యడ్డీ బిస్కట్లు అందుకేనా?

కర్ణాటక ఉప ఎన్నికల సమరం ముగిసింది. పదిహేను నియోజకవర్గాల్లో కనీసం ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆరు స్థానాలను గెలుచుకోకుంటే యడ్యూరప్ప [more]

Update: 2019-12-07 18:29 GMT

కర్ణాటక ఉప ఎన్నికల సమరం ముగిసింది. పదిహేను నియోజకవర్గాల్లో కనీసం ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించాల్సి ఉంటుంది. ఆరు స్థానాలను గెలుచుకోకుంటే యడ్యూరప్ప ఇంటి బాట పట్టక తప్పదు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 106 మంది సభ్యుల బలం ఉంది. పదిహేను నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగితే 112 సభ్యుల బలం యడ్యూరప్ప కు అవసరమవుతుంది. అయితే ఆరు స్థానాలు గెలుచుకోగలమా? లేదా? అన్న సందిగ్దత యడ్యూరప్పను సయితం పట్టిపీడిస్తుంది.

ఒంటిచేత్తో….

ఉప ఎన్నికలయితే ముగిశాయి. ఇక ఫలితాల కోసం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ఎదురు చూస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలను యడ్యూరప్ప ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పదిహేను నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. యడ్యూరప్ప అంతా ఒంటిచేత్తో ఎన్నికలను ఎదుర్కొన్నారు. కేంద్ర నాయకత్వం కూడా పూర్తిగా యడ్యూరప్ప అభీష్టానికే వదిలేసింది. అభ్యర్థుల ఎంపికను కూడా యడ్యూరప్ప ఇష్టానుసారమే చేసింది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు దక్కాయి.

అంతర్గత సర్వేలో….

కానీ బీజేపీ నిర్వహించిన అంతర్గత సర్వేలో నాలుగు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే విజయావకాశాలున్నట్లు తేలింది. దీంతో యడ్యూరప్ప మల్లగుల్లాలు పడుతున్నారు. మరో ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యుల మద్దతు అవసరం ఉంటుందని భావిస్తున్న యడ్యూరప్ప ప్రత్యర్థి పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో పడ్డారు. అందుకే ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇవ్వడం వెనక కూడా ఎమ్మెల్యేల ప్రలోభాలు గురిచేయడమేనంటున్నాయి విపక్షాలు.

మంత్రివర్గ విస్తరణ….

కర్ణాటక మంత్రి వర్గంలో 34 మందికి చోటు కల్పించే అవకాశాలున్నాయి. అయితే యడ్యూరప్ప ముఖ్యమంత్రి గా బాధ్యతలను చేపట్టిన తర్వాత ఒకసారి మాత్రమే మంత్రివర్గ విస్తరణ జరిగింది. ప్రస్తుతం యడ్యూరప్ప మంత్రివర్గంలో కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. మరో 16 మందికి చోటు కల్పించవచ్చు. అందుకే ఎన్నికల సమయంలోనూ యడ్యూరప్ప అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఒకవేళ గెలవకపోయినా ఇతర పార్టీల నేతలకు మంత్రి పదవులు ఎరవేసి రప్పించుకోవచ్చన్నది యడ్యూరప్ప వ్యూహంగా కన్పిస్తుంది. మరి డిసెంబరు 9వ తేదీన యడ్యూరప్ప భవిష్యత్తు తేలనుంది.

Tags:    

Similar News