ఏది ఏమైనా…ఎంతవరకైనా?

కర్ణాటకలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. మరో ఇరవై రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండటంతో తిరిగి అన్ని పార్టీలూ అలర్ట్ [more]

Update: 2019-11-12 17:30 GMT

కర్ణాటకలో ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో కర్ణాటక రాజకీయాలు వేడెక్కాయి. మరో ఇరవై రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉండటంతో తిరిగి అన్ని పార్టీలూ అలర్ట్ అయ్యాయి. కర్ణాటకలో పదిహేను శాసనసభ స్థానాలకు వచ్చేనెల 5వ తేదీన ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదిహేను అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల భవిష్యత్తును మార్చనున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కు ఎనిమిది స్థానాలకు తక్కువగా ఉన్న బీజేపీకి ఈ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకమే.

వాటిపై ప్రత్యేక దృష్టి….

భారతీయ జనతా పార్టీ ఇప్పటికే పదిహేను నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ నియోజకవర్గాలకు నిధుల వరదను పారిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. వరద సహాయక చర్యలు, నష్టపరిహారం వంటివి కూడా అందించడంలో ఈ నియోజకవర్గాల్లో జాప్యం చేయడం లేదు. తరచూ ఆ నియోజకవర్గాల్లో యడ్యూరప్ప పర్యటిస్తూ అత్యధిక స్థానాలను గెలుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

బుధవారం తేలిపోనుంది…..

ఈ పదిహేను స్థానాల్లో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పిస్తామని యడ్యూరప్ప ఇప్పటికే స్పష్టం చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా సరేనంది. దీంతో వారికే తిరిగి టిక్కెట్ దక్కే అవకాశాలున్నాయి. అయితే అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. బుధవారం దీనిపై తీర్పు వెలువడే అవకాశముంది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చా? లేదా? అన్నది స్పష్టత రానుంది.

భరోసా కల్పిస్తూ….

తీర్పు ఎలాగున్నా అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు అన్యాయం జరగదని యడ్యూరప్ప భరోసా ఇస్తున్నారు. వారికి గాని, వారి వారసులకు గాని టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. స్థానిక భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా బుజ్జగిస్తున్నారు. వారిలో అసంతృప్తి రగలకుండా నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ ను అతి తక్కువ స్థానాలకు పరిమితం చేయాలన్నది యడ్యూరప్ప వ్యూహంగా ఉంది. మరి ఉప ఎన్నికల్లో ఎవరిని విజయం వరిస్తుందో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News