ఊపిరి పోశారు… ఊరటనిచ్చారు

బీఎస్ యడ్యూరప్ప… కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఊపిరిఇచ్చిన నేత. సామాన్య నేతగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన యడ్యూరప్ప రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. [more]

Update: 2020-02-26 17:30 GMT

బీఎస్ యడ్యూరప్ప… కర్ణాటకలో భారతీయ జనతా పార్టీకి ఊపిరిఇచ్చిన నేత. సామాన్య నేతగా రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా ఎదిగిన యడ్యూరప్ప రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. కేసులను చూశారు. ముఖ్యమంత్రి పదవిని పోగొట్టుకున్నారు. తిరిగి కసితో దానిని సాధించిన ఘనత కూడా యడ్యూరప్పదే. కర్ణాాటక రాజకీయాల్లో యడ్యూరప్ప పేరు లేకుండా చూడలేం. ఈనెల 27వ తేదీన యడ్యూరప్ప 78 ఏట అడుగుపెట్ట బోతున్నారు.

రాష్ట్రానికే పరిమితమై…..

యడ్యూరప్ప కేవలం రాష్ట్ర నాయకుడే. ఆయన తన రాజకీయ జీవితంలో ఏనాడూ జాతీయ స్థాయి రాజకీయాలవైపు చూడలేదు. హైకమాండ్ పలుమార్లు ఈ ప్రతిపాదనను తెచ్చినా సున్నితంగా తిరస్కరించి కన్నడనాటకే పరిమితమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కనీస స్థానాలను గెలుచుకోవడం కష్టమేనని భావించిన తరుణంలో బీజేపీకి యడ్యూరప్ప తురుపు ముక్కలా దొరికారు. ఆయన సారథ్యంలోనే బీజేపీ దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో కాలుమోపగలిగింది.

ఎవరూ ఆ సాహసం…..

తొలినుంచి భారతీయ జనతా పార్టీ పెద్దలతో యడ్యూరప్ప కు సన్నిహిత సంబంధాలున్నాయి. మరోరకంగా చెప్పాలంటే యడ్యూరప్ప ను పక్కన పెట్టే సాహసం ఏనాడు కేంద్ర నాయకత్వం చేయలేదంటే ఆయన సమర్థతే అందుకు కారణమని చెప్పకతప్పదు. కన్నడ రాష్ట్రంలో ఇప్పటికీ పెద్దదిక్కుగా యడ్యూరప్ప మాత్రమే ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా అనేక పదవులను చేపట్టారు యడ్యూరప్ప. పార్టీ నియమావళి ప్రకారం ఏడు పదుల వయసు దాటిన వారు పదవులకు దూరంగా ఉండాల్సి ఉన్నా యడ్యూరప్పకు మాత్రం అధిష్టానం ఈ విషయంలో మినహాయింపు నివ్వడం విశేషం.

రేపు బర్త్ డే ……

యడ్యూరప్ప గతంలో గనుల కుంభకోణానికి సంబంధించి కొంతకాలం జైలు జీవితం కూడా గడిపారు. తొలిసారి శివమొగ్గ జిల్లాలోని శికారిపుర నియోజకవర్గం నుంచి 1983లో తొలిసారి ఎన్నికయ్యారు. కానీ 1999లో కాంగ్రెస్ అభ్యర్థి మహాలింగప్ప చేతిలో ఓటమి పాలయ్యారు. అదే యడ్యూరప్పకు తొలి, చివరి ఓటమి. గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టి బలంలేక మూడు రోజుల్లోనే రాజీనామా చేసిన యడ్యూరప్ప కేవలం 14 నెలల్లోనే తిరిగి తన చేతిలోకి పవర్ ను తీసుకున్నరంటే ఆయన రాజకీయ చాణక్యతను వేరే చెప్పాల్సిన పనిలేదు. బలమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన యడ్యూర్పపను ఈ టర్మ్ లో కదిలించే సాహసం ఎవరూ చేయరనేది వాస్తవం. 78వ ఏట అడుగుపెడుతున్నా యడ్యూరప్పలో ఏమాత్రం ఉత్సాహం తగ్గలేదు.

Tags:    

Similar News