జగన్ అలెర్ట్ గా లేకపోతే..?

ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీలు విజయం తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఓటరు నాడి [more]

Update: 2019-04-23 02:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో హోరాహోరీగా ఎన్నికలు జరిగాయి. అభ్యర్థులు గెలుపోటముల లెక్కలు వేసుకుంటున్నారు. పార్టీలు విజయం తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఓటరు నాడి ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో కచ్చితంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. బయటకు తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, లోలోన మాత్రం ఈ రెండు పార్టీలకూ విజయంపై పూర్తి ధీమా లేదు. ఈ విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కొంత ధైర్యంగా.. తాము అధికారంలోకి వస్తామని ధీమాగా చెబుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా తాము 140 స్థానాలు గెలుస్తామని చెబుతున్నా.. ఎన్నికలు సరిగ్గా జరగలేదని, ఈవీఎంలలో లోపాలు ఉన్నాయని పదేపదే ఆరోపణలు చేస్తుండటం ద్వారా వారిలో గెలుపుపై ధీమా లేదనే వాదన వస్తోంది.

మ్యాజిక్ ఫిగర్ కనుక రాకుంటే…

అయితే, ఫలితాలు మాత్రం ఏ పార్టీకీ ఏకపక్షంగా రాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు పరిస్థితులు జగన్ కు అనుకూలంగా ఉన్నాయని, ఆయన భారీ విజయం సాధించనున్నారనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఎన్నికల వేళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చంద్రబాబు వైపు కూడా మొగ్గు పెంచాయనే అంచనాలు ఉన్నాయని పసుపు కుంకుమ, పింఛన్ల పెంపు ఆయనకు చివరి నిమిషంలో మేలు చేశాయంటున్నారు. మొత్తంగా ఏ పార్టీకీ ఏకపక్షంగా అయితే ఫలితాలు ఉండవంటున్నారు. ఒకవేళ ఎవరికీ మ్యాజిక్ ఫిగర్ రాని పరిస్థితుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ భావిస్తున్నారట. గత అనుభవాల దృష్ట్యాల తెలుగుదేశం పార్టీని తక్కువ అంచనా వేయొద్దని జగన్ భావిస్తున్నారు. ఫలితాలు ఎలా ఉన్నా జాగ్రత్తగా వ్యవహరించి ఎమ్మెల్యేలు చేజారకుండా చూసుకోవాలని జగన్ ప్లాన్ చేశారని సమాచారం.

ఎవరూ చేజారిపోకుండా..!

గత ఎన్నికల్లో టీడీపీ మ్యాజిక్ ఫిగర్ దక్కించుకున్నా వైసీపీని నిర్వీర్యం చేయాలని ఉద్దేశ్యంతో 23 మంది ఎమ్మెల్యేలను నయానోభయానో తమవైపు తిప్పుకున్నారు. కాబట్టి, ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ కు రెండు పార్టీలు దూరంగా ఉన్న పరిస్థితి వచ్చినా, వైసీపీకి మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని సీట్లే ఎక్కువ సాధించినా టీడీపీ పరిస్థితిని తారుమారు చేసే అవకాశం ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అవసరం లేకున్నా 23 మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలను వారివైపు తెచ్చుకునేందుకు ఎంతటి ప్రయత్నం అయినా చేస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు జగన్ ఎన్నికల ఇంఛార్జిలను నియమించారు. వీరంతా ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా గెలిచిన వారు రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి సర్టిఫికేట్ తీసుకోగానే వారిని ఒక్క చోటకు చేర్చి పార్టీ కార్యాలయానికి తీసుకురావాల్సిన బాధ్యతలను పార్లమెంటరీ ఇంఛార్జిలపై పెట్టనున్నారు. మొత్తానికి, జగన్ కు గత అనుభవాలు బాగానే పాఠాలు నేర్పినట్లు కనిపిస్తోంది.

Tags:    

Similar News