కుమార సిట్యుయేషన్ రిపీట్ అయినట్లుందిగా?

ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతకు అచ్చు గుద్దినట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సరిపోతుంది. పథ్నాలుగు నెలల కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ సర్కార్ ను [more]

Update: 2020-12-09 18:29 GMT

ఎవరు తీసిన గోతిలో వారే పడతారన్న సామెతకు అచ్చు గుద్దినట్లుగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సరిపోతుంది. పథ్నాలుగు నెలల కాంగ్రెస్, జేడీఎస్ ల సంకీర్ణ సర్కార్ ను యడ్యూరప్ప నిద్రపోనివ్వలేదు. ఆరు నెలలకొకసారి క్యాంపు రాజకీయాలు నడుపుతూ హీటెక్కించేవారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసమే కుమారస్వామి, సిద్ధరామయ్యలు అప్పట్లో సమయాన్ని వెచ్చించేవారు. చివరకు యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు.

పార్టీలో అసంతృప్తి….

ఇప్పుడు సేమ్ సీన్ కర్ణాటకలో రిపీట్ అవుతుంది. అయితే ఈసారి బాధితుడు యడ్యూరప్ప కావడం విశేషం. యడ్యూరప్ప పై పార్టీలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి మొదలయింది. ఆయన వెంట కేవలం మంత్రుల్లో కొంతమంది, ఆయన నియమించిన వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు మినహా ఎవరూ లేరు. ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పార్టీకి విధేయులు కావడంతో సహజంగా పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. యడ్యూరప్ప వెంట పడి పోలోమంటూ వెళ్లే సీన్ లేదు.

అధినాయకత్వం మాత్రం….

అందుకే బీజేపీ అధినాయకత్వం కూడా యడ్యూరప్పను ఒక ఆటాడుకుంటుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రిపదవులు ఇవ్వడం, ఇంకా ఇస్తానని ప్రకటించడంతోనే యడ్యూరప్పపై అసంతృప్తి మొదలయింది. బీజేపీ నేతలు రేణుకాచార్య, రాజుగౌడ వంటి నేతలు బహిరంగంగానే యడ్యూరప్పపై విమర్శలు చేస్తున్నారు. పార్టీ పూర్తిగా అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ కనుసన్నల్లోనే నడుస్తుంది. రాష్ట్ర పార్టీ మాత్రం యడ్యూరప్పకు వ్యతిరేకంగానే ఉంది.

ఎవరూ లెక్క చేయడం లేదే?

ఇప్పటికే కొందరు నేతలు ఢిల్లీ వెళ్లి యడ్యూరప్ప, ఆయన కుమారుడు అవినీతిపనులపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేశారు. యడ్యూరప్పను కొనసాగించుకుంటూ పోతే పార్టీ కంటే ఆయనే ఎక్కువగా బలపడే అవకాశముందని కూడా కొందరు అధినాయకత్వానికి నూరిపోశారు. దీంతోనే యడ్యూరప్ప మార్పుపై ఇటు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చర్చ జరుగుతుంది. అందుకే యడ్యూరప్పను మంత్రులు, ఎమ్మెల్యేలు లైట్ గా తీసుకుంటున్నారు. గత కుమారస్వామి పరిస్థితి ఇప్పుడు యడ్యూరప్పకు ఎదురయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News