యోగి డీల్ చేయలేకపోతున్నారా?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతారా? లేక ఎన్నికలకు ఏడాది ముందు యోగిని మారుస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉత్తర్ [more]

Update: 2020-01-15 17:30 GMT

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ వచ్చే ఎన్నికల వరకూ కొనసాగుతారా? లేక ఎన్నికలకు ఏడాది ముందు యోగిని మారుస్తారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్, కాంగ్రెస్ పార్టీలు సోదిలో లేకుండా పోయాయి. దీంతో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న యోగి ఆదిత్యానాధ్ ను అనూహ్యంగా ముఖ్యమంత్రిని చేశారు మోదీ, అమిత్ షాలు.

తొలినాళ్లలో కొంత…..

అయితే తొలినాళ్లలో కొంత పాలన సజావుగానే యోగి ఆదిత్యనాధ్ సాధించినా తర్వాత క్రమంగా ఆయనపై కొంత వ్యతిరేకత వస్తుందంటున్నారు. యోగి ఆదిత్యనాధ్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి తీవ్ర నష్టం కలగచేస్తాయన్న ఆందోళన అగ్రనేతల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా శాంతిభద్రతల విషయంలో యోగి ఆదిత్యనాధ్ విఫలమయ్యారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీనిని విపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి.

పెద్దగా కలసి రాక….

మరోవైపు యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అంతకు ముందు పార్లమెంటు ఎన్నికల్లో 70 స్థానాలను సాధించిన బీజేపీకి ఈసారి పది స్థానాలకు పైగానే తగ్గించుకోవాల్సి వచ్చింది. దీనికి కారణం యోగి ఆదిత్యానాధ్ పాలన తీరు అని కొందరు పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే ఆయనను మార్చి ఎన్నికల నాటికి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలన్న వాదన పార్టీలో ఊపందుకుంది.

తప్పించే అవకాశముందంటూ…..

మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జోరుగా పర్యటిస్తున్నారు. ఆమె ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాన్ని సరిగ్గా యోగి ఆదిత్యానాధ్ డీల్ చేయలేకపోతున్నారన్నది అధిష్టానం సయితం అంగీకరిస్తుంది. దీంతో ఎన్నికలు దగ్గరపడే సమయంలో యోగి ఆదిత్యనాధ్ ను తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News