వైసీపీ ఎంపీల ఫైర్‌.. కెమిస్ట్రీ పోరులో న‌గిలిపోతున్నారా?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో నేత‌లు కెమిస్ట్రీ కుద‌ర‌క‌.. అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా ? సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడ‌దామంటే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇవ్వని ప‌రిస్థితిలో త‌మ‌లో తామే కుమిలిపోతున్నారా? [more]

Update: 2020-07-02 15:30 GMT

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో నేత‌లు కెమిస్ట్రీ కుద‌ర‌క‌.. అసంతృప్తితో ర‌గిలిపోతున్నారా ? సీఎం జ‌గ‌న్‌తో మాట్లాడ‌దామంటే ఆయ‌న అప్పాయింట్‌మెంట్ ఇవ్వని ప‌రిస్థితిలో త‌మ‌లో తామే కుమిలిపోతున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. జిల్లాల వారీగా చూసుకుంటే.. ప్రకాశం, నెల్లూరు జిల్లాల విష‌యానికి వ‌స్తే.. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు స‌భ్యుడు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, నెల్లూరు పార్ల మెంటు స‌భ్యుడు ఆదాల పభాకర్‌రెడ్డిలు ఇద్దరూ కూడా తీవ్ర అసంతృప్తితో ర‌గిలి పోతున్నార‌నే ప్రచారం జోరుగా సాగుతోంది. త‌మ‌కు జిల్లాలో ఎవ‌రూ స‌హ‌క‌రించ‌డం లేద‌ని, త‌మ‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కూడా వారు ఫీల‌వుతున్నారు.

అదే సామాజికవర్గం అయినా….

ఇటు, ప్రకాశంలోను, అటు నెల్లూరులోనూ రెడ్డి సామాజిక వ‌ర్గం హవా ఎక్కువ‌గా న‌డుస్తోంది. బాలినేని శ్రీనివాస్‌స‌రెడ్డి నుంచి నెల్లూరులో మేక‌పాటి గౌతంరెడ్డి వంటి కీల‌క నేత‌లు చ‌క్రం తిప్పుతున్నారు. దీంతో త‌మ‌కు కూడా ప్రాధాన్యం ద‌క్కుతుంద‌ని, ఎంపీలు మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ప్రభాక‌ర్‌రెడ్డిలు భావించారు. కానీ, వీరికి కెమిస్ట్రీ కుద‌ర‌డం లేదు. ఒంగోలు నుంచి విజ‌యంసాధించిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎన్నిక‌ల‌కు ముందు.. టీడీపీ నుంచి వ‌చ్చి వైసీపీలో చేరారు. ఆవెంట‌నే గెలిచారు. అయితే, ఈయ‌న‌కు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయ‌కుల‌కు మ‌ధ్య కెమిస్ట్రీ కుద‌ర‌లేదు. దీంతో ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి……

పైగా జిల్లాలో మంత్రులు అయిన బాలినేని శ్రీనివాసుల రెడ్డి, ఆదిమూల‌పు సురేష్ హ‌వా ఎక్కువ‌గా ఉండ‌డం.. దిగువ శ్రేణి నాయ‌కులు కూడా మంత్రుల క‌నుస‌న్నల్లోనే నడుస్తుండ‌డంతో మాగుంట ప‌రిస్థితి డోలాయ‌మానంగా మారింది. ఓ ఎంపీగా ఉండి చిన్నప‌ని కూడా చేయించుకునే ప‌రిస్థితి లేద‌ట‌. ఒక వేళ తాను ఏదైనా చిన్న ప‌ని చేయించుకోవాల‌న్నా మంత్రులో లేదా, ఎమ్మెల్యేల‌నో అడ‌గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోతున్నార‌ట‌. ఇక‌, ఆదాల ప్రభాక‌ర్‌రెడ్డి ప‌రిస్తితి కూడా డిటో ఇలానే ఉంద‌ని అంటున్నారు. ఈయ‌న కూడా గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మాత్రమే టీడీపీలోకి వ‌చ్చారు. దీంతో ఆయ‌న‌తోనూ పార్టీలో ఆది నుంచి ఉన్నవారు క‌లిసిమెలిసి ప‌నిచేసేందుకు ఉత్సాహం చూపించ‌డం లేదు. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఈయ‌న కూడా త‌ర్జన భ‌ర్జన ప‌డుతున్నారు.

ఆదాల పరిస్థితి……

పోనీ.. సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. త‌మ ప‌రిస్థితి వివ‌రించాలని, నియోజ‌క‌వ‌ర్గం స‌మ‌స్యల‌పై ఆయ‌న‌తో చ‌ర్చిద్దామ‌ని అనుకుంటున్నా.. సీఎం జ‌గ‌న్ ఎవ‌రికీ త‌న అప్పాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. నెల్లూరు వైసీపీలో నాలుగు గ్రూపులు ఉన్నాయి. అనిల్‌, ఆనం, ప్రస‌న్నకుమార్‌, కాకాణి ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్లల్లో వీళ్లకే ప‌డ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఈ నేప‌థ్యంలో ఆదాల మాట‌ను ప‌ట్టించుకునే వాళ్లే లేర‌ట‌.

జగన్ కల్పించుకుంటేనే…..

దీంతో ఈ ఇద్దరు ఎంపీలు మాన‌సికంగా న‌లిగిపోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్పటికైనా సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకుంటేనే ప‌రిస్థితి బెట‌ర్ అవుతుంద‌ని సూచిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులంద‌రూ ఎంపీల‌ను క‌లుపుకొని పోయేలా వారికి కూడా ప్రాధాన్యం ద‌క్కేలా ఆదేశాలు ఇస్తే.. స‌మ‌స్యలు లేకుండా పోతాయ‌ని అంటున్నారు. ఎంపీ ర‌ఘురామ‌కృష్ణరాజు వ్యవ‌హారం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత వైసీపీ ఎంపీల‌పైనే ఇప్పుడు అంద‌రి దృష్టీ ఉండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News