ఆఖరి వరకూ అలా లాగించేస్తారన్న మాట

కర్ణాటకలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ అంశం తెరమీదకు రావడంతో మళ్లీ ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల నెలరోజుల క్రితం యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. [more]

Update: 2020-03-01 17:30 GMT

కర్ణాటకలో మరోసారి మంత్రి వర్గ విస్తరణ అంశం తెరమీదకు రావడంతో మళ్లీ ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఇటీవల నెలరోజుల క్రితం యడ్యూరప్ప తన మంత్రి వర్గాన్ని విస్తరించారు. అయితే ఇంకా ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. అయితే బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని యడ్యూరప్ప చెప్పడంతో ఈసారి మంత్రి వర్గ విస్తరణలో ఎవరికి అవకాశం ఉంటుందన్న చర్చ పార్టీలో జరుగుతుంది.

ఇటీవల జరిపిన విస్తరణలో….

ఇటీవల మంత్రి వర్గ విస్తరణ జరిపారు. అయితే ఇందులో పది మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే చోటు కల్పించారు. యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడటానికి కారణమైన అనర్హత వేటు పడి, తిరిగి ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇస్తామని ఇచ్చిన మాట ప్రకారమే యడ్యూరప్ప వారికి అవకాశం కల్పించారు. ఇది భారతీయ జనతా పార్టీ సీనియర్లలో అసంతృప్తిని రాజేసింది. పార్టీ కోసం నమ్ముకున్న వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి ఎలా ఇస్తారన్న ప్రశ్న సహజంగానే తలెత్తింది.

అసమ్మతి ఎమ్మెల్యేలను…

ఇంతటితో ఆగకుండా అసంతృప్త ఎమ్మెల్యేలు రహస్య సమావేశాలు కావడం, సీనియర్ నేత జగదీష్ శెట్టర్ వారికి నేతృత్వం వహిస్తుండటం యడ్యూరప్ప గమనిస్తూనే ఉన్నారు. పార్టీ సీనియర్లలో అసంతృప్తిని ఆయన గ్రహించారు. అంతేకాకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ తో భేటీ కావడం, ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలను కలిసేందుకు ఉపక్రమిస్తుండటం వంటివి యడ్యూరప్ప ను ఆలోచనలో పడేశాయంటున్నారు.

మరోసారి మంత్రి వర్గ విస్తరణ…..

అందుకే సీనియర్ నేతలను సంతృప్తి పర్చేందుకు బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని యడ్యూరప్ప చెప్పారు. దీంతో అసమ్మతి కొంతకాలం వెయిట్ చేయక తప్పదు. ఈ విడత మంత్రివర్గ విస్తరణలో మూడు పదవులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మూడింటినీ బీజీేపీ సీనియర్ నేతలకే ఇవ్వాలని యడ్యూరప్ప డిసైడ్ అయ్యారు. తద్వారా పెరుగుతున్న అసంతృప్తిని మరికొద్దికాలం పాటు కళ్లెం వేయవచ్చన్నది అప్ప ఆలోచన. మరో మూడు ఇంకో విడతలో భర్తీ చేయనున్నారు. మొత్తం మీద మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలియడంతో ఆశావహులు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు.

Tags:    

Similar News