల స‌త్యనారాయ‌ణ దంప‌తులు వైసీపీలో చేర‌తార‌ని.. ఇందుకు ముహూర్తం కూడా రెడీ అయ్యింద‌న్న ప్రచారం జ‌రుగుతోంది. వైసీపీలో చేరే ఆకులకు రాజ‌మండ్రి రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ ప‌గ్గాలు అప్పగించేలా ఒప్పందం కుదిరింద‌ని కూడా తెలుస్తోంది. ఏదేమైనా ఓ ఆకుల ఎంట్రీతో మ‌రో ఆకుల‌కు షాక్ త‌గ‌ల‌నుంది. మ‌రి ఆకుల స‌త్యనారాయ‌ణ‌కు వైసీపీ ప‌గ్గాలు ఇస్తే వీర్రాజు ఫ్యూచ‌ర్ ఏం అవుతుందో ? చూడాలి.

Tags:    

Similar News