తెగేదాకా లాగితే… అంతే…సరదా తీరిందిగా?

రోడ్డెక్కారు. ఆగర్భ శత్రువుల్లా స్టేట్ మెంట్లు ఇచ్చుకున్నారు. పిట్టల తగవు పిల్లి తీర్చేసింది. దేహీ అంటూ ఇక ముందు రెండు తెలుగు రాష్ట్రాలు అంగలార్చాల్సిందే. చేజేతులారా తమ [more]

Update: 2021-07-17 15:30 GMT

రోడ్డెక్కారు. ఆగర్భ శత్రువుల్లా స్టేట్ మెంట్లు ఇచ్చుకున్నారు. పిట్టల తగవు పిల్లి తీర్చేసింది. దేహీ అంటూ ఇక ముందు రెండు తెలుగు రాష్ట్రాలు అంగలార్చాల్సిందే. చేజేతులారా తమ స్వయం నిర్ణయాధికారాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టారు. కృష్ణ.గోదావరి నదీ యాజమాన్యాల బోర్డుల పేరిట ఉమ్మడి జలాలపై కేంద్రం పెత్తనం చేయబోతోంది. దీనికి ఎవరినీ తప్పు పట్టి లాభం లేదు. కేంద్రాన్ని కూడా వేలెత్తి చూపించలేం. స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఆధిపత్య ధోరణులు, పరస్పర అనుమానాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల స్వయంకృతాపరాధమిది. ఇతర రాష్ట్రాల్లోనూ అనేక జలవివాదాలున్నాయి. కానీ కేంద్రం సాధ్యమైనంతవరకూ వాటి జోలికి పోదు. రాష్ట్ర విభజన చట్టం కల్పించిన ఆసరాతో ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. అయినా ఏడేళ్లలో ముఖ్యమంత్రులు పరస్పరం అంగీకారానికి రాకపోవడమే ఈ అనర్థానికి దారి తీసింది. బోర్డుల యాజమాన్యంతో గొడవలు తీరిపోతాయనుకోవడం భ్రమ. పరస్పరం విమర్శించుకుంటూనే కేంద్రం ముందు మోకరిల్లకతప్పదు.

రెంటికీ కాకుండా పాయె…

రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. గోదావరి నదిపై పరస్పరం అనధికారికమైన అవగాహనకు వచ్చారు ముఖ్యమంత్రులు. చంద్రబాబు నాయుడి సమయంలో పట్టిసీమల ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ సమర్థించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు నాయుడు మౌనం వహించారు. ఆరకంగా రెండు రాష్ట్ఱాలకు ప్రయోజనం సమకూరింది. కృష్ణ విషయంలో పరస్పరం పట్టుదలలు కొనసాగుతూ వచ్చాయి. అయినా ఒక్క సందర్బంలో మినహా నీటి విడుదల, పంపిణీలపై పెద్దగా గొడవలు జరగలేదు. కేంద్రం మద్యవర్తిత్వంలో 2015లో ఒక తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారడంతో శాశ్వతమైన పరిష్కారం కుదురుతుందని అంతా ఆశించారు. తొలి ఏడాది కేసీఆర్, జగన్ ల మధ్య సుహృద్భావ సంబంధాలు కొనసాగాయి. ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో నదీజలాల సహా ఆస్తుల పంపిణీ సైతం పూర్తయిపోతుందని భావించారు. రాజకీయ కారణాలతో ఇరువైపులా అనధికారికంగా నిర్మాణం సాగుతున్న ప్రాజెక్టులకు ఒకరికొకరు మోకాలడ్డుపెట్టుకున్నారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. ఫలితంగా మొత్తం నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతలు, చిన్న తరహా ప్రాజెక్టులన్నీ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కొత్త నిర్మాణాలకు ఆరునెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని , లేకపోతే వాటిని కొనసాగించడానికి వీల్లేదని కేంద్రం చెప్పేసింది. జలవనరులు, పర్యావరణ, అటవీ శాఖల నుంచి అనుమతులు అంత సులభంగా వచ్చేవి కావు. గతంలో ముందుగా నిర్మాణాలు పూర్తి చేసి , ఆ తర్వాత కాలంలో అనుమతులు తెచ్చుకునేవారు. ఇప్పుడు ఆ అవకాశం రెండు రాష్ట్రాల చేతుల నుంచి జారిపోయింది.

సోకు కేంద్రానిదే..

గోదావరి ప్రాజెక్టులపై పెద్దగా చింత పడాల్సిన పని లేదు. దాదాపు కాళేశ్వరం పూర్తయిపోయింది. పోలవరం జాతీయ ప్రాజెక్టు . ఎలాగూ ఎప్పటికైనా నిర్మాణం చేయకతప్పదు. నీరు సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి దానిపై చింత పెట్టుకోనక్కర్లేదు. గోదావరి బోర్డు ఏర్పాటైనా పెద్దగా నష్టం వాటిల్లదు. కానీ కృష్ణా విషయంలో మొత్తం ప్రాజెక్టులు, కాలువలు, నీటి విడుదల యంత్రాంగం, జల విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అన్నీ కృష్ణ బోర్డు పరిధిలోకి వచ్చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన సిబ్బంది సహా , సాంకేతిక , ఆర్థిక అవసరాలన్నిటికీ నిధులు రెండు రాష్ట్రాలు సమకూర్చాలి. పెత్తనం మాత్రం కేంద్రం చేస్తుంది. తమకు పంపకాల్లో వచ్చిన వాటాను సైతం నచ్చినట్లు, అవసరానికి అనుగుణంగా వాడుకునే వెసులుబాటు ఉండదు. సిస్టం పేరు చెప్పి బోర్డు రకరకాలుగా ఆలోచించిన తర్వాతనే నీటి విడుదల, పంపిణీ వంటివి చేస్తుంది. అందువల్ల జాప్యం చోటు చేసుకొంటుంది. రెండు రాష్ట్రాలు నష్టపోయే అవకాశాలున్నాయి.

ఇతర రాష్ట్రాలకు మేలు..

అన్నదమ్ముల్లా కూర్చుని పరిష్కరించుకోవాల్సిన అంశాన్ని తెగేదాకా లాగుకున్నారు. కనీసం ఒక అవగాహనకు వచ్చి , ఒప్పందం కుదుర్చుకుని ఉంటే బాగుండేది. దానినే బోర్డు అమలు చేసి ఉండేది. ఆ మాత్రం పరిష్కారం చేసుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రాలతో ఏమాత్రం సంబంధం లేని ఛైర్మన్ల ఆధ్వర్యంలోనే ఇకపై నీటి విడుదల ఆధారపడుతుంది. డిండి మొదలు పోతిరెడ్డి పాడు వరకూ అనధికారికంగా కట్టుకున్న ప్రాజెక్టులు అన్నిటికీ ముప్పు తప్పదు. నియమనిబంధనల ప్రకారం వాటికి భవిష్యత్తులో నీటి పంపిణీ ఉండకపోవచ్చు. అంతేకాకుండా తాజాగా ఏర్పాటైన బోర్డులు తెలంగాణ, ఆంధ్రాలపైనే పెత్తనం చేస్తాయి. అటు కర్ణాటక, మహారాష్ట్ర లకు ఇప్పటికే ట్రిబ్యునల్ ప్రకారం కేటాయింపులు ఉన్నాయి. వాటి జోలికి పోవు. దీనివల్ల రాజకీయ పలుకుబడితో కర్టాటక, మహారాష్ట్రలు దిగువన పెత్తనం చేసే బోర్డులను నియంత్రించే అవకాశం ఉంటుంది. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసులకు కర్ణాటక, మహారాష్ట్రలో రాజకీయ పరమైన అవసరాలు చాలా ఎక్కువ. అందువల్ల ఆ రాష్ట్రాలు నీటిపై పెత్తనం చేస్తున్నప్పటికీ చూసీ చూడనట్లు వ్వవహరించే ప్రమాదం ఉంది. ఎంతైనా రాజకీయ ఒత్తిడితో కూడిన యంత్రాంగం లేకపోతే ఉదాసీనత నెలకొంటుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు నష్టదాయకమే. కానీ ఇప్పటికే తమ తలకు తామే కొరివి పెట్టుకున్నాయి ప్రభుత్వాలు. న్యాయబద్ధమైన వాటాల కోసం ఎదురు చూడటమే మిగిలింది. చెరపకురా చెడేవు అంటారు. రాజకీయాల్లో అది నూటికి నూరుపాళ్లు నిజం. అటు పోతిరెడ్డిపాడుపై అత్యుత్సాహం చూపించి ఆంధ్రప్రదేశ్, ఇటు జలవిద్యుత్ తో నీటిని వృథా చేసి తెలంగాణ రాజకీయం చేస్తున్నామనుకున్నాయి. మొదటికే చేటు తెచ్చుకున్నాయి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News