యడ్డీని తప్పించినా… ఇబ్బందేమీ లేకుండా?

కర్ణాటక రాజకీయాలన్నీ యడ్యూరప్పకు ఆలోచనకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. యడ్యూరప్పను వచ్చే ఎన్నికల నాటికి అన్ని పదవుల నుంచి తప్పించాలన్నది అధిష్టానం వ్యూహంగా ఉంది. యడ్యూరప్పను మించిన నేతను [more]

Update: 2021-02-20 18:29 GMT

కర్ణాటక రాజకీయాలన్నీ యడ్యూరప్పకు ఆలోచనకు వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. యడ్యూరప్పను వచ్చే ఎన్నికల నాటికి అన్ని పదవుల నుంచి తప్పించాలన్నది అధిష్టానం వ్యూహంగా ఉంది. యడ్యూరప్పను మించిన నేతను తయారు చేయాలనుకున్నా అది ఇప్పట్లో సాధ్యపడేలా లేదు. అందుకే అధిష్టానం వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. జనతాదళ్ ఎస్ ను దగ్గరకు తీసుకునే విధంగా చర్యలు ప్రారంభించింది.

కీలకమైన ఛైర్మన్ పదవిని….

అందులో భాగంగానే జనతాదళ్ ఎస్ కు కీలకమైన శానసమండలి ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. జేడీఎస్ కు చెందిన బసవరాజ హోరట్టి మండలి ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇది యడ్యూరప్పకు సుతారమూ ఇష్టం లేదు. జేడీఎస్ ను దగ్గరకు తీయడం వల్ల భవిష‌్యత్ లో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని యడ్యూరప్ప భావించారు. ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించక పోయినా అధినాయకత్వం ఒత్తిడితో జేడీఎస్ కు ఈ పదవి అప్పగించారు.

కాంగ్రెస్ ను వీక్ చేసి…..

కాంగ్రెస్ ను బలహీనపర్చడమే బీజేపీ ప్రధాన లక్ష్యం. అందుకు జేడీఎస్ ను దగ్గరకు తీసుకోవాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తుంది. కానీ యడ్యూరప్ప మాత్రం జేడీఎస్ తో పొత్తు ఎప్పటికైనా ప్రమాదకరమని చెప్పినా అధినాయకత్వం విన్పించుకోలేదు. జేడీఎస్ ట్రాక్ రికార్డు చూస్తే యడ్యూరప్ప చెప్పింది నిజమే. గతంలో బీజేపీ జేడీఎస్ కారణంగా అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మరోసారి కాంగ్రెస్ కూడా జేడీఎస్ చేతిలో ఇబ్బంది పడింది.

జేడీఎస్ తో అవగాహన ఒప్పందం…?

కానీ ఇవేమీ అధినాయకత్వం లెక్క చేయడం లేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ అత్యధిక స్థానాల్లో గెలిచే అవకాశముందన్న వార్తలతో బీజేపీ అధినాయకత్వం ముందుగానే అప్రమత్తమయింది. జేడీఎస్ తో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకోకపోయినా కొన్ని కీలక నియోజకవర్గాల్లో అవగాహనతో రెండు పార్టీలు పోటీ చేసే అవకాశముంది. యడ్యూరప్పను వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంచినా పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకే జేడీఎస్ తో ముందుకు సాగాలన్నది బీజేపీ అధినాయకత్వం ఆలోచనగా ఉంది. రానున్న కాలంలో జేడీఎస్ కు మరిన్ని పదవులు దక్కే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News