మళ్లీ ఆయనే శత్రువా?

యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో అసంతృప్తి క్రమంగా చోటు చేసుకుంటోంది. గతంలో యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి [more]

Update: 2020-02-23 18:29 GMT

యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేశారు. అంతా సజావుగా సాగుతుందనుకుంటున్న సమయంలో అసంతృప్తి క్రమంగా చోటు చేసుకుంటోంది. గతంలో యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించి అప్పట్లో ముఖ్యమంత్రి అయిన జగదీష్ షెట్టర్ నేతృత్వంలోనే తిరిగి అసమ్మతి రాజుకుంటుండటం విశేషం. తిరిగి పాత కథ కన్నడనాట రిపీట్ అవుతుందా? అన్న సందేహాలు కమలం పార్టీలో నెలకొని ఉన్నాయి.

కేబినెట్ విస్తరణ తర్వాత….

ఇటీవలే యడ్యూరప్ప కేబినెట్ విస్తరించి పక్షం రోజులు దాటింది. అయితే సీనియర్ నేతలెవ్వరికీ ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడతో వారు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ మారి వచ్చిన వారికి యడ్యూరప్ప పెద్ద పీట వేశారు. మొత్తం 10 మందిని కేబినెట్ లో యడ్యూరప్ప చేర్చుకోగా అందులో తొమ్మిది మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలే కావడం గమనార్హం. యడ్యూరప్ప పట్టుబట్టి అధిష్టానాన్ని ఒప్పించి మరీ వారికి పదవులు కట్టబెట్టారు.

జగదీష్ షెట్టర్ నేతృత్వంలో…

ఈ నేపథ్యంలో యడ్యూరప్ప కేబినెట్ లో మంత్రిగా ఉన్నా జగదీష్ షెట్టర్ నివాసంలో ఇటీవల రహస్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కని వారు ఈ సమావేశానికి వచ్చి యడ్యూరప్పపై తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అయితే వీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారన్నది బయటకు రాకపోయినా బీజేపీలో ఏదో జరుగుతుందన్నది మాత్రం అర్థమవుతోంది.

మరోసారి విస్తరణ?

అలాగే దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ తో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. యడ్యూరప్ప నిర్ణయంపై వీరంతా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీ మారిన వారికే పదవులా? అని ప్రశ్నించినట్లు సమాచారం. గతంలోనూ జగదీష్ షెట్టర్ యడ్యూరప్ప సీఎం పదవి నుంచి దిగిపోవడానికి కారణమయ్యారు. మళ్లీ అదే కథ రిపీట్ అయ్యేలా ఉందన్న వ్యాఖ్యలు కన్నడనాట విన్పిస్తున్నాయి. అయితే మరోసారి మంత్రి వర్గ విస్తరణ ఉండటంతో వీరంతా వేచి చూస్తారా? లేదా యాక్షన్ లోకి దిగుతారా? అన్నది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News