కాంగ్రెస్ అంటే అంతేరా మరి?

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం పోటీ పోటెత్తుతోంది. గత రెండు పర్యాయాలు ఎన్నికలు జరగడంతో తోలిసారి వంశీ చంద్ రెడ్డి, తదుపరి అనిల్ కుమార్ [more]

Update: 2020-03-22 09:30 GMT

తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం పోటీ పోటెత్తుతోంది. గత రెండు పర్యాయాలు ఎన్నికలు జరగడంతో తోలిసారి వంశీ చంద్ రెడ్డి, తదుపరి అనిల్ కుమార్ యాదవ్ లు భారీ గెలుపులను సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ యొక్క ఆలోచనల ప్రతిరూపంగా ప్రచారం జరిగిన ఎన్నికల వ్యవహారమంతా ఒక ప్రహసనంగా మారడంతో తాజాగా ఎన్నికలను ఆపేసి ఇంతకుముందులా నామినేటెడ్ పద్దతికి వెళ్లాలని నిర్ణయంజరిగినట్టు సమాచారం. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ను యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంతో తదుపరి తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం ఢిల్లీ కేంద్రంగా పైరవీలు జోరుగా సాగుతున్నాయి.

వారసులకు…?

అయితే ఈ పదవి తమ వారసులకు వచ్చేలా పలువురు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. ఎటువంటి వారసత్వాన్ని వ్యతిరేకిస్తూ యువజన కాంగ్రెస్ ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారో అదే ఎత్తేసినప్పుడు ఇంకా వారసులకు అడ్డు ఏంటని ఆ వారసుల అనుచరులు ప్రశ్నిస్తున్నారట. సామాన్యులకు, సొంత డబ్బు ఖర్చుపెట్టుకుని గత నాలుగేళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కనపెట్టి వారసులు రంగప్రవేశం చేసేందుకు సర్వం సిద్ధం అయినట్లు సమాచారం. ఏ నాయకుడైతే గతంలో వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ తనలాంటి సామాన్యులను, ఎటువంటి రాజకీయ ప్రవేశం లేని కుటుంబంనుండి వచ్చిన వారిని ప్రోత్సహించాలని హై కమాండ్ వద్ద పలు సందర్భాలలో ప్రస్తావించాడో అదే నాయకుడు నేడు సామాన్యుడైన తన అనుచరుడిని కాదని గత రెండేళ్లుగా ఎటువంటి కార్యక్రమాలు చేయని ఒక మాజీ ఎమ్యెల్యే కుమారుడిని రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలని పట్టుబడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.

మాజీ కేంద్ర మంత్రి తన కొడుకుని….

మరో కేంద్ర మాజీ మంత్రి కూడా తన కొడుకుని అధ్యక్షుడిని చేయాలనీ తొక్కని గడప లేదంటున్నారు. పట్టుమని పదిమంది లీడర్ల ఇంటికి కూడా పోలేని సమర్థులైన నాయకులూ జాతీయ నాయకత్వమే తాము చేసిన పనిని చూసి తమను ప్రోత్సహిస్తుందని మనసావాచా నమ్ముతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ఇంటర్వ్యూ లలో సైతం తాము కాకుంటే వారసుల పేర్ల కంటే కూడా పనిచేసిన, సామాన్యు నేతల పేర్లనే సూచించడంతో ఖంగుతిన్న ఒక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక నెలపాటు ఈ నియామకాన్ని వాయిదా వేయమని వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. అసలు యువజన కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు చేయడానికి కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు…అందరిని కలుపుకుపోయే గుణం కావాలి, కాలిబర్ ఉండాలి, నాయకత్వ లక్షణాలు ఉండాలి, పార్టీపై వల్లమాలిన అభిమానం ఉండాలి, నలుగురి బాధలు తెలిసిన వాడై ఉండాలి, ఇవ్వేమి లేని కొందరు కేవలం తమ వద్ద బోలెడంత డబ్బుంది పైపెచ్చు వారసత్వముంది అని మితిమీరిన విశ్వాసంతో ఇప్పటికే మీసాలు మెలేస్తున్నట్టు సమాచారం. ఈ నియామకంతో కాంగ్రెస్ నాయకత్వం ఆలోచనా ధోరణి ఎలా ఉందొ తెలిసిపోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అనేక మంది…..

ఇదిలా ఉండగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి కుమార్ యాదవ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ అద్యక్షుడు పోరిక సాయి శంకర్, నాగర్కర్నూలు పార్లమెంట్ అద్యక్షుడు శివసేన రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ అద్యక్షుడు నాగి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్సులు వినొద్, దిలీప్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గురిజాల వెంకట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News