యడ్డీకి ఝలక్ ఇచ్చింది అందుకేనా?

కర్ణాటకలో యడ్యూరప్ప నిమిత్త మాత్రుడని అధిష్టానం చెప్పకనే చెెప్పింది. ఇష్టమొచ్చినట్లు రాజ్యం చేస్తానంటే కుదరదని తేల్చి చెప్పినట్లయిది. దీంతో యడ్యూరప్ప శిబిరం ఆలోచనలో పడింది. మరో మూడేళ్లు [more]

Update: 2020-06-11 16:30 GMT

కర్ణాటకలో యడ్యూరప్ప నిమిత్త మాత్రుడని అధిష్టానం చెప్పకనే చెెప్పింది. ఇష్టమొచ్చినట్లు రాజ్యం చేస్తానంటే కుదరదని తేల్చి చెప్పినట్లయిది. దీంతో యడ్యూరప్ప శిబిరం ఆలోచనలో పడింది. మరో మూడేళ్లు అధికారంలో ఉంటానన్న యడ్యూరప్ప ఆశలు ఫలించేలా కన్పించడం లేదు. యడ్యూరప్పను సాగనంపేందుకే అధిష్టానం డిసైడ్ అయిందా? అన్న వ్యాఖ్యలు కర్ణాటక భారతీయ జనతా పార్టీలో విన్పిస్తుండటం విశేషం.

యడ్డీ బలమే వేరు….

భారతీయ జనతా పార్టీ విధానమే వేరు. ఇక్కడ ముఖ్యమంత్రులు కన్నా పార్టీయే ప్రధానం. బలమైన ముఖ్యమంత్రులని బీజేపీలో చెప్పుకోదగ్గ వారెవరూ లేరు. అధిష్టానం కనుసన్నల్లోనే ముఖ్యమంత్రులు నడవాల్సి ఉంటుంది. కానీ యడ్యూరప్ప విషయానికి వచ్చే సరికి కొంత వెసులుబాటు ఇవ్వక తప్పలేదు. యడ్యూరప్పకు 70 ఏళ్లు దాటినా ఆయనను పార్టీ విధానాలకు వ్యతిరేకంగా కొనసాగించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కర్ణాటకలో యడ్యూరప్ప కారణంగానే పార్టీ అధికారంలోకి వచ్చిందన్నది వాస్తవం.

ఒంటరిగా మారి….

కానీ గత కొన్ని రోజులుగా యడ్యూరప్ప పార్టీలో ఒంటరివాడయినట్లే కన్పిస్తున్నారు. ఉప ఎన్నికల్లో గెలిచి పార్టీని అధికారంలో నిలబెట్టిన యడ్యూరప్ప ఇక అంతా తన మాట చెల్లుబాటు అవుతుందనుకున్నారు. మంత్రివర్గంలో కూడా తాను చెప్పిన వారికే పదవులు ఇప్పించుకున్నారు. కానీ కొంతకాలంగా యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర పాలనలో జోక్యం పెరిగిందని అధిష్టానానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పార్టీ కూడా యడ్యూరప్ప పై నివేదిక సమర్పించినట్లు తెలిసింది.

రాజ్యసభ ఎన్నికల్లో…..

దీంతో రాజ్యసభ ఎన్నికల్లో యడ్యూరప్ప కు బీజేపీ అధిష్టానం గట్టి ఝలక్ ఇచ్చింది. రాజ్యసభ స్థానాలకు యడ్యూరప్ప మూడు పేర్లను ప్రతిపాదించారు. ప్రభాకర్ కోరె, రమేష్ కత్తి, ప్రకాశ్ శెట్టి పేర్లను హైకమాండ్ కు యడ్యూరప్ప పంపారు. అయితే అధిష్టానం వేరే పేర్లను ఖరారు చేసింది. లింగాయత్ వర్గానికి చెందిన ఈరణ్ణ, బలహీన వర్గాలకు చెదిన అశోక్ గస్తిలకు అవకాశం ఇచ్చింది. దీంతో యడ్యూరప్ప మాట చెల్లుబాటు కాలేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వీరిద్దరూ పార్టీకి మూడు దశాబ్దాల నుంచి సేవలందిస్తున్న వారు కావడంతో యడ్యూరప్ప సయితం ఏమీ మాట్లాడలేక పోతున్నారు. కానీ యడ్యూరప్పకు మాత్రం పార్టీ హైకమాండ్ గట్టి హెచ్చరికలు జారీచేసిందనే అంటున్నారు.

Tags:    

Similar News