యడ్డీ “కొని” తెచ్చుకుంటున్నట్లుందే

యడ్యూరప్ప తనంతట తానే అసమ్మతిని కొని తెచ్చుకుంటున్నారా? పార్టీలో ఇప్పటికే పదవులు రాక అనేకమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రి వర్గ విస్తరణ సయితం అసంతృప్తి మరింత పెరుగుతుందేమోనని [more]

Update: 2019-11-30 17:30 GMT

యడ్యూరప్ప తనంతట తానే అసమ్మతిని కొని తెచ్చుకుంటున్నారా? పార్టీలో ఇప్పటికే పదవులు రాక అనేకమంది అసంతృప్తితో రగిలిపోతున్నారు. మంత్రి వర్గ విస్తరణ సయితం అసంతృప్తి మరింత పెరుగుతుందేమోనని అధిష్టానం వాయిదా వేసింది. ఎవరికి పదవులు రాకపోయినా అసమ్మతి విన్పించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళినీకుమర్ కటీర్ కు, యడ్యూరప్పకు మధ్య విభేదాలు తలెత్తాయంటున్నారు.

ఇప్పటికే అసంతృప్తి…..

పదవులు దక్కని బీజేపీ నేతలు కొందరు నళినికుమార్ కటీర్ వైపు చేరిపోయారు. ఈలోపు ఉప ఎన్నికలు వచ్చేశాయి. గతంలోనే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇస్తామని యడ్యూరప్ప ప్రకటించడంతో అసమ్మతి చెలరేగింది, రెండు స్థానాల్లో రెబెల్స్ పోటీకి దిగారు. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. పదిహేను నియోజకవర్గాల్లో కనీసం ఎనిమిది స్థానాలను బీజేపీ గెలుచుకుంటేనే అధికారంలో ఉంటుంది. లేకుంటే ప్రభుత్వం కుప్పకూలిపోతుంది.

గెలిచిన వారందరికీ…..

అయితే ఈ నేపథ్యంలో యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు మరోసారి పార్టీలో అసమ్మతిని రేపేలా ఉన్నాయి. పదిహేను నియోజకవర్గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరికీ మంత్రిపదవులు గ్యారంటీ అని యడ్యూరప్ప ప్రకటించడమే ఇందుకు కారణం. ఇప్పటికే మంత్రి పదవులు దక్కక అనేక మంది యడ్యూరప్పకు వ్యతిరేకంగా ఉన్నారు. అధిష్టానం వద్దకు వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పార్టీని తొలి నుంచి నమ్ముకున్న తమకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందారు. తర్వాత విస్తరణలోనైనా తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థించి వచ్చారు.

గెలుపుకోసమేనంటూ….

ఈ సమయంలో గెలిచిన వారందరికీ మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశమయింది. అయితే గెలుపే లక్ష్యంగా యడ్యూరప్ప ఈ ప్రకటన చేసి ఉంటారని కొందరు భావిస్తున్నారు. తమ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి ఓటేస్తే మంత్రి అవుతారని, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆశతోనైనా ఓటర్లు తమ వైపు మొగ్గు చూపుతారని యడ్యూరప్ప ఆశ. అందుకోసమే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నప్పటీకి గెలిచిన వారందరికీ మంత్రిపదవులు ఇస్తానని చెప్పడంపై బీజేపీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News