జాగు చేయనేల…?

కర్ణాటక ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్న సంబరం అధికార భారతీయ జనతా పార్టీలో కన్పించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు దాటిపోయినా ఇప్పటి వరకూ [more]

Update: 2019-12-20 16:30 GMT

కర్ణాటక ఉప ఎన్నికల్లో విజయం సాధించామన్న సంబరం అధికార భారతీయ జనతా పార్టీలో కన్పించడం లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు దాటిపోయినా ఇప్పటి వరకూ మంత్రి వర్గ విస్తరణపై ఎటువంటి సంకేతాలు కేంద్రనాయకత్వం నుంచి అందడం లేదు. యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లి వస్తే కాని మంత్రి వర్గ విస్తరణపై ఒక క్లారిటీ రాదు. అయితే ఈలోపే యడ్యూరప్ప పై వత్తిడి పెరుగుతోంది. తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ఇటు బీజేపీ సీనియర్లతో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సయితం డిమాండ్ చేస్తుండటంతో యడ్యూరప్పలో గెలిచామన్న ఆనందం కనుమరుగై పోయంది.

వెంటనే ఉంటుందని…..

నిజానికి ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని యడ్యూరప్ప ఆర్భాటంగా ప్రకటించారు. ఓడిన వాళ్లకు కూడా మంత్రిపదవులు వస్తాయని చెప్పారు. దీనికి ప్రధాన కారణం తనమీద తనకు ఉన్న నమ్మకమే కారణం. అధికారాన్ని నిలబెట్టుకున్నందుకు తన మాటకు కేంద్ర నాయకత్వం విలువ ఇస్తుందని యడ్యూరప్ప భావించారు. ఇప్పటికే యడ్యూరప్ప ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటుతున్న ప్పటికీ పూర్తి స్థాయి మంత్రి వర్గం ఏర్పడలేదు.

రోజురోజుకూ పెరుగుతున్న…

ఉప ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని కేంద్ర నాయకత్వం సయితం హామీ ఇవ్వడంతో ఈ మేరకు యడ్యూరప్ప ఆశలు పెట్టుకున్నారు. అయితే ఫలితాలు వచ్చిన వెంటనే మంత్రి వర్గ విస్తరణ జరగక పోవడంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్ర నాయకత్వం తనను పట్టించుకోకపోవడంతో ఓటమి పాలయిన వారికి మంత్రి పదవులు ఇచ్చేది లేదని యడ్యూరప్ప మాట మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు యడ్యూరప్పను కలిసేందుకు ఏదో ఒక సాకుతో ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు.

అసంతృప్తి మొదలయిందా?

ఇక ఉప ముఖ్యమంత్రి పదవుల విషయంలోనూ అప్పుడే అసంతృప్తి బయలుదేరింది. ఇటీవల గెలిచిన రమేష్ జార్ఖిహోళి, సీనియర్ నేత శ్రీరాములు మధ్య ఉప ముఖ్యమంత్రి పదవి పంచాయతీ మొదలయింది. మరోవైపు కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో సయితం అసహనం కన్పిస్తుంది. ఇక సీనియర్ నేతల సంగతి సరే సరి. ఈ నెలాఖరుకు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పార్టీ వర్గాలు చూచాయగా చెబుతున్నప్పటికీ అమిత్ షా వరమిస్తేనే అది సాధ్యమవుతుంది. మరి మంత్రి వర్గ విస్తరణలో జాప్యం జరుగుతుండటంతో రోజురోజుకూ అధికార పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది.

Tags:    

Similar News