మెడపై వేలాడుతుంది.. వేటు ఎప్పుడనేదే?

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కష్టాలు మొదలయినట్లే. ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే అధిష్టానం డిసైడ్ అయింది. [more]

Update: 2021-01-03 17:30 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు కష్టాలు మొదలయినట్లే. ఆయన స్వచ్ఛందంగా పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని ఇప్పటికే అధిష్టానం డిసైడ్ అయింది. ఇప్పటికే 70 ఏళ్లు దాటి పోవడం, అవినీతి ఆరోపణలు రావడం, అసంతృప్తి మొదలవ్వడంతో యడ్యూరప్పను పదవి నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందంటున్నారు. స్వచ్ఛందంగా పదవి నుంచి దిగిపోతేనే బెటర్ అన్న సంకేతాలను యడ్డీకి ఇస్తున్నాయి.

గత కొంతకాలంగా….

అసలే అసంతృప్తులు.. హైకమాండ్ తన పట్ల వ్యతిరేకతను ఎలాగోలా నెట్టుకుంటూ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాలాన్ని లాగిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ హైకమాండ్ యడ్యూరప్పకు చాలా రోజుల నుంచి అవకాశం ఇవ్వలేదు. అంటేనే ఢిల్లీలో యడ్యూరప్ప సీన్ ఏంటో చెప్పకనే తెలుస్తోంది. యడ్యూరప్ప తాను లేకుంటే కర్ణాటకలో బీజేపీ లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు హైకమాండ్ కు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయంటున్నారు.

కోర్టు తీర్పుతో…..

దీనికి తోడు ఇటీవల హైకోర్టు తీర్పు ఆయన కు మరింత ప్రతిబంధకంగా మారింది. ఐటీ పార్కుల కోసం కేటాయించిన 4 ఎకరాల భూమిని డీనోటిఫై చేసి గృహనిర్మాణాలకు అనుకూలంగా మలిచారన్నది యడ్యూరప్పపై ఆరోపణ. దీనిపై 2013లోనే లోకాయుక్త కోర్టు తీర్పు ఇచ్చింది. యడ్యూరప్ప తీరును తప్పు పట్టింది. అయితే లోకాయుక్త కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేయాలంటూ యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. అయితే దీనిని హైకోర్టు కొట్టివేయడంతో యడ్యూరప్పపై విచారణ తప్పని పరిస్థితి అయింది.

స్వచ్ఛందంగా దిగిపోవాలని…..

కోర్టు కేసు వేలాడుతున్న నేపథ్యంలో యడ్యూరప్ప పై వేటు తప్పదన్న సంకేతాలను ఢిల్లీ నుంచి ఇచ్చేశారంటున్నారు. పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని ఆయనకు సూచించినట్లు తెలిసింది. అయితే తనకు మరో రెండు నెలలు గడువు ఇవ్వాలని యడ్యూరప్ప కోరారని సమాచారం. తాజాగా కోర్టు తీర్పుతో కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంటే యడ్యూరప్ప పది రోజుల్లోనైనా దిగిపోయే అవకాశాలు కొట్టిపారేయలేమని బీజేపీ వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నాయి.

Tags:    

Similar News