ఆ అవకాశం ఇస్తానా?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అప్పుడే రెండు నెలలు దాటింది. కేవలం పదిహేను మందికే మంత్రి వర్గంలో చోటు కల్పించారు. కొన్ని [more]

Update: 2019-09-22 18:29 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అప్పుడే రెండు నెలలు దాటింది. కేవలం పదిహేను మందికే మంత్రి వర్గంలో చోటు కల్పించారు. కొన్ని మంత్రి పదవులను పెండింగ్ లో పెట్టారు. అయితే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని దాదాపుగా స్పష్టమవుతోంది. మెజారిటీ సంఖ్య లేకున్నా వచ్చే ఉప ఎన్నికలతో పూర్తి స్థాయి మెజారిటీని సాధిస్తామని యడ్యూరప్ప విశ్వసిస్తున్నారు. అందుకే కేంద్ర నాయకత్వం మధ్యంతరానికి మొగ్గుచూపినా యడ్యూరప్ప నో చెప్పారంటున్నారు.

దేవెగౌడ పదే పదే….

కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వస్తాయిని దాదాపు అందరూ భావించారు. మాజీ ప్రధాని దేవెగౌడ అయితే మధ్యంతర ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను ఇప్పుడే సమాయత్తం చేయడం ప్రారంభించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని దేవెగౌడ ఖచ్చితంగా చెబుతున్నారు. హస్తినలో తనకున్నసమాచారం మేరకు మధ్యంతర ఎన్నికల దిశగా బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచిస్తుందని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడంతో కర్ణాటకలో మధ్యంతర కలకలం ప్రారంభమయింది. యడ్యూరప్ప పాలనలో కుదురుకోక ముందే మధ్యంతర ఎన్నికలు వస్తాయని దేవెగౌడ గెస్ చేస్తున్నారు.

సిద్ధూ ఆశలన్నీ…..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మధ్యంతర ఎన్నికలపైనే ఆశలు పెట్టుకుంది. అందుకే యడ్యూరప్ప ప్రభుత్వం నాలుగు నెలలే ఉంటుందని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వంటివారు ప్రకటనలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల నేతలు పదమూడు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోయినప్పటికీ కేవలం అక్కడ మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు తమకు అనుకూలంగా ఉంటాయని కాంగ్రెస్ కూడా భావిస్తోంది. బీజేపీ తమ ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న మధ్యంతర ఎన్నికలను కాంగ్రెస్ కోరుకుంటోంది.

యడ్డీ అడ్డం కొట్టారా?

కాని మధ్యంతర ఎన్నికలకు యడ్యూరప్ప సుముఖంగా లేరు. ఆయన ఉప ఎన్నికలు జరిగితే వాటిలో అత్యధిక స్థానాలను గెలుచుకుని స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చని భావిస్తున్నారు. మధ్యంతరానికి మొగ్గు చూపిన కేంద్ర నాయకత్వానికి కూడా యడ్యూరప్ప ఇదే విషయాన్ని చెప్పిన్నట్లు సమాచారం. ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మీ ఇష్ట ప్రకారం చేయవచ్చనికూడా యడ్యూరప్ప అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణకూ యడ్యూరప్ప రెడీ అవుతున్నారు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయనుకుంటున్న కాంగ్రెస్, జేడీఎస్ ఆశలకు యడ్యూరప్ప గండికొట్టారు.

Tags:    

Similar News