ys bharathi : కీలకం కాబోతున్నారా?

వచ్చే ఎన్నికలు వైసీపీకి కీలకం. ముఖ్యంగా జగన్ ఈసారి గెలిచి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని భావిస్తున్నారు. టీడీపీ టార్గెట్ గానే జగన్ అడుగులు పడుతున్నాయి. [more]

Update: 2021-11-11 03:30 GMT

వచ్చే ఎన్నికలు వైసీపీకి కీలకం. ముఖ్యంగా జగన్ ఈసారి గెలిచి తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో లేకుండా చేయాలని భావిస్తున్నారు. టీడీపీ టార్గెట్ గానే జగన్ అడుగులు పడుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతలను తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ కు అంతకు మించి అవకాశం లేదు. వైసీపీలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనంలోకి వెళ్లగలిగిన నేత జగన్ ఒక్కరే కన్పిస్తున్నారు.

గత ఎన్నికల్లో….

గత ఎన్నికలు ఇందుకు భిన్నం. జగన్ దాదాపు నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఈసారి అధికారంలో ఉండటంతో అది సాధ్యం కాదు. బస్సు యాత్ర వంటివి మాత్రమే చేయాల్సి ఉంటుంది. 175 నియోజకవర్గాల్లోనూ పర్యటించాల్సి ఉంటుంది. ఇక గత ఎన్నికల్లో జగన్ కు అండగా చెల్లెలు షర్మిల, తల్లి విజయమ్మ ఉన్నారు. వారు ఎన్నికల ప్రచార బాధ్యతను తమ భుజానికెత్తుకున్నారు. ప్రధానంగా షర్మిల రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేసి అన్నకు అండగా నిలిచారు

ఈసారి ఆ అవకాశం….

కానీ ఈసారి షర్మిల కూడా జగన్ కు మద్దతు తెలిపే అవకాశం లేదు. విజయమ్మ కూడా అనుమానమే. రెండు, మూడు సభలు తప్పించి అంతకు మించి ఆమె పాల్గొనకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తన సతీమణి భారతిని రాజకీయంగా ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటి వరకూ భారతి పారిశ్రామికవేత్త, గృహిణిగానే బాధ్యతలను నిర్వర్తించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తాడేపల్లిలోనే ఉంటూ జగన్ బాగోగులు చూసుకుంటున్నారు.

ప్రచారానికి భారతి….

భారతి జగన్ కు మద్దతుగా గత ఎన్నికల్లో పులివెందుల్లో ఇంటింటి ప్రచారం చేశారు కాని, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించలేదు. అయితే ఈసారి భారతిని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని జగన్ నిర్ణయించారని తెలిసింది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు భారతి ప్రచారం ఉపయోగపడుతుందన్న అంచనాలో ఉన్నారు. భారతి ఇంతవరకూ పబ్లిక్ మీటింగ్ లో పాల్గొనలేదు. దీనిపై శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వచ్చే ఎన్నికలకు భారతి వైసీపీలో కీలకం కాబోతున్నారు.

Tags:    

Similar News