త‌ప్పు నీదంటే.. నీదే.. సంప్ర‌దాయాల‌పై స‌భ‌లో త‌లోమాట‌

ఏపీ అసెంబ్లీ సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో కొలువుదీరిన నేప‌థ్యంలో తొలి రోజు స‌భా ప‌తి ఎన్నిక‌, ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్పగించే సంప్ర‌దాయానికి ప‌రిమితమైంది. అయితే, ఈ క్ర‌మంలో [more]

Update: 2019-06-14 06:30 GMT

ఏపీ అసెంబ్లీ సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో కొలువుదీరిన నేప‌థ్యంలో తొలి రోజు స‌భా ప‌తి ఎన్నిక‌, ఆయ‌న‌కు బాధ్య‌త‌లు అప్పగించే సంప్ర‌దాయానికి ప‌రిమితమైంది. అయితే, ఈ క్ర‌మంలో స‌భాప‌తి గా ఎన్నికైన ఆముదాల వ‌ల‌స ఎమ్మెల్యే త‌మ్మి నేని సీతారాంను స‌గౌర‌వంగా స‌భాప‌తి స్థానంలో క‌ర్చోబెట్టే వ్య‌వ‌హారం దుమారానికి తెర‌దీసింది. తొలి రోజు ఇదే విషయం హాట్ హాట్‌గా సాగింది. స‌భాప‌తిస్థానంలోకి కొత్త‌గా ఎన్నికైన స్పీక‌ర్‌ను తీసుకుని వెళ్లేందుకు స‌భానేత‌గా సీఎం జ‌గ‌న్‌, అదేస‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న మాజీ సీఎం చంద్ర‌బాబు కూడా వెంట‌రావ‌డం అనేది సంప్ర‌దాయం.

గ‌తంలోనూ ప్ర‌తిపక్షంలో ఎంత‌మంది ఉన్నార‌నే విష‌యంతో సంబంధం లేకుండానే ప్ర‌తిప‌క్ష నేత కూడా స్పీక‌ర్ ను వెంట బెట్టుకుని స‌భాప‌తి స్థానం వ‌ర‌కు తోడ్కొని వెళ్తారు. అయితే, తాజాగా ఇప్పుడు జ‌రిగిన స‌భాప‌తి ఎన్నిక విష‌యం లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబు రాకుండా స‌భాప‌తిని తోడ్కొని వెళ్లే క్ర‌మంలో చంద్ర‌బాబు స్థానంలో మాజీ మంత్రి అచ్చన్నాయుడు వ‌చ్చారు. ఇది అప్ప‌టికి ఓకే అయినా.. త‌ర్వాత మాత్రం దీనిపై దుమారం రేగింది. స‌త్తెన‌ప‌ల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబ‌టి రాంబాబు.. ఈ విష‌యాన్ని తొలుత లేవ‌నెత్తారు.

సభా సంప్ర‌దాయాల గురించి మాట్లాడే ముందు.. ఇప్పుడు జ‌రిగిన విష‌యాన్ని ప్ర‌శ్నించుకోవాల‌ని అంబ‌టి సున్నితం గానే చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. ఒక బీసీ నాయ‌కుడికి జ‌గ‌న్ స‌భాప‌తి స్థానాన్ని అప్ప‌గించిన‌ప్పుడు.. బీసీల ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చామ‌ని చెప్పుకొనే చంద్ర‌బాబు.. క‌నీసం స‌భాప‌తికి ఇవ్వాల్సిన మ‌ర్యాద‌ను కూడా ఇవ్వ‌లేక పోయారని దుయ్య‌బ‌ట్టారు. ఈ క్ర‌మంలో జోక్యం చేసుకున్న ప్ర‌భుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి.. కూడా చంద్ర‌బాబుపై విరుచుకుపడ్డారు. స‌భాప‌తిని తోడ్కొని వెళ్ల‌డంలో క‌నీస మ‌ర్యాద‌ను పాటించ‌లేద‌న్నారు.

అయితే, దీనికి కౌంట‌ర్‌గా ప్ర‌తిపక్ష నాయ‌కుడు చంద్ర‌బాబు కూడా వెన‌క్కి త‌గ్గ‌కుండానే జ‌వాబు ఇచ్చారు. త‌న‌కు స‌భా మ‌ర్యాద తెలుసన్న ఆయ‌న‌.. అధికార ప‌క్షం నుంచి త‌న‌కు క‌నీసం స‌మాచారం కూడా అంద‌లేద‌ని, పోనీ ప్రొటెం స్పీక‌ర్ అయినా.. త‌మ‌ను పిలుస్తార‌ని భావించామ‌ని, అయినా కూడా త‌మ‌కు ఆహ్వానం అంద‌లేద‌ని అన్నారు. గ‌తంలో కోడెల శివ‌ప్ర‌సాద్‌ను స్పీక‌ర్‌గా ఎన్నుకున్న నేప‌థ్యంలో విష‌యాన్ని అప్ప‌టి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్‌కు చెప్పి, ప్ర‌పోజ‌ల్‌పై ఆయ‌న సంత‌కం కూడా తీసుకున్నామ‌ని, కానీ, ఇప్పుడు మాత్రం అన్నీ ఏక‌ప‌క్షంగా నేచేసుకున్నార‌ని వివ‌రించారు. ఇక‌, ఈ విష‌యం వివాదానికి దారితీస్తున్న క్ర‌మంలో జోక్యం చేసుకున్న స్పీక‌ర్ త‌మ్మినేని.. జ‌రిగిందేదో జ‌రిగిపోయింది.. ఈ విష‌యాన్ని ఇక్క‌డితో స‌రిపెట్టేద్దాం! అన‌డంతో స‌భ‌లో సానుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది.

Tags:    

Similar News