అస్త్రాలు వారే సమకూర్చారా?

అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విపక్షాలను అన్యాపదేశంగా ఒకే గొడుగు కిందకి తెచ్చిపెడుతున్నాయి. సింగిల్ పాయింట్ అజెండాగా అంతా కలిసి కట్టుగా నడిచేలా ప్రభుత్వాలే బ్రహ్మాండమైన [more]

Update: 2019-11-02 15:30 GMT

అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు విపక్షాలను అన్యాపదేశంగా ఒకే గొడుగు కిందకి తెచ్చిపెడుతున్నాయి. సింగిల్ పాయింట్ అజెండాగా అంతా కలిసి కట్టుగా నడిచేలా ప్రభుత్వాలే బ్రహ్మాండమైన అస్త్రాలు సమకూర్చి పెడుతున్నాయి. నిజానికి ఉత్తర దక్షిణాలుగా ఉండే పార్టీలు సైతం చేతులు కలుపుతున్నాయి. రాజకీయంగా తమకు నష్టదాయకమని తెలిసినా ముందుగా ప్రభుత్వానికి చెక్ పెడితే తర్వాత తమలో తాము చూసుకోవచ్చనే దోరణి పార్టీల్లో కనబడుతోంది. ఆర్టీసీ సమ్మె, ఇసుక కొరత రెండు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్నాయి. ప్రభుత్వం ముందుగా మేలుకోకపోవడంతో ఇసుక కొరత ఏర్పడింది. క్రమేపీ దానంతటదే సర్దుకుంటుందని తొలుత భావించారు. క్రమేపీ ఇసుక సమస్య తీవ్రం అవుతోంది. దాదాపు పదిహేను లక్షల కుటుంబాల ఉపాధితో పాటు రాష్ట్రం మొత్తంలో చర్చనీయాంశం కావడంతో దీనిపై పార్టీలన్నీ దృష్టి పెట్టాయి. అలాగే తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఒక ప్రభుత్వ రంగానికే పరిమితం అనుకునే స్థాయి దాటిపోయింది. ఈరెండు అంశాలను డీల్ చేయడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయా? లేక ఉపేక్ష వహించాయా? అనివార్యతలే ఆయా పరిస్థితులకు కారణమయ్యాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆర్టీసి కసి…..

రాష్ట్రరోడ్డు రవాణాసంస్థ ఉద్యోగులు దాదాపు నెలరోజులుగా చేస్తున్న సమ్మె తీవ్ర రూపు దాల్చింది. ఏదో ఒక రాజకీయ పార్టీ ఈ రకమైన ఆందోళన చేపట్టి ఉంటే ప్రభుత్వం ఏనాడో అణచివేసి ఉండేది. కానీ కార్మికుల్లో పెల్లుబుకిన అసంతృప్తి సమ్మెకు దారితీయడంతో యంత్రాంగం చేతులెత్తేయక తప్పలేదు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన ఆంద్రప్రదేశ్ ప్రభావం సమ్మెపై ఎక్కువగా కనిపిస్తోంది. ఆర్థికంగా చిక్కుల్లో ఉండి కూడా ఏపీ సర్కారు ఉద్యోగుల విలీనం వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. పోల్చి చూస్తే ఆర్థికంగా పరిపుష్టత కలిగిన తెలంగాణ ఈ మేరకు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదనేది కార్మిక వర్గాల ఆవేదన. అయితే కార్పొరేషన్ విషయంలో దీర్ఘకాల లక్స్యాలతో ప్రభుత్వ ప్రతిష్ఠకు కొంతమేరకు నష్టం జరిగినా ఎదుర్కోవాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారనేది సమాచారం. తాత్కాలికంగా ఉద్యోగులను సంతృప్తి పరచడం కాకుండా ఆర్టీసి సమస్యలకు శాశ్వత ముగింపు పలకాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా చెబుతున్నారు. దీనివల్ల కార్మికులు, ఆర్టీసీ సంస్థ కొంతమేరకు నష్టపోయేందుకు కూడా ఆస్కారం ఉందంటున్నారు. ప్రయివేటు బస్సుల రంగప్రవేశం, కొన్ని రూట్ల ప్రయివేటీకరణ వంటి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వ కిట్టీలో ఎదురుచూస్తున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల కంటే ప్రస్తుతం తాజా ప్రతిపాదనలపై కార్మికులు ఎక్కువగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు సైతం సమ్మె విషయంలో అంతా ఒకే మాట ఒకే బాటగా నడవాలని నిశ్చయించుకున్నాయి. ప్రభుత్వం పట్టుదలతో భీష్మించుకుంటుంటే విపక్షాలు పట్టుదలతో సర్కారు మెడలు వంచాలని భావిస్తున్నాయి. ఈ పీటముడే ప్రస్తుతం సమస్యగా మారే సూచనలు కనవస్తున్నాయి.

రాజకీయ మేటలు…

ఇసుక తుపాను జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు తొలి నాళ్ల నుంచి ఇబ్బందులు సృష్టిస్తూనే ఉంది. అనాలోచిత నిర్ణయంతో కొత్త పాలసీ వచ్చేవరకూ సరఫరా నిలిపివేయడం సమస్యను పెంచింది. తర్వాత సర్దుబాటుకు ప్రయత్నించినా ఆన్ లైన్ సమస్యలు వెన్నాడుతున్నాయి. మొత్తమ్మీద ప్రజలతో ముడిపడిన అంశం కావడంతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన వంటి పార్టీలన్నీ దీనిని ఒక ప్రధానాంశంగా చేసి చర్చలో నిలిచేలా చూస్తున్నాయి. కచ్చితంగా పొలిటికల్ మైలేజీ లభించే అంశమిది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రభుత్వం సమర్థంగా తిప్పికొట్టలేకపోతోందనే చెప్పాలి. మంత్రులు, ప్రజాప్రతినిధులు సైతం కొన్ని చోట్ల నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఏదేమైనప్పటికీ ప్రతిపక్షాలు సింగిల్ పాయింట్ అజెండాగా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సంక్షేమ పథకాల వెల్లువతో రాజకీయంగా మరింత బలోపేతం కావాలనుకుంటున్న వైసీపీ సర్కారుకు ఇసుక విధానం ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. ఇదే అంశంపై జనసేన లాంగ్ మార్చ్ కు పిలుపు నిచ్చింది. ఆందోళనకు విశాఖ నగరాన్ని కేంద్రంగా ఎంచుకోవడమూ వ్యూహాత్మకమనే చెప్పాలి. రాజధాని ప్రాంతంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ మోహరింపు కారణంగా అమరావతి ప్రాంతంలో ఉద్యమం చేయడం కష్టసాధ్యం. అందువల్లనే రాష్ట్రంలో పెద్ద నగరమైన విశాఖ ను ఎంపిక చేసుకున్నారనుకోవచ్చు. లాంగ్ మార్చ్ సక్సెస్ , ఫెయిల్యూర్ అనే దానితో నిమిత్తం లేకుండానే ఒక అజెండాగా ఇది రాజకీయ పార్టీలకు అస్త్రంగా మారిందనే చెప్పాలి.

అసలు… కొసరు…

రాజకీయంగా టీఆర్ఎస్, వైసీపీలు సాధించినవి అసాధారణ విజయాలు. ఈ మధ్య కాలంలో దక్షిణభారతంలో ఏపార్టీలు సాధించని ఘన విజయాలు అవి. సంక్షేమపథకాల అమలు, అన్నిరకాల వర్గాలకు ఎంతో కొంత సర్కారీ ప్రయోజనం అందేలా జాగ్రత్త తీసుకోవడం ఈరెండు ప్రభుత్వాల ప్రత్యేకతగా చెప్పాలి. ఈ స్థితిలో విపక్షాలలో నిస్సత్తువ ఆవరించింది. నిన్నామొన్నటి లోక్ సభ ఎన్నికల వరకూ తెలంగాణలో అయితే ఏకచ్ఛత్రాధిపత్యమే. టీఆర్ఎస్ చెప్పిందే వేదం. చిన్నాచితకా నిరసన స్వరాలు వినిపించినప్పటికీ ప్రభుత్వ ప్రచారం ముందు దిగదుడుపే. ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పనక్కర్లేదు. ప్రతిపక్షాలు ఇప్పట్లో కోలుకోవడం సాధ్యమా? అన్న రీతిలో ప్రజాతీర్పు చెప్పారు. కానీ ఇప్పటికే ఆందోళనలు మొదలయ్యాయి. ఒక బలమైన మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తోందనే సందేహంతో నిరాధార వార్తలు ప్రసారం, ప్రచురణ చేయకూడదంటూ 2430 జీవో జారీ చేసింది. ఒకవైపు ప్రతిపక్షాలు ఏకమవుతుంటే మరోవైపు మీడియాను దూరం చేసుకుంటున్న ధోరణి కానవస్తోంది. తెలంగాణలో సైతం గతంలో మాదిరిగా మీడియాపై పూర్తిస్థాయి నియంత్రణ సర్కారుకు సాధ్యం కావడం లేదనే చెప్పాలి. ప్రతిపక్షాల ఐక్యతారావం ప్రచార, ప్రసార సాధనాల మద్దతు కలగలిసి ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News