అందరూ “చిన” బాబులేనా?

బ‌ట్టత‌ల వ‌చ్చాక దొరికే దువ్వెన మాదిరిగా ఉంది టీడీపీ ప‌రిస్థితి! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావాల‌ని భావించిన చంద్రబాబు [more]

Update: 2019-10-04 05:00 GMT

బ‌ట్టత‌ల వ‌చ్చాక దొరికే దువ్వెన మాదిరిగా ఉంది టీడీపీ ప‌రిస్థితి! ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకురావాల‌ని భావించిన చంద్రబాబు అప్పట్లోనే అంటే ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు ముందుగానే యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావించారు. అయితే, పోటీ తీవ్రంగా ఉండడం, రెండో సారి ఖ‌చ్చితంగా అధికారంలోకి రావాల‌ని భావించ‌డంతో యువ‌త‌ను ప‌క్కన పెట్టారు. అయితే, ఈ క్రమంలో కొద్దిమంది వార‌సుల‌ను మాత్రం ఆయ‌న రంగంలోకి దింపారు. ఏదేమైనా.. పార్టీకి యువ‌త ప్రాధాన్యం చాలా ఉంద‌నేది ఇప్పటికి ఆయ‌న తెలుసుకున్న అస‌లు నిజం! ఈ నేప‌థ్యంలోనే రాబోయే రోజుల్లో టీడీపీ ప‌గ్గాల‌ను దాదాపు పూర్తిగా యువ‌త‌కు అప్పగించాల‌ని చూస్తున్నట్టు తెలుస్తోంది.

సీనియర్లని భావించి….

ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ విజ‌యం సాధించ‌డానికి… టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డానికి టీడీపీ వృద్ధనేత‌లు, వైసీపీ యువ‌నేత‌లు కూడా ఓ కార‌ణం. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఉన్నత విద్యావంతులు, యువ‌త‌కు జ‌గ‌న్ ఛాన్స్ ఇవ్వగా వారంద‌రు విజ‌యం సాధించారు. ఎన్ని విమ‌ర్శలు వ‌చ్చినా పార్టీ ఆవిర్భావం నుంచి మూడున్నర ద‌శాబ్దాలుగా టీడీపీలో ఉంటోన్న వారికి చంద్రబాబు తీవ్రమైన ఒత్తిళ్ల నేప‌థ్యంలో సీట్లు ఇవ్వగా వాళ్లంద‌రు ఓడిపోయారు. నిజానికి టీడీపీలో యువనేతలకు కొదవలేదు. కాకపోతే.. వారిలో వారసులే ఎక్కువగా ఉన్నారు. చాలా మంది.. తమను తాము నిరూపించుకుంటున్నారు కూడా.

అందరూ వారసులే….

అయితే.. ఎక్కువ మంది వారసులే. పాత తరం పోయి.. కొత్త తరానికి మళ్లీ టీడీపీ పగ్గాలిస్తే.. వారసులకే ఇస్తారా.. అనే అనుమానం టీడీపీ శ్రేణుల్లో ప్రారంభమయింది. కింది స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చిన వారికి అవకాశం ఇస్తే… వచ్చే గెలుపే స్థిరంగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా నాయకులయ్యే వారి పరిస్థితి ఎప్పుడూ డొలాయమానంలో ఉంటుంది. ఈ విషయం .. విద్యార్థి దశ నుంచి రాజకీయంగా ఎదిగిన టీడీపీ అధినేతకు తెలియనిదేం కాదు. కానీ.. కారణాలేమైనా… టీడీపీలో.. ఆ స్థాయిలో నాయకత్వం ఎదగలేదు. అలా అనే కంటే… అవకాశాలు కల్పించలేదు .

టీడీపీలోనే ఎక్కువగా….

అయితే, ఇప్పుడు ఈ యువ‌త లేని లోటు.. వ్యూహాత్మక త‌ప్పిదంగా క‌నిపిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు యువ‌త‌కు ప్రాధాన్యం పెంచాల‌ని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో యువ నాయ‌క‌త్వం జోరు ఎక్కువ‌గానే ఉంది. అధినేత జ‌గ‌న్ కూడా యువకుడిగానే ఉండ‌డం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా యువ‌నాయ‌కుడిగానే పాపులారిటీ సాధించ‌డంతో ఇప్పుడు ఈ లోటు ఎక్కువ‌గా టీడీపీలోనే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో టీడీపీని యువ‌నాయ‌క‌త్వానికి అప్పగించాల‌నే ప్రతిపాద‌న‌లు కూడా వ‌స్తున్నాయి.

వారికి ఇస్తే…..

అయితే, ప్రస్తుతం ఉన్న యువ‌తకు రాజ‌కీయ ప‌రిజ్ఞానం క‌లిగించి, వారికి సీనియ‌ర్లతో శిక్షణ ఇప్పించ‌డం ద్వారా టీడీపీకి ఉప‌యోగ‌ప‌డేలా తీర్చిదిద్దాల‌ని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే జ‌రిగితే.. రాష్ట్రంలో టీడీపీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న భావిస్తున్నారు. మ‌రి బాబు వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నిక‌ల్లో చంద్రబాబు కొంత‌మంది వార‌సులు అయిన యువ‌కుల‌కు సీట్లు ఇవ్వగా వాళ్లు ఎన్నిక‌ల్లో ఓడిన‌ప్పటి నుంచి అస‌లు అడ్రస్ లేకుండా పోయారు. వాళ్లు ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి.

Tags:    

Similar News