భారతిని లాగేస్తున్నారుగా

ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియాల్సిన అవసరమూ లేదు. ముఖ్యమంత్రి జగన్ భార్యగా మాత్రమే జనపరిచయం. అటువంటి ఇంటి ఇల్లాలు భారతిని కూడా ఇపుడు రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. [more]

Update: 2020-01-16 08:00 GMT

ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియాల్సిన అవసరమూ లేదు. ముఖ్యమంత్రి జగన్ భార్యగా మాత్రమే జనపరిచయం. అటువంటి ఇంటి ఇల్లాలు భారతిని కూడా ఇపుడు రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. అదే వర్తమాన రాజకీయ విషాదం. ఆమె జగన్ సతీమణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతలను తెరవెనక సక్సెస్ ఫుల్ గా నెరవేరుస్తున్నారు. జగన్ తల్లి విజయలక్ష్మి. చెల్లెలు షర్మిల రాజకీయాల్లో ఉన్నా ఆమె మాత్రం ఎపుడూ తెర వెనకే ఉంటున్నారు. ఇపుడు జగన్ సీఎం కావడంతో భారతిని కూడా ఎక్కడా వదలడంలేదు. మరి ఎంత మమకారం చూపిస్తున్నారో కానీ ఆమెను ఏకంగా సీఎంనే చేసేస్తున్నారు. బహుశా భారతీరెడ్డి కలలో కూడా ఈ ఊసు తలవదేమో. కానీ ఎల్లో మీడియాతో పాటు, టీడీపీ నేతలు, ఎపుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జేసీ దివాకర్ రెడ్డి లాంటి వారు మాత్రం భారతీరెడ్డి కాబోయే సీఎం అంటున్నారు.

ఎందుకిలా…?

ఈ మధ్యలే టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక మీడియా తొందరలోనే భారతీరెడ్డి సీఎం అవుతుందని కధనాలు వండివార్చింది. దానికి ప్రాతిపదికగా జగన్ కేసులను ప్రస్తావించింది. జగన్ నెత్తి మీద సీబీఐ కత్తి వేలాడుతోందని, ఆయన బీజేపీ పెద్దల టార్గెట్లో ఉన్నారని కూడా రాసుకొచ్చింది. జగన్ జాతకం ఇపుడు సీబీఐ న్యాయమూర్తి చేతుల్లో ఉందని, ఆయన మీద ఉన్న కేసుల తీవ్రత ద్రుష్ట్యా వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నయంటూ తనదైన జడ్జిమెంట్ ఇచ్చేసింది. అందువల్ల జగన్ జైలుకు వెళ్తే తన భార్య భారతీరెడ్డిని సీఎం చేయాలనుకుంటున్నారని కూడా పేర్కొంది. ఈ మేరకు కుటుంబంలో చెల్లి షర్మిల, భార్య భారతీల మధ్య అధికార పీఠం గురించి పెద్ద గొడవలే జరిగిపోతున్నాయని కూడా రాసుకొచ్చారు.

మా అమ్మాయే సీఎం….

జగన్ ని మా అబ్బాయే అంటూ వెటకారం ఆడే జేసీ దివాకరరెడ్డి ఇపుడు భారతీరెడ్డి మీద బాణాలు వేశారు. అమరావతి రైతుల దీక్షలో ఆయన మాట్లాడుతూ మా అమ్మాయే రేపటి సీఎం అంటూ ప్రకటించేసారు. రేపో మాపో భారతీరెడ్డి సీఎం అవుతుందని తేల్చేశారు. అంటే జగన్ జైలుకు వెళ్తాడని జేసీ మాటల అర్ధంగా చూడాలిక్కడ. భారతీరెడ్డి సీఎం అయినా కూడా అమరావతి రైతుల ఒప్పందాలు ఏవీ రద్దు కావని అంటూ చెప్పుకొచ్చిన జేసీ జగన్ మాజీ సీఎంయే అంటూ క్లారిటీ ఇవ్వడమే అసలైన విశేషం.

బాబు ముందే…..

అదే సభలో ఓ వైపు అసెంబ్లీ రద్దు చేయమంటున్నారు చంద్రబాబు. రద్దు చేస్తే ఎన్నికలు వచ్చి తాను మళ్ళీ సీఎం కావచ్చునని ఆయన ఆలోచన. మరి చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడడానికి వచ్చిన జేసీ మాత్రం తనదైన శైలిలో జగన్ మీద విమర్శలు చేస్తూ మళ్ళీ బాబు గారినే బాధపెట్టారని సెటైర్లు పడుతున్నాయి. జగన్ జైలుకు వెళ్తే వైసీపీ సర్కర్ కుప్పకూలదని, భారతీరెడ్డి సీఎంగా ఉంటారని అర్ధం వచ్చేలా జేసీ మాట్లాడడమే బాబుకు మండుకొచ్చేలా ఉందిట. అంటే బాబుకు కాలం కలిసొచ్చి అనుకున్నట్లుగా ఏపీ పొలిటికల్ కధ ఎన్ని ట్విస్టులు తిరిగినా కూడా అధికారం మాత్రం జగన్ ఇంటి గడప దాటడని జేసీ చెప్పడం అంటే బాబు గారికి మండుకు రాదా మరి. మొత్తానికి జగనూ, కేసులూ, జైలూ మీదనే ఇపుడు టీడీపీ ఆశలు, ఆశయాలు సాగడమే విపక్ష రాజకీయ నిస్సహాయతను తెలియచేస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు.

Tags:    

Similar News